– రైతులు శాస్త్రీయ పరిజ్ఞానంతో పంటలు పండించాలి
– పొలాల్లో ఒకే పంట కాకుండా అంతర్ పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలి
– శాస్త్రవేత్తలు తయారుచేసిన విత్తనాలను రైతులకు అందించేలా చర్యలు
– వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం ధారూర్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ధారూర్: అత్యధికంగా పంటలు పండించే రాష్ట్రం తెలంగాణ. రైతులు ఆర్థికంగా మరింత ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులు శాస్త్రీయ పరిజ్ఞానంతో పంటలు పండించాలని, యూరియా, పురుగు మందుల వాడకాన్ని తగ్గించాలని ఆయన తెలిపారు. రైతులు ఉద్యానవన పంటలను వేసే విధంగా ప్రోత్సహించాలని సూచించారు.
ఆయిల్ ఫామ్ పంటలు వేసినట్లయితే రైతులు ఆదాయ పరంగా ఎదుగుతారని ఆయన అన్నారు. పొలాల్లో ఒకే పంట కాకుండా అంతర్ పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. భూసార పరీక్షలు నిర్వహించి వాటికనుగుణంగా పంటలు సాగు చేయాలని మంత్రి తెలిపారు.
రైతులు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమలు స్థాపించుకునేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. వంట నష్టపోయిన రైతులకు పంట బీమా ను వర్తింప చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.
ఇప్పటికీ రైతు బీమా, రైతు భరోసా కింద 33 వేల కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రైతులే నిజమైన శాస్త్రవేత్తలని మంత్రి అన్నారు. శాస్త్రవేత్తలు తయారుచేసిన విత్తనాలను రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులే స్వయంగా విత్తనాలు తయారు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు.
శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ… భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమన్నారు. రైతులు ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో వ్యవసాయం చేసే విధంగా శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. రైతులకు నాణ్యమైన వంగడాలను అందించినట్లయితే నష్టాల బారిన పడకుండా ఉంటారని తెలిపారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా వర్షాధార పంటలపైనే ఆధారపడి ఉంటారని, రైతు రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు సూచన చేస్తూ పంట మార్పిడి వేసుకునే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. గతంలో ధరణి వల్ల రైతులు ఎంతగానో ఇబ్బంది పడ్డారని, రైతుల కష్టాలను తీర్చే దిశగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి , PJTAU వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్తాస్ జానయ్య , జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి, రైతు సంక్షేమ కమిటీ సభ్యులు సునీల్, జనార్దన్ రెడ్డి, సైంటిస్టులు, రైతులు పాల్గొన్నారు.