– జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే కులవాదం
– సీఎం రమేష్ – రేవంత్ రెడ్డి దోస్తీ బయటపడటంతో బీఆర్ఎస్ పై కుట్రలు
– 11 నెలల క్రితం కవితకు బెయిల్ వస్తే నాలుగు నెలల క్రితం కేటీఆర్ ఎందుకు కలుస్తారు..?
– చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్న సీఎం రమేష్
– తెలంగాణలో కమ్మ రెడ్డి సామాజిక వర్గాల ఓటర్లను దూరం చేసేందుకు కుట్రపూరిత వ్యాఖ్యలు
– తెలంగాణపై మళ్లీ సమైక్యవాదుల కుట్రలు
– బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్,రెడ్కో మాజీ చైర్మన్ వై. సతీష్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణపై చంద్రబాబు డైరెక్షన్లో ఆంధ్ర కుట్రలు జరుగుతున్నాయనే విషయం మరోసారి సాక్షాలతో సహా బయటపడింది. తెలంగాణ సంపద దోచుకునేందుకు చంద్రబాబుతో పాటు ఆయన మాజీ స్నేహితులంతా ఒకటయ్యారు. ఇందులో భాగంగానే సీఎం రమేష్ మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూములను దోచుకునేందుకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, సీఎం రమేష్ కలిసే ప్రణాళికలు రూపొందించారు.
ఆ విషయంలో రేవంత్ రెడ్డికి సీఎం రమేష్ సహకరించినందుకు ఇప్పుడు ఫోర్త్ సిటీలో సీఎం రమేష్ కు కాంట్రాక్టులు కట్టబెట్టారు. ఈ బండారం బయటపడడంతో ఇప్పుడు దాన్నుంచి విషయాన్ని పక్కదారి పట్టించేందుకు.. సీఎం రమేష్ తనకు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి రాసిచ్చిన స్క్రిప్టును చదువుతున్నారు.
అయితే దాదాపు 11 నెలల క్రితం కవితకు బెయిల్ వస్తే, నాలుగైదు నెలల క్రితం బెయిల్ కోసం కేటీఆర్ తనను కలిశారంటూ సీఎం రమేష్ మాట్లాడటాన్ని బట్టి వారి కుట్రలు బయటపడ్డాయి. HCU భూముల విషయంలో ఓ బిజెపి ఎంపీ పాత్ర ఉంది అంటూ గతంలోనూ కేటీఆర్ బయటపెట్టారు. ఆయన ఎవరో ఇప్పుడు బట్టబయలైంది.
వారి కుట్రలన్నీ ప్రణాళికలు అన్ని విఫలమయ్యాయని కంచ గచ్చిబౌలి భూములు చేతికి రాకుండా పోయాయయన్న అసహనంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి, సీఎం రమేష్ డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. తెలంగాణ వనరుల దోపిడీకి బిజెపి, రేవంత్ రెడ్డి తో కలిసి చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలను బీఆర్ఎస్ పార్టీ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. వాటి అన్నిటిని ప్రజలకు వివరిస్తూ ఉంది.
దీంతో పాత స్నేహితులు ముగ్గురికి ఊపిరి సలపడం లేదు. పైగా ఫోర్త్ సిటీలో సీఎం రమేష్ కు కాంట్రాక్ట్ దక్కడంతో గచ్చిబౌలి భూముల స్నేహం కూడా బయటపడింది. ముగ్గురికి ముగ్గురు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో తప్పించుకోవడానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీపై కేటీఆర్ గారి పై బురద జల్లుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీని ఏ పార్టీలోను విలీనం చేసేది లేదని, ఎవరితోనో పొత్తు పెట్టుకునేది లేదని, ఇప్పటికే అనేకమార్లు కేసీఆర్, కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేందుకే కవితపై కేసు పెట్టారని విషయం తెలిసి కూడా ఎక్కడ కూడా బిజెపికి లొంగకుండా న్యాయ పోరాటం చేసి కవితకు బెయిల్ తెచ్చుకున్నారు.
అసలు ఆ కేసులో అన్ని రోజులు జైల్లో ఉంచాల్సిన అవసరం కూడా లేదని స్వయంగా ప్రస్తుత సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ కూడా పలుమార్లు వ్యాఖ్యానించారు. అంటే ఆ కేసులో ఏమీ లేదు. అలాంటి కేసు కోసం ఎందుకు బీఆర్ఎస్ బిజెపి దగ్గర కాళ్లబేరానికి వెళుతుంది? విచిత్రం ఏమిటంటే ఐటి, ఈడి కేసులను తప్పించుకోవడానికి తెలుగుదేశం నుంచి బిజెపిలో చేరిన సీఎం రమేష్ ఇప్పుడు బీఆర్ఎస్ పై, కేటీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారు.
మరోవైపు ఇప్పుడు తెలంగాణలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు అంటూ కులాల మధ్యలో కూడా కుంపట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక. త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సహకరించేందుకు కమ్మ సామాజిక వర్గ ఓట్లన్నీ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి లేకపోతే తెలుగుదేశం పార్టీకి వేయించేందుకు ఈ డ్రామాలు మొదలుపెట్టారు.
కమ్మ సామాజిక వర్గ నాయకులపై కేటీఆర్ ఆరోపణలు చేశారంటూ ఒక తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టారు. కమ్మ, రెడ్డి సామాజిక వర్గ ఓట్లు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం చేసేందుకు రేవంత్ రెడ్డి, తెలుగుదేశం కలిసి ఉమ్మడిగా చేస్తున్న కుట్రే ఇది.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకులు ఇలాంటి అనేక కుట్రలు చేశారు.ఉద్యమాన్ని అణచివేసి తెలంగాణ రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేశారు.
చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మరోసారి ఆనాటి సమైక్యవాదులంతా జూలు విదిలిస్తున్నారు.తెలంగాణపై, బీఆర్ఎస్ పార్టీపై కుట్రలు మొదలుపెట్టారు. తెలంగాణ సంపదను దోచుకునేందుకు మరోసారి భారీ కుట్రలు చేస్తున్నారు.