– జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పిటిషన్ పై హైకోర్టు ఆదేశం
విశాఖపట్నం: జిల్లాలోని భీమిలి బీచ్ తీరంలో రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి తన కుమార్తె నేహా రెడ్డి పేరిట నిర్మించిన అనధికార నిర్మాణాలను కేంద్ర పర్యావరణ పరిరక్షణ కమిటి శుక్రవారం పరిశీలించింది. భీమిలి బీచ్ లో కోస్తా నియంత్రణ మండలి( సి ఆర్ జెడ్) నిబంధనలను ఉల్లంఘించి నేహా రెడ్డి పెద్ద ఎత్తున కాంక్రీట్ నిర్మాణాలు జరపటం పై జనసేనకు చెందిన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ కేసును విచారించిన రాష్ట్ర హైకోర్టు అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను నేహా రెడ్డి ఖర్చులతోనే కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కట్టడాల కారణంగా పర్యావరణ విద్వంసం తీవ్రంగా జరిగిందన్న అభిప్రాయంతో పర్యావరణం నిపుణుల కమిటీని కూడా హైకోర్టు నియమించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.
అందులో భాగంగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ చెందిన ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎం శ్రీరామకృష్ణ, కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ వి వి ఎస్ శర్మ ,రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పివి ముకుందరావు, కేంద్ర పర్యావరణ విభాగం సైంటిస్ట్ సౌమ్య దుప్పల, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన సైంటిస్ట్ సిహెచ్ మురళీకృష్ణలతో కూడిన నిపుణుల బృందం శుక్రవారం ఈ నిర్మాణాల ప్రాంతాన్ని పరిశీలించింది.
హైకోర్టులో కేసు దాఖలు చేసిన పీతల మూర్తి యాదవ్ నుంచి విధ్వంసపూరిత కట్టడాలకు సంబంధించిన వివరాలను కమిటీ సేకరించింది. ఈ కమిటీ నివేదికను రాష్ట్ర హైకోర్టుకు సమర్పించనుంది.