– నెలాఖరులో బాబు సింగపూర్ పర్యటన
– అప్పుడు పవన్‌కు ఇన్చార్జి బాధ్యతలంటూ సోషల్‌మీడియాలో చక్కర్లు
– అది సాధ్యం కాదంటున్న పార్టీ వర్గాలు
– గతంలో కూడా ఎవరికీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించలేదని గుర్తు చేస్తున్న నేతలు
– ఇవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేస్తున్న పార్టీ వర్గాలు
– ఇద్దరి మధ్య వైరం కోసమే ఈ పుకార్లంటున్న సీనియర్లు
అమరావతి: సీఎం చంద్రబాబునాయుడు తన మంత్రుల బృందంతో కలసి ఈనెలలో సింగపూర్ పర్యటనకు వెళుతున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్‌కు, ఇన్చార్జి సీఎం బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారంతో సోషల్‌మీడియా హోరెత్తిపోతోంది. గత రెండు రోజుల నుంచి సోషల్‌మీడియాలో ఈ వార్తా కథనం తెగ చక్కర్లు కొడుతుండటం, ఇది సహజంగా అటు జనసేన వర్గాల్లోనూ
ఆసక్తికి రేకెత్తించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే ఇవన్నీ పుకార్లు, ఊహాగానాలేనని పార్టీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. టీడీపీ-జనసేన మధ్య చిచ్చుపెట్టేందుకు.. వైసీపీ సోషల్‌మీడియా వ్యూహాత్మకంగా, సోషల్‌మీడియా వేదికగా ఆడుతున్న రాజకీయ చదరంగమేనంటున్నారు. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు, ఏ ఉప ముఖ్యమంత్రికీ ఇన్చార్జి సీఎం బాధ్యతలు అప్పగించలేదని పార్టీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు.
గతంలో చంద్రబాబునాయుడు, జగన్ క్యాబినెట్లో కూడా డిప్యూటీ సీఎంలు ఉన్నప్పటికీ.. వారిద్దరి విదేశీ పర్యటన సమయంలో, ఎవరికీ ఇన్చార్జి సీఎం బాధ్యతలు అప్పగించలేదని స్పష్టం చేస్తున్నారు. అక్కడి నుంచే సమీక్షలు నిర్వహించేవారని గుర్తు చేస్తున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రులను గౌరవించడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని చెబుతున్నారు.
గతంలో కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాల్లో చాలామంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ, ఎవరి ఫొటోలు సచివాలయం సహా ప్రభుత్వ కార్యాలయాల్లో
పెట్టలేదని.. చంద్రబాబు ఒక్కరే పవన్ కల్యాణ్ ఫొటోలు సచివాలయంలోని మంత్రుల చాంబర్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసుస్టేషన్లలో ఉంచారని గుర్తు చేస్తున్నారు. ఆ విధంగా పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు గౌరవిస్తున్నారంటున్నారు.
కూటమి ఐక్యంగా నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో.. బాబు విదేశీ పర్యటన సమయాన్ని తమకు అనుకూలంగా మలచుకుని, టీడీపీ-జనసేన మధ్య విబేధాలు సృష్టించడమే సోషల్‌మీడియా వార్తల అసలు లక్ష్యమని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అటు పవన్ కల్యాణ్ కూడా తనకు ఇన్చార్జి సీఎం కావాలని కోరలేదని, ఆయన కూడా ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.
రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు తన కేబినెట్ లోని ఓ మంత్రికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వొచ్చు. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పవన్ కల్యాణ్ కు అలా బాధ్యతలు ఇవ్వాలనుకుంటే చంద్రబాబు ఇవ్వొచ్చు.
అయితే రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి అనే పదవిపై ఎలాంటి నిబంధనలు లేవు. ఇది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. కేవలం రాజకీయ సంప్రదాయంగా ఏర్పడిన పదవి మాత్రమే. అందువల్ల, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఉప ముఖ్యమంత్రి లేదా ఇతర మంత్రులలో ఒకరు తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టడం అనేది సంప్రదాయం మాత్రమే. అది కూడా ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. చట్టం ఈ విషయంలో ఎటువంటి స్పష్టమైన నిబంధనలను నిర్దేశించలేదని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.