– పార్టీ మారినంత మాత్రాన ఆబోతులేవీ ఆవులు కాలేవు
– పెత్తందారులంతా పార్టీలు మారి పెత్తనం చేస్తున్నారు
– బ్రోకర్లుగా మారి ప్రజలను వేధిస్తున్నారు
– తెల్లారిలేస్తే సంపాదన, వసూళ్లు, బెదిరింపులు
– టీడీపీ నాయకత్వం వారిని అదుపులో పెట్టాలి
– లేకపోతే ఆ పార్టీకే నష్టం
– కేసులుపెట్టినా చర్యలు తీసుకోరా?
– నూజివీడు నియోజకవర్గం ముక్కొల్లుపాడులో మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు శివతాండవం
నూజివీడు: మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు కూటమి పాలనపై అగ్గిరాముడయ్యారు. వైసీపీ నుంచి చేరి టీడీపీ ముసుగులో చేస్తున్న అరాచకాలను తూర్పారపట్టారు. వారి అకృత్యాలను బయటపెట్టారు. వైసీపీ నుండి టీడీపీలో చేరిన గూండాలు, బ్రోకర్లు మహిళలను వేధిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ప్రభుత్వ శాఖల్లో పెత్తనమంతా ఈ బ్రోకర్లు, రౌడీలకే అప్పచెప్పారని, వీరిని టీడీపీ నాయకత్వం అదుపులో పెట్టకపోతే నష్టపోయేది ఆ పార్టీయేనని హెచ్చరించారు. తరతరాల నుంచి పెత్తనం చేస్తున్న పెత్తందార్లే ఇప్పుడు పార్టీ మారి అధికార పార్టీ ముసుగులో, మళ్లీ అదే గూండాయిజం చేస్తున్నారని కన్నెర్ర చేశారు.
గ్రామానికి చెందిన 46 మంది మహిళా సంఘాలను ఉప సర్పంచ్ శివసాయి వేధిస్తున్నారని, పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని మహిళలు మీడియా సమక్షంలో వెలుగు ఆఫీసుకు వచ్చి, ఏబీ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. శివసాయి వైసీపీ నుంచి టీడీపీలో చేరినా, తమ దృష్టిలో ఆయన వైసీపీ నాయకుడేనని కుండబద్దలు కొట్టారు.
దీనికి స్పందించిన ఏబీ.. ‘‘ తరతరాల నుంచి పెత్తనం చేస్తున్న పెత్తందార్లే ఇప్పుడు పార్టీ మారి అధికార పార్టీ ముసుగులో మళ్లీ అదే గూండాయిజం చేస్తున్నారు. ఈ వైసీపీ గూండాలు పార్టీ మారి, మళ్లీ ప్రజలను కాల్చుకుతింటున్న పరిస్థితి వస్తుదంటే ఇక సహించే పరిస్థితి లేదు. దీనిపై ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారా తీసుకోండి. లేకపోతే వైసీపీ గూండాలమీద మహిళలే చీపుర్లు, చాటలతో దాడులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నా. కష్టపడి ఎన్నో దుర్మార్గాలు సహించి.. ఎంతో అణచివేతను సహించి.. ఐదేళ్లు ప్రాణాలు ఉగ్గబట్టుకుని కష్టపడి ప్రభుత్వాన్ని మార్చుకుంటే, మళ్లీ అదే వైసీపీ గూండాలు పార్టీ మారి ప్రజలపై స్వైరవిహారం చేస్తుంటే, ప్రజలపై అచ్చోసిన ఆబోతులా మీదకొస్తుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని ఒక గ్రామస్ధుడిగా మహిళలకు జరుగుతున్న అన్యాయం చూడలేక హెచ్చరిస్తున్నా. పార్టీ మారినంత మాత్రాన ఆబోతులేవీ ఆవులు కాలేవు. అంతకుముందు వైసీపీలో సంపాదించిన డబ్బు మదంతో ఇదంతా చేస్తున్నారు. పనిపాటలేదు. తెల్లారితే బ్రోకరిజం. పైరవీలు. డబ్బు సంపాదన. వీళ్లను గుర్తించి టీడీపీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే ప్రజలే సమాధానం చెబుతారు. ఇంకా ఐదేళ్లు ఈ వైసీపీ గూండాలను భరించి, సహించే ఓపిక ఇక్కడెవరికీ లేదు. సిగ్గులేకుండా ఒక మహిళ మీద దారి కాచి పుస్తకాలు లాక్కునే ప్రయత్నం చేశారు. దానిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. దానిపై ఏం చర్యలు తీసున్నారో అడిగేందుకు పోలీసుస్టేషన్‌కు వెళుతున్నా. వారిని ఆటోలో తీసుకువచ్చిన ఆటోడ్రైవర్‌ను కొడితే, ఇంతవరకూ చర్యలు తీసుకున్న దిక్కులేదు. 9 గ్రూపులతో బలవంతంగా సంతకాలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలను తొలగిస్తే ఏం చేయాలో అది చేస్తాం’’ అని ఏబీ హెచ్చరించారు. అనంతరం పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఆటోడ్రైవర్‌పై దాడి చేసిన కేసుతోపాటు, మహిళలు ఇచ్చిన కేసు ఏమైందని ఆరా తీశారు. కాగా ఇది ఏబీ స్వగ్రామం కావడం విశేషం.