– ప్రతి నెలా ఒక్కో షాపుకు రూ.1 లక్ష మామూళ్లు వసూలు
– నెలకు దాదాపు రూ.370 కోట్లు ప్రభుత్వ ముఖ్య నేతల జేబుల్లోకే
– పెరిగిన మద్యం షాపు యజమానుల కమిషన్
– 9 శాతం నుంచి 14.5 శాతానికి పెంచిన ప్రభుత్వం
– ఫలితంగా రూ.1680 కోట్లు పెరిగిన షాపు యజమానుల ఆదాయం
– తద్వారా మరో రూ.800 కోట్లు బిగ్ బాస్ జేబులోకే
– ప్రతిగా అధిక ధరకు అమ్మకోవడానికి అనుమతులు
– టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ కేవలం చంద్రబాబు అల్లిన కథ తప్ప మరొకటి కాదని టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేసారు. వాస్తవానికి చంద్రబాబు ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే దేశంలో అతిపెద్ద లిక్కర్ స్కామ్ జరుగుతోందని ఆయన చెప్పారు.
తిరుపతి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన 3760 లిక్కర్ షాపుల్లో అధిక శాతం కూటమి పార్టీలకు చెందిన వ్యక్తులకే చెందేలా కథ నడిపించారని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లిక్కర్ పాలసీలో అక్రమాల మీద కేసు నమోదైన నేపధ్యంలో.. కేవలం కక్ష సాధింపుతోనే లేని స్కామ్ లో వైయస్సార్సీపీ నాయకులను అరెస్టులు చేస్తున్నారని భూమన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను తక్కువ ధరకే మద్యం ఇస్తానని చంద్రబాబు తీసుకొచ్చిన మద్యం పాలసీ కారణంగా రాష్ట్రంలో ఇవాళ 3760 బ్రాందీ షాపులును ఆయన తన పార్టీకి, జనసేనపార్టీకి చెందిన ప్రయివేటు వ్యక్తులకే దాదాపు 95 శాతానికి వచ్చేటట్టుగా చేశారు. ఇతరులు ఎవరైనా ఆ షాపులకు పోటీపడితే వాళ్లను బెదిరించి, టెండర్లలో పాల్గొనకుండా చేసి.. తమ పార్టీ వాళ్లకే వచ్చేటట్టు చేయడమే కాకుండా ప్రతినెలా ఒక్కో షాపు నుంచి రూ.1లక్ష వసూలు చేస్తున్నారు. అంటే దాదాపు రూ.370 కోట్లు ప్రభుత్వ ముఖ్యులకు ఈ డబ్బులు ముడుతున్నాయి. ఇంతకంటే పెద్ద స్కామ్ మరొక్కటి లేదు.
టెండర్లు వేసిన తర్వాత నిన్న మొన్నటి వరకు బ్రాందీ షాపు యజమానులకు 9 శాతం కమిషన్ ఇవ్వగా.. ఈ మధ్యనే దాన్ని 14.5 శాతం కమిషన్ పెంచారు. 24 గంటల షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వడంతోపాటు కమిషన్ కూడా పెంచారు. ఇలా కమిషన్ 5.5 శాతం పెంచడం వల్ల వీరి ఆదాయం రూ.1680 కోట్ల ఆదాయం పెరుగుతుంది. తద్వారా దాదాపు మరో రూ.800 కోట్లు బిగ్ బాస్ జేబులోకి వెళ్తున్నాయని మద్యం షాపులు యజమానులే చెబుతున్నారు.
వీటికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3760 బ్రాందీ షాపుల వెనుక ఒక మినీబార్ ను ప్రారంభించారు. ఈ బార్లలో 24 గంటలు పాటు అమ్మకాలకు తెరతీసి… తాగే ఏర్పాటుచేస్తున్నారు. ఇదే విషయాన్ని తిరుపతిలో టైమింగ్స్ తో సహా నిరూపించాం. తిరుపతిని రోల్ మోడల్ గా చూపించి.. రాష్ట్రవ్యాప్తంగా చూపించారు. ఇదే ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మరోవైపు ప్రతి బాటిల్ పైన రూ.10 నుంచి రూ.20 అదనంగా ఇప్పుడు అమ్మడం ప్రారంభించారు. దీని ద్వారా మరలా కొన్ని వందల కోట్ల రూపాయలు టీడీపీ అధినేతకు, మద్యం షాపుల యజమానులకు అందుతుంది.
రూ.99లకు అత్యంత నాసిరకం మద్యం సరఫరా చేస్తున్నారు. తద్వారా విపరీతమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు.
చంద్రబాబు హయాంలో ఈ ఆర్ధిక సంవత్సరంలోనే విస్కీ, బ్రాందీ బాటిల్స్ గత ప్రభుత్వ హయాం కంటే 25 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. బీరు బాటిల్స్ 16 లక్షల కేసులు అత్యధికంగా అమ్ముడైనా.. ప్రభుత్వ ఆదాయం పడిపోగా.. చంద్రబాబు ఆయన పార్టీకి చెందిన ప్రయివేటు మద్యం షాపుల యజమానుల ఆదాయం కొన్ని వందల రెట్లు పెరిగింది. వేలాది కోట్ల రూపాయాలు వీరి జేబుల్లోకి పోతున్నాయి.
వాస్తవానికి చంద్రబాబుకి కావాల్సిన 5 మంది డిస్టలరీ యజమానులు 2014-19 మధ్యలో ఏకంగా 69శాతం మద్యం విక్రయించారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్లకి అడ్వాన్స్ పేమెంట్స్ ఇవ్వకపోవడం, మద్యం ధరలు పెంచడంతో ఆ 5 డిస్టలరీల యాజమాన్యం ఇండెంట్ వేయడం ఆపేశారు. చంద్రబాబు హయాంలో ఉన్న 14 డిస్టలరీలే తిరిగి జగన్మోహన్ రెడ్డి హయాంలోనూ మద్యం అమ్మకాలు చేశారే తప్ప కొత్తవాటికి జగన్మోహన్ రెడ్డి అనుమతి ఇవ్వలేదన్నది పచ్చి నిజం. ఈ విషయాన్ని మరుగున పెట్టి… జగన్మోహన్ రెడ్డి హయాంలో దోపిడి జరిగినట్టుగా ప్రచారం చేశారు.