– అమరావతిలో ‘మొదటి దశ ‘ రైతుల్లో ఆవేదన
– మంత్రి నారాయణ దృష్టికి తీసుకుపోవాలని నిర్ణయం
రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతులకు పూలింగు సమయంలో ఇచ్చిన గౌరవం లేదని, ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. భూములిచ్చి 11 సంవత్సరాలైనా అభివృద్ధికి నోచలేదని, 2028 నాటికి అభివృద్ధి చేసి తమకు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలపై తొలుత మంత్రి నారాయణను కలవాలని, అక్కడ పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలవాలని రైతులు నిర్ణయించినట్లు తెలిసింది.
ముఖ్యంగా రాజధాని పరిధిలో ఏ సమస్య పరిష్కరించాలన్నా సిఆర్డిఎ, కాంపిటెంట్ ఆథారిటీ, ఎమ్మార్వో కార్యాలయాల్లో డబ్బులు ఇవ్వనిదే పనికావడం లేదని, ఈ విషయాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. గ్రామ కంఠాల భూములు, వీధిపోటు ప్లాట్ల మార్పు అంశాలపైనా చర్చించినట్లు తెలిసింది.
జరీబు ప్రాంతంలో భూములు తీసుకున్నారని, కొంతకాలంపాటు జరీబు ప్యాకేజీ ఇచ్చి అనంతరం మెట్టగా కౌలు తగ్గించారు. వాటిని కూడా పూర్తిగా జరీబు ప్యాకేజీగా పరిగణించాలని మంత్రికి విన్నవించాలని నిర్ణయించారు. గతంలో తోటల్లో ఉన్న ఇళ్లకు సంబంధించి అంతే మొత్తం విస్తీర్ణంలో ప్లాట్లు ఇస్తామని సిఆర్డిఎ అధికారులు తెలిపారు.
దీంతో ఇళ్లను అప్పగించారు. వాటిని అధికారులు కూల్చివేసినా అటువంటి వారికి ప్లాట్లు ఇవ్వలేదు. 9.14 అగ్రిమెంటులో మూడు సంవత్సరాల కాలపరిమితిలో డెవలప్ చేసిన ప్లాట్లు హ్యాండోవర్ చేస్తామన్నారని, ఇప్పటికీ ఇవ్వలేదని, వాటిని వెంటనే అభివృద్ధి చేసి ఇచ్చేలా చూడాలని కోరనున్నట్లు తెలిసింది.
గ్రామ కంఠం భూములకు సంబంధించి 9.2 అభ్యంతరాలు తెలిపిన రైతులకు ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదనే అంశంపైనా చర్చించినట్లు సమాచారం. వీటిల్లో అభివృద్ధి మినహా మిగిలిన సమస్యలన్నీ ఈ నెలాఖరులోపు పరిష్కరించేలా చూడాలని మంత్రిని కోరనున్నారు.
– వల్లభనేని సురేష్
9010099208