– ఆడబిడ్డ నిధిని ఎగ్గొట్టేందుకు కుట్ర
– ఆడబిడ్డ పథకం కోసం ఆంధ్రప్రదేశ్ ని అమ్ముతారా?
– మీ సంపదసృష్టి ఏమైంది చంద్రబాబూ?
– ఏడాదిలో రూ.1.86 లక్షల కోట్లు అప్పు చేశారు
– రూ.37వేల కోట్లు ఆడబిడ్డ నిధికి ఇవ్వలేకపోయారు
– చేసిన అప్పంతా ఏం చేశారు?
– విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
విశాఖపట్నం: మహిళలకు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటూ చంద్రబాబు కేబినెట్లోని మంత్రి అచ్చెన్నాయుడు అత్యంత బాధ్యతారహితంగా మాట్లాడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇదేనా మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అని వైయస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు.
కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలో…ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని హామీ ఇస్తూ మేనిఫెస్టోలో పెట్టారు. 2 కోట్ల మంది మహిళలకు ఈ పథకం కింద హామీ ఇచ్చారు. ఈ పథకం అమలుకు నెలకు రూ.3 వేల కోట్లు చొప్పున ఏడాదికి రూ.37వేల కోట్లు అవసరం. ఇప్పటికే గతేడాది ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎగరగొట్టిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు రెండో ఏడాదిలోకి ప్రవేశించింది.
ఈ రెండేళ్లకు కలిపి రూ. 75 వేల కోట్లు ఎగ్గొట్టింది. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఆడబిడ్డలు కష్టాల్లో ఉన్నారు. వారి కష్టాన్ని తీర్చడానికి ఈ పథకం ప్రవేశపెట్టామని చెప్పారు. కూటమి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులు అయితే ఇంటింటికీ బాండు పేపర్లు కూడా ఇచ్చారు. గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చారు. ఇప్పటి మంత్రి రామానాయుడు అయితే నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు అంటూ ఇంటింటికీ వెళ్లి మభ్యపెట్టిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. ఈ పథకాలన్నీ అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మాలి అన్న విషయం ఆ రోజు మీకు ఎందుకు గుర్తులేదు?
మంత్రి లోకేష్ కూడా తన యువగళం పాదయాత్రలో కూడా ఈ హామీలిచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు అయితే పదే పదే ప్రతి సభలోనూ… ప్రతి ఆడబిడ్డకు రూ.1500 ఇస్తాను దాన్ని రూ.15వేలు చేసే మార్గం చెబుతానని ప్రచారం చేశారు. ఇప్పుడేమో ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయడం కోసం ఆంధ్రానే అమ్మాలన్న ఆలోచన చేస్తున్నారని సాక్షాత్తూ మంత్రి అచ్చన్నాయుడు చెబుతున్నాడు. ఈ వ్యాఖ్యలు మోసానికి పరాకాష్ట.
గతేడాది, ఈ ఏడాది రెండూ కలిపి ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు ఇస్తారని ఎదురుచూస్తున్న మహిళలకు.. అచ్చన్నాయుడు వ్యాఖ్యలు తీవ్ర నిరాశను కలిగించాయి. ఇది కేవలం అచ్చన్నాయుడు వ్యాఖ్యలు మాత్రమే కాదు. చంద్రబాబు మాట కూడా ఇదే. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు మాట్లాడుతూ… సూపర్ సిక్స్ హామీలన్నింటినీ అమలు చేసేశాం. ఎవరైనా కాదు అంటే వాళ్ల నాలుక మందం అని మాట్లాడుతున్నారు.
అన్ని పథకాలు అమలు చేశామని చెబుతున్న చంద్రబాబునాయుడుకి ఆయన కేబినెట్ మంత్రులని సూటిగా అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నిరుద్యోగికి అయినా మీరు నిరుద్యోగభృతి ఇచ్చారా? ఒక్క నిరుద్యోగికి అయినా ఒక్క ఉద్యోగం ఇచ్చారా.? ఒక్క మహిళకైనా ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇచ్చారా? ఒక్క మహిళకైనా గత ఏడాది కాలంలో 3 సిలిండర్లు ఫుల్ గా ఇచ్చారా.? ఒక్క మహిళకైనా ఇళ్లు ఇచ్చారా ఇళ్ల స్థలం ఇచ్చారా? సున్నా వడ్డీ ఇచ్చారా?
ఒక్క ఉద్యోగికైనా సున్నా వడ్డీ ఇచ్చారా? ఒక్క కొత్త రేషన్ కార్డు అయినా ఇచ్చారా ? ఒక్క రైతుకైనా రైతుభరోసా ఇచ్చారా? ఇవేవీ ఇవ్వకుండా అన్నీ ఇచ్చేశామని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు. ఇంత దారుణంగా ప్రజలను మోసం చేయడం ఎంతవరకు సమంజసమో ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు నిట్టనిలువునా మోసపోయారు.
మీరు చెప్పిన పథకాలేవీ అమలు చేయకుండా.. వాటిని అమలు చేయడానికి రాష్ట్రాన్ని అమ్మాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఆడబిడ్డ నిధి పథకానికి ఏడాదికి రూ.37వేలు కోట్లు కావాలి. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పు రూ.1.86 లక్షల కోట్లు. అందులో రూ.37 వేల కోట్లు ఆడబిడ్డ నిధి పథకానికి ఎందుకు ఖర్చు చేయలేదు? మీరు అప్పు చేసిన డబ్బులు ఎటువైపు వెళ్తున్నాయి?