– ఇంటర్ విద్యార్థిని హత్యపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత దిగ్భ్రాంతి
అమరావతి: కడప జిల్లా, గండికోటలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని హత్యకు గురికావడంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గండికోటలో దారుణ హత్యకు గురికావడంపై ఆమె విచారం వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి సానుభూతి వ్యక్తంచేశారు. మహిళలు, బాలికలపై హత్యలకు, హత్యాచారాలకు పాల్పడితే సహించేది లేదని, ఉక్కుపాదంతో అణచివేస్తామని, అటువంటి మానవ మృగాళ్లకు అదే చివరి రోజు అని మంత్రి సవిత హెచ్చరించారు.