– హౌసింగ్ సొసైటీకి అభినందనలు
– రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్
– వచ్చే క్యాబినేట్ సమావేశం తర్వాత తీపి కబురు అందిస్తామని భరోసా
విశాఖపట్నం: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో విశాఖకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ భరోసా అందించారు. విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ కమిటీ నాయకులు ఓ హోటల్లో ఆయనతో భేటీ అయ్యారు. 20 ఏళ్ల పైబడిన జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలను కూలంకుశంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే క్యాబినేట్ సమావేశంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్లు, హెల్త్ ఇన్సూరెన్స్ లు, ఇతరత్రా సమస్యలన్నింటిపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
పాత్రికేయ మిత్రులందరికీ తీపి కబురు అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. విశాఖలో అక్రిడిటేషన్ జర్నలిస్టులంతా సొసైటీగా ఏర్పడ్డం అభినందనీయమన్నారు. సొసైటీ అధ్యక్షుడు బి.రవికాంత్ మాట్లాడుతూ విశాఖలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం 20 ఏళ్లుగా కలగా మిగిలిపోయిందన్నారు. ఈ ప్రభుత్వంలోనైనా తమ ఆశలు నెరవేర్చాలని విన్నవించారు. గౌరవాధ్యక్షుడు జి.జనార్ధనరావు మాట్లాడుతూ 30 ఏళ్ల పైబడిన సీనియారిటీ ఉన్న తమలాంటి వారికి కూడా ఇప్పటికీ ఇళ్ల స్థలం లేదని చెప్పారు.
విశాఖలో ఇళ్ల స్థలాల మంజూరు ఏళ్ల తరబడి జరగలేదన్నారు. ఈసారైనా తప్పకుండా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ జాయింట్ సెక్రటరీ ఎం.చిట్టిబాబు, ట్రెజరర్ ఎ.శరత్ కుమార్, ప్రత్యేక ఆహ్వానితులు యర్రా నాగేశ్వరరావు, పవన్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.