‘డాక్టర్ దాశరథి రంగాచార్య జీవన సాఫల్య పురస్కారం’
విజయవాడ: ప్రముఖ చరిత్రకారుడు, బహుగ్రంథ రచయిత, సీనియర్ పాత్రికేయుడు సయ్యద్ నశీర్ అహమ్మద్ కు హిందూపురం చెందిన అఖిల భారత ఫ్రీడం ఫైటర్ షహీద్ టిపూ సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ “డాక్టర్ దాశరథి రంగాచార్య జీవన సాఫల్య పురస్కారం” ప్రకటించింది. సోమవారం ఫ్రంట్ ప్రధాన కార్యనిర్వాహకులు, రచయిత కల్లూరి ఉమర్ ఫరూఖ్ ఖాన్ నుండి నశీర్ అహమ్మద్ వర్తమానం అందుకున్నారు.
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ముస్లిం జనసముదాయాలు నిర్వహించిన సాహసోపేత త్యాగమయ పాత్రను వివరిస్తూ, మూడు దశాబ్దాలుగా రచనావ్యాసంగం సాగిస్తున్న నశీర్ అహమ్మద్ తెలుగులో 25 పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను రచించి, వెలువరించారు. ఆయన వెలువరించిన పలు గ్రంథాలు ఆంగ్లం, ఉర్దూ, హిందీ, తమిళం, కన్నడం, గుజరాతి భాషలలో కూడా అనువదించబడి వెలువడ్డాయి.
చరిత్ర గ్రంథ రచన వరకు మాత్రమే నశీర్ అహమ్మద్ సరిపెట్టుకోకుండా స్వాతంత్య్ర సమర యోధుల త్యాగమయ, సాహసోపేత పాత్రను ప్రజలకు, ముఖ్యంగా యువత, విద్యార్థులకు తెలియపర్చుతూ పలు వినూత్న ప్రచార కార్యక్రమాలను ఆయన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అవిశ్రాంతంగా నిర్వహిస్తున్నారు. చరిత్ర గ్రంథాల రచన, ప్రచురణను వ్యాపార దృష్టితో కాకుండా సేవా దృష్టితో నిర్వహిస్తున్న నశీర్ అహమ్మద్ తన కుటుంబం, వదాన్యులైన తన మిత్రుల ఆర్థిక సహకారంతో తాను ప్రచురించిన గ్రంథాలను ఎంపిక చేసిన వందలాది గ్రంథాలయాలకు, చరిత్రకారులకు, జర్నలిస్టులకు తన వదాన్యుల చిరుగానుకగా అందిస్తున్నారు.
ఈ గ్రంథాల పీడీఎఫ్ ఫైళ్ళను ప్రత్యేకంగా తయారుచేయించి ఆసక్తి చూపిన లక్షలాది పాఠకులకు అంతర్జాలం ద్వారా ఉచితంగా అందజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాఠకుల సౌకర్యార్థం తన గ్రంథాలన్నిటిని అంతర్జాల మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉంచారు. చరిత్ర రంగాన మూడు దశాబ్దాలుగా సయ్యద్ నశీర్ అహమ్మద్ అవిశ్రాంతంగా సాగిస్తున్న అవిరళ కృషికి గుర్తింపుగా ప్రస్తుతం ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందజేయనున్నామని ఫరూఖ్ ఖాన్ వెల్లడించారు. ఈ నెల 20న హిందూపురంలో జరగనున్న ” భారత ముస్లిం లెజెండ్స్ ” పుస్తకావిష్కరణ సందర్భంగా ఏర్పాటు కానున్న భారీ బహిరంగ సభలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్నీ సయ్యద్ నశీర్ అహమ్మద్ కు అందజేయనున్నామని కల్లూరి ఉమర్ ఫరూఖ్ వెల్లడించారని సయ్యద్ నశీర్ అహమ్మద్ విలేకరులకు వివరించారు.