– పకడ్బందీగా ఇథనాల్ రవాణా పర్యవేక్షణ
విజయవాడ:పరిశ్రమల కోసం ఉద్దేశించిన ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఇ ఎన్ ఏ ), రెక్టిఫైడ్ స్పిరిట్ (ఆర్ ఎస్ ), ఎథనాల్ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు ప్రారంభించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిస్టిల్లరీల అధికారులతో ప్రత్యేక హైబ్రీడ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ కమీషనరేట్ నుండి నేతృత్వం వహించారు.
పరిశ్రమలు, ఇతర అవసరాల కోసం ఉత్పత్తి అవుతున్న ఆల్కహాల్ పక్కదారి పట్టకుండా అన్ని డిస్టిల్లరీల వద్ద కఠిన నిఘా పర్యవేక్షణను అమలు చేయాలని జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. డిస్టిల్లరీల ప్రాంగణాల్లో పూర్తిస్థాయి భద్రత, నిఘా చర్యలు ఉండాలనీ, సీసీటీవీ కెమెరాలు నిరంతరంగా పనిచేసేలా చూసుకోవాలని సూచించారు. ఎటువంటి ‘షాడో ఏరియా’లు ఉండకూడదని, బయటకు వెళ్లే ఉద్యోగులను భద్రతా సిబ్బంది పూర్తిగా తనిఖీలు చేయాలనీ సూచించారు.
ప్రతి రోజు స్టాక్ రీక్విన్సిలియేషన్ చేయాలనీ, బయటకు వెళ్లే ప్రతి కంటైనర్ సరైన ముద్రలు , తాళాలతో క్లోజ్ చేసినట్లు నిర్ధారించాలనీ స్పష్టం చేశారు. ఈఎన్ఏ నాణ్యత నిర్ధారణ కోసం నియమిత నమూనా సేకరణ చేయాలనీ, పరిశ్రమల కోసం పంపే ఇథనాల్ డెనేచర్ ప్రక్రియను అధికారులు స్వయంగా పరిశీలించాల్సిందిగా ఆదేశించారు. అలాగే ఆల్కహాల్ తీసుకునే పరిశ్రమల యూనిట్లను ప్రత్యక్షంగా సందర్శించి, వినియోగానికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ నియంత్రణ చర్యలకు నాయకత్వం వహిస్తున్న ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్సైజ్, సాధారణ పరిపాలన విభాగాల ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా సచివాలయం నుండి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ నిశిత పర్యవేక్షణలో పరిశ్రమల ఆల్కహాల్ వినియోగంపై పటిష్ట నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. పర్యవేక్షణలో జవాబుదారీతనాన్ని, పారదర్శకతను, సాంకేతిక సమన్వయాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
మీనా చొరవతో విభాగాల సమన్వయం, నిఘా మౌలిక సదుపాయాల పటిష్టీకరణ ద్వారా ఈ చర్యలకు వేగం పుంజుకుంటున్నాయి. పరిశ్రమల స్థాయి నుండి వినియోగ స్థాయికి వరకూ ఆల్కహాల్ గమనాన్ని ప్రభావవంతంగా పర్యవేక్షించేలా ఒక బలమైన, వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయం, మౌలిక సదుపాయాల్లో మెరుగుదల, వ్యవస్థలో ఉన్న లోపాలను తొలగించే చర్యలను ప్రభుత్వ పరంగా చేపడతామన్నారు.
ఏపీ చర్యలకు దేశవ్యాప్తంగా స్పందన
ఇటీవల జరిగిన పాలకొల్లు నకిలీ మద్యం కేసు నేపథ్యంలో ఈ చర్యలు మరింత వేగం పుంజుకున్నాయి. ఇందులో 36 మంది అరెస్టు కాగా, 2,200 లీటర్లకు పైగా మళ్లించిన స్పిరిట్, నకిలీ మద్యం బాటిళ్లు, లేబుల్లు, ప్యాకేజింగ్ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పరిశ్రమల వినియోగం పేరుతో పొందిన స్పిరిట్‌ను కల్తీ మద్యం తయారీకి దారి మళ్లించిన ఘటనలు బయటపడ్డాయి. ముఖ్యంగా తెలంగాణా లోని ఒక ఫార్మా సంస్థ కోవిడ్ సమయంలో పొందిన అనుమతులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు.
ముంబయిలోని సరఫరాదారుల నుంచి ఖాళీ బాటిళ్లు, బ్రాండెడ్ లేబుల్స్, క్యాప్స్ లాంటి వస్తువులు తెచ్చుకోవడం ద్వారా ఈ నెట్వర్క్ అంతర్రాష్ట్ర స్థాయిలో విస్తరించి ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఇతర రాష్ట్రాలు సైతం ఏపీను ఆదర్శంగా తీసుకుంటూ సలహాల కోసం సంప్రదిస్తున్నాయి.
పరిశ్రమల ఆల్కహాల్ వినియోగంపై సామర్థ్యవంతమైన నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఏర్పాట్లు ఒక మోడల్‌గా నిలిచాయి. ఫలితంగా ముకేష్ కుమార్ మీనా నేతృత్వంలో పరిశ్రమల ఆల్కహాల్ నియంత్రణ పరంగా ఆంధ్రప్రదేశ్ దేశానికి మార్గదర్శకంగా నిలవనుంది.
పరిశ్రమల ఆల్కహాల్‌పై రాష్ట్రాలకు హక్కులు — సుప్రీంకోర్టు తీర్పు
జీఎస్టీ తర్వాత పరిశ్రమల ఆల్కహాల్‌పై నియంత్రణ, పన్ను విధింపు, శిక్ష విధించే హక్కులు తమకే ఉన్నాయని కేంద్రం భావించింది. అయితే 2024లో ఉత్తరప్రదేశ్ వర్సెస్ లలితా ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ విషయంలో అందుకు భిన్నమైన స్పష్టత నిచ్చింది.
తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పులో పరిశ్రమలు ఇతర అవసరాల వినియోగానికి అవసరమైన ఆల్కహాల్ సరఫరా, నియంత్రణపై రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉంటుందని స్పష్టం చేసింది.