– జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
– రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైయస్సార్సీపీ నేతలు విజ్ఞప్తి
– రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని కలిసిన వైయస్సార్సీపీ ప్రతినిధుల బృందం
– ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, కల్పలతా రెడ్డి, మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్టు, హఫీజ్ ఖాన్, విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజ, నారాయణమూర్తి, ఇతర పార్టీ నేతలు.
విజయవాడ: ఒంటిమిట్ట, పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికలను నిర్వీర్యం చేసి, ఎన్నికల వ్యవస్థ కళ్లకు గంతలు కట్టి కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార పార్టీ ఆగడాలు, వారికి వత్తాసు పలుకుతున్న అధికార యంత్రాంగం తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైయస్సార్సీపీ నేతలు ఇవాళ విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ… పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా దిగజారిపోయిందని వైయస్సార్సీపీ నేతలు, మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య(నాని), జోగి రమేష్ లు ఆక్షేపించారు.
ఒకవైపు వైయస్సార్సీపీ నేతలపై దాడులు, అక్రమకేసులు, అరెస్టులకు పాల్పడుతూ.. మరోవైపు అధికార పార్టీ నేతలు యధేచ్చగా డబ్బు పంపిణీ చేస్తున్నా రెవెన్యూ, పోలీస్ వ్యవస్థలు చేష్టలుడిగి చూస్తున్నారని మండిపడ్డారు. ఏడాది పాలనకే ప్రజల్లో పూర్తిగా కూటమి ప్రభుత్వం పరపతి అట్టగుడు స్థాయికి చేరిన నేపధ్యంలో… దాన్నుంచి బయటపడేందుకే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల జడ్పీసీటీ ఎన్నికల్లో ఏం చేసైనా గెలవడానికి బాబు చేస్తున్న అక్రమాలు తారాస్థాయికి చేరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా తమ గ్రాఫ్ తగ్గపోలేదని చెప్పుకునేందుకు అరాచకానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు
– పేర్ని వెంకట్రామయ్య (నాని), మాజీ మంత్రి.
పులివెందుల, ఒంటిమిట్టలో అధికార పార్టీ పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారంతో సాగిస్తున్న అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. దీనిపై ఎన్నికల అధికారికి వివరించాం. నిన్న ఉదయం నుంచి ఎన్నికల యంత్రాంగం కొత్తపల్లె, నల్లపురెడ్డిపల్లె గ్రామాల్లో ఒకవైపు ఓటర్ల స్లిప్లులను పంపిణీ చేస్తుంటే… వెనువెంటనే అధికార పార్టీ నేతలు ఆ స్లిప్పులను వసూలు చేస్తున్నారు. ఓటుకు రూ.10 వేలు ఆశచూపిస్తున్నారు. రమేష్ యాదవ్ పై దాడిచేసాం. అవినాష్ రెడ్డితో పాటు 150 మందిపై కేసు పెట్టాం. మీకూ ఇదే గతి పడుతుందని బెదిరిస్తున్నారు.
ఇంత జరుగుతున్నా ఊరంతా పోలీసులు ఉంటారు కానీ.. ఎవరూ ఈ బెదిరించేవారిని నిర్మూలించరు. షాడో పార్టీలు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తిరుగుతూ ఉంటారు కానీ జరుగుతున్న అఘాయిత్యాలు పట్టించుకోరు. పోలీసులను భారీగా మోహరించామని లెక్కల రికార్డులు ఎన్నికల సంఘానికి పంపిస్తున్నారు. అరాచాకాలు మాత్రం ఆగడం లేదు. గ్రామాల్లో మాత్రం విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతున్నారు. చంద్రబాబు రూ.10 వేలు పంపిస్తే.. రూ.5వేలు పంచి, మరో రూ.5వేలు టీడీపీ నేతలు తమ జేబుల్లో వేసుకుంటున్నారు.
వైయస్సార్సీపీకి చెందిన పోలింగ్ ఏజెంట్ల మీద బైండోవర్ కేసులు నమోదు చేశారు. వారందరినీ స్వేచ్ఛగా వైయస్సార్సీపీ తరపున స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరాం. మరోవైపు భారతదేశంలో ఇంతవరకు ఎక్కడా చూడని విధంగా ఒక ఊరులో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని పక్కఊరుకు తరలించిన వింత పోకడలకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పాల్పడ్డారు. ఇది ముమ్మూటికీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.
కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగం
– మాజీ మంత్రి, జోగి రమేష్
ఒక్క పులివెందుల జడ్పీటీసీ స్ధానాన్ని గెలిస్తే.. జగన్మోహన్ రెడ్డి ఆత్మస్ధైర్యాన్నో, వైయస్సార్సీపీ శ్రేణుల ఆత్మస్ధైర్యాన్నో దెబ్బతీయాలని పెద్ద పన్నాగం పన్నారు. ఇవాళ జరుగుతున్న దాన్ని ఎన్నిక అంటారా ? సొసైటీకి నామినేట్ చేసినప్పుడు ప్రభుత్వం పేర్లు ఇస్తుంది. ఆ తరహా చేసుకుంటే సరిపోయేది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను తప్పుదోవ పట్టించి, అధికార యంత్రాంగాన్ని చెప్పుచేతుల్లో పెట్టుకుని, అధికారులను చంద్రబాబు నాయుడు తమ పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నారు.
పులివెందులలో అధికారుల ఎన్నికల స్లిప్పులు ఇస్తుంటే…వెంటనే రూ.10 వేలు ఇచ్చి వాటిని తీసుకుంటున్నారు. గతంలో నంద్యాల ఉప ఎన్నికల్లోనూ చంద్రబాబు ఈ తరహాలోనే చేశాడు. ఇవాళ పులివెందులలో ప్రజాస్వామ్య బద్దంగా జడ్పీటీసీ స్ధానానికి ఎన్నిక జరిగితే ఫలితం ఏకపక్షంగా ఉంటుంది. ఎన్నికల సంఘం అధికారిని పదే, పదే కలిసాం. మా విజ్ఞప్తిని చేరవేస్తున్నామని ఆమె చెబుతున్నా ఫలితం మాత్రం శూన్యం. ఎన్నికల అధికారి ఆదేశాలను పాటించకుండా తుంగలో తొక్కుతున్నారు.
ప్రతి పోలింగ్ స్టేషన్ లో లోపలా, బయటా సీసీ కెమెరాలుపెట్టాలని అడిగాం. ఆమె అంగీకరించారు. ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ స్ధానాల్లో ఏదో చేసేయాలని మంత్రులు, అధికార గణం ప్రయత్నం చేస్తున్నారు. మీరు తలక్రిందులుగా తపస్సు చేసినా అక్కడ వైయస్సార్సీపీ గెలవడం ఖాయం.