– రెండో దశ సమీకరణకు ఇదే ప్రధాన అడ్డంకి
– ఇప్పటికే అప్పులు తెస్తున్న ప్రభుత్వం
– భూముల విలువ తగ్గిపోయింది
– విలువ పెరగాలంటే రాజధానిలో నిర్మాణాలు చేపట్టాలి
– సీడ్ క్యాపిటల్ నిర్మించడం ద్వారా భూములకు విలువ పెరగడం లేదు
– ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన తర్వాత స్పష్టత
అమరావతి రాజధాని నిర్మాణంలో రెండోదశ భూ సమీకరణకు అమోదించినా అమలు చేయకపోవడం వెనుక నిధుల సేకరణే ప్రధాన సమస్యగా ఉందని తెలిసింది. రెండోదశలో 20,496 ఎకరాలు సమీకరించేందుకు సిఆర్డీఏ ఆధారిటీ ఆమోదం తెలిపినా సమీకరణ ప్రక్రియ ప్రారంభించలేదు.
దీనివెనుక గతంలో ఇచ్చిన భూముల్లో ప్లాట్లే అభివృద్ధి చేయలేదనే అసంతృప్తి ఒకటయితే అదనంగా సమీకరించే భూముల్లో అభివృద్ధి చేసేందుకు నిధులు ఎక్కడ నుండి తీసుకురావాలనేది మరొక ప్రధాన అడ్డంకిగా మారింది.
ఇటీవల సీఎం వద్ద జరిగిన సమావేశంలో ఇదే విషయంపై చర్చ జరిగినట్లు తెలిసింది. గతంలో ఉన్న 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి
చేసేందుకుగానీ, ఆమోదించిన పనులు పూర్తి చేసేందుకుగానీ కనీసం రూ.64 వేల కోట్లు ఖర్చవుతాయని లెక్కలు వేశారు. రూ.42 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. రూ.20,400 కోట్ల విలువైన పనులు అప్పగించారు.
ఇందులోనూ ప్రపంచబ్యాంకు నుండి రూ.15 వేలకోట్లు, హడ్కో జర్మనీ బ్యాంకుల నుండి మరికొంత మొత్తాన్ని తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా తిరిగి
చెలించాల్సిన అప్పులే. మరోవైపు నెలవారీ నిర్వహణ కోసం ఆర్బిఐ నుండి ఇతర ఆర్థిక సంస్థల నిధులు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా పూలింగుకు వెళితే అక్కడ మూడేళ్లలో అభివృద్ధి చేసి ప్లాట్లు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత రాజధాని మాస్టర్ ప్లాను అక్కడ కూడా అమలు చేయాలి. అంటే ఎకరానికి రూ.1.25 కోట్లు చొప్పున ఎంతకాదన్నా కనీసం రూ.25 వేల కోట్ల నుండి రూ.30 వేల కోట్ల రూపాయలు అభివృద్ధికే కావాల్సి ఉంటుంది.
ఇంత పెద్దమొత్తం ఎక్కడ నుండి సేకరించాలనే ఆలోచన ప్రభుత్వంలో మొదలైంది. దేశవాళీగా ఎక్కువ అప్పులిచ్చే హడ్కో నుండి ఇప్పటికే రూ.11 వేలకోట్లకు పైనే సిఆర్డీఏ తీసుకుంది. బ్యాంకర్ల కన్సార్టియం నుండి కూడా తొలిదశ పూలింగు సమయంలోనే అప్పు తీసుకున్నారు. ఇప్పుడున్న మొత్తాన్ని తిరిగి చెల్లిస్తేనే కొత్తగా అప్పు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. గత ఐదేళ్లలో బ్యాంకర్ల కన్సార్టియంకు చెల్లించాల్సిన వాయిదాలూ చెల్లించకపోవడంతో వారు కూడా సిఆర్‌డిఎకు నోటీసులు పంపించారు.
వేరే ఆర్థిక సంస్థల నుండి తీసుకొన్న డబ్బుతో వాయిదాలు చెల్లించారు. కొంత అప్పు తీరింది. ఈ నేపథ్యంలో కొత్తగా సమీకరించే ప్రాంతంలో పనులు
చేపట్టాల్సి రావడం ఇబ్బందికరంగా తయారైంది. గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా సమీకరణ చేస్తే మూడేళ్లలో పూర్తిస్థాయిలో పనులు చేపట్టాలి.
రైతులు ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే సమస్య పరిష్కారం అవ్వకపోగా కొత్త సమస్యలు ముందుకొస్తాయనే భయం సిఆర్డిఏ యంత్రాంగంలో ఉంది.
గతంలో తీసుకున్న 217 చదరపు కిలోమీటర్ల రాజధాని చుట్టూ ఇన్నర్ రింగురోడ్డు, అవుటర్రింగురోడ్లు నిర్మించి అక్కడ వ్యాపారాభివృద్ధి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తే ఆర్థికంగా నిధులు సమకూరుతాయని దాని ద్వారా ఆర్థికంగా ఒడ్డున పడొచ్చని, ఈ లోపు అమరావతి భూములకు ధరలొస్తే
అమ్మి అప్పులు తీర్చొచ్చని ప్రభుత్వం లెక్కలు గట్టింది. స్విఛ్ఛాలెంజ్ పద్ధతిలో మందడం తాళ్లాయపాలెం వద్ద 1850 ఎకరాల్లో సీడ్ క్యాపిటల్
నిర్మించడం ద్వారా భూములకు విలువ పెరుగుతుందని అంచనా వేశారు. అదీజరగలేదు.
2019లో ప్రభుత్వం మారడంతో భూముల విలువ తగ్గిపోయింది. విలువ పెరగాలంటే రాజధానిలో నిర్మాణాలు చేపట్టాలి. ఇప్పుడు చేతిలో ఉన్న నిధులు ఈ నిర్మాణాలకే సరిపోతాయి. కొత్తగా సమీకరించే ప్రాంతంలో నిధుల సమీకరణ కష్టంగా మారుతుంది. దీంతో కొంత ఆలోచనలో పడినట్లు తెలిసింది. అయితే సిఎం ఢిల్లీ పర్యటన అనంతరం ఆర్థిక అంశాలపై స్పష్టత వస్తుందని సమాచారం.
– వల్లభనేని సురేష్
సీనియర్ జర్నలిస్ట్
9010099208