– పెండింగ్ డిఏలు మంజూరు చేయాలి
– సరెండర్ లీవ్ తదితర బకాయిలు చెల్లించాలి
– వెలగపూడి సచివాలయంలో చీఫ్ సెక్రటరీ ను కలిసిన ఏపీజేఏసీ నాయకులు
వెలగపూడి: సచివాలయంలో నూతనంగా ఎన్జీజివో సంఘ రాష్ట్ర అధ్యక్షుడుగా, ఏపీజేఏసీ చైర్మన్‌గా ఎన్నికైన విద్యాసాగర్, సెక్రటరీ జనరల్ కే ఎస్ ఎస్ ప్రసాద్(ఏపీయూటీఎఫ్) ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల నేతలు చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.
ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని, రెండేళ్ళకు పైగా కాలాతీతం అవడంతో వేతన సవరణ కమిషనర్‌ను నియమించి వేతన సవరణ ప్రక్రియని ప్రారంభించాలని కోరారు. ఉద్యోగులకు సంబంధించి మూడు డీఏలు పెండింగ్ ఉన్నాయని కనీసం రెండు డీఏలు అయినా మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగుల సరెండర్ లీవ్ బకాయిలు తదితర వాటి మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులపై 2019-24 ఏళ్ళ మధ్య వివిధ ఆందోళనలో నమోదైన పెండింగ్ కేసులన్నీ ఎత్తివేయాలని, ఇంటీరియమ్ రిలీఫ్ చెల్లించాలని,ఉద్యోగుల సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాప్ కౌన్సిల్ మీటింగు చీఫ్ సెక్రటరీ చైర్మన్‌గా త్వరలోనే ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమైంది అన్న విషయాన్ని జేఏసీ సంఘాల నేతలు చీఫ్ సెక్రటరీ కి తెలిపారు.
పబ్లిక్ సెక్టార్ గురుకుల ఉద్యోగులకు 60 నుంచి 62 ఏళ్ళ పదవీ విరమణ వయస్సు పెంపు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, పెన్షనర్లకు సంబంధించిన అడిషనల్ కౌంటం పునరుద్ధరణ, 2004 ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు ఓపిఎస్ వర్తింపు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తించాలని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు తదితర అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
పీఆర్సి కమిటీ ఏర్పాటు, డీఏ, బకాయిలు చెల్లింపు అంశాలలో ఉద్యోగుల్లో ఉన్న ఆందోళన చీఫ్ సెక్రటరీగా దృష్టికి విద్యాసాగర్ తీసుకుని వచ్చారు.
ఉద్యోగుల హెల్త్ కార్డుల విషయంలో ఈహెచ్ఎస్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారని, సెక్రటరీ అధ్యక్షతన జరగవలసిన ఈహెచ్ఎస్ స్టీరింగ్ కమిటీ మీటింగ్ ని కూడా ఏర్పాటు చేయాలని కోరారు. హెల్త్ కార్డులు సమర్థ నిర్వహణకు తీసుకోవలసిన కొన్ని నిర్ణయాలను ఈహెచ్ఎస్ స్టీరింగ్ కమిటీలో తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్న విషయాన్ని జేఏసీ నేతలు చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకుని వచ్చారు.
జేఏసీ నాయకులతో చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముందు కార్యాచరణ జరుగుతుందని, డిపార్ట్మెంట్ జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేశామని, ఉద్యోగులకు ఒకరోజు గ్రీవెన్స్ డే ని అమలుపరచమని ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చాక 7,500 కోట్ల రూపాయల్ని బకాయిల కింద చెల్లించామని, మిగిలిన అన్ని విషయాలను ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకుని వెళ్లి దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమo విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతగా ఉంటుందని తెలిపారు. నూతనంగా ఏపీ ఎన్జీజివో సంఘ అధ్యక్షుడిగా, ఏపీ జెఎసి చైర్మన్‌గా ఎన్నికైన ఎ.విద్యాసాగర్ ను, రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన డీవీ రమణను ఆయన అభినందించారు.
చీఫ్ సెక్రటరీని కలిసిన వారిలో ఏపీయూటీఎఫ్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ డీవీ రమణ, కో చైర్మన్ జి.హృదయ రాజు, ఏపీటీఎఫ్ చెన్నుపాటి మంజుల, ఎన్. చంద్రశేఖర్, వైస్ ఛైర్మన్ చోడగిరి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు