– ఇంట్లో మహిళలను గౌరవించని వారు మాపై విమర్శలా?
– చట్టాలు మాత్రమే సరిపోవు… నైతిక విలువలతోనే మహిళా భద్రత
– ‘స్త్రీశక్తి’తో మహళలకు ఆర్థిక వెసలుబాటు
– మహిళలను అవమానించే సీన్లు ఉన్న సినిమాలకు బ్రేక్ వేయాలి
– స్త్రీశక్తి పథకం ప్రారంభోత్సవ సభలో మంత్రి నారా లోకేష్
విజయవాడ: మహిళా సంక్షేమానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ పెద్దపీట వేస్తారు. ఇప్పుడు స్త్రీ శక్తి పథకం ద్వారా ఫ్రీ బస్సు ప్రయాణం ప్రవేశపెట్టారు. ఈ పథకం మహిళలకు మరింత శక్తిని ఇస్తుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… స్త్రీశక్తి పథకం వల్ల విద్యార్థినులు, ఉద్యోగాలు చేసుకునే మహిళల పై భారం తగ్గుతుందని తెలిపారు.
ఉచిత బస్సు ప్రయాణం ద్వారా నెలకు రూ.1500 భారం తగ్గుతుంది. 2019లో అధికారంలోకి వచ్చిన ఒక రాక్షసుడు మద్యనిషేధం చేస్తానని చెప్పి, విషం కంటే ప్రమాదకర మద్యం అమ్మి మహిళల తాళిబొట్లు తెంచాడు. యువగళం పాదయాత్రలో మీ కష్టాలు చూశాకే సూపర్ -6 పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరాను. గతంలో ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరిని స్కూల్ కి పంపి, ఇంకొకరిని పనికి పంపాలి అనేది గత ప్రభుత్వం విధానం. ఇప్పుడు చంద్రబాబు గారు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇచ్చారు. 67 లక్షల 27 వేల మందికి 10 వేల కోట్లు ఇచ్చారు. దీపం పథకం ద్వారా 2 కోట్ల సిలెండర్లు ఉచితంగా ఇచ్చారు. సొంత చెల్లెలు రాఖీ కట్టని అన్నలు మహిళా సంక్షేమం గురించి మాట్లాడతారు.
సొంత తల్లి, చెల్లి నమ్మని వారు మాపై విమర్శలు చేస్తారు. వారికి నా సమాధానం ఒక్కటే, ముందు ఇంట్లో ఉన్న మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం. ప్రభుత్వం మారడం వలన 19 నుండి 24 వరకూ రాష్ట్రం ఎంత నష్టపోయిందో మీరు చూసారు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. కేంద్రం లో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవనన్న నాయకత్వంలో సుపరిపాలనలో తొలి అడుగు పడింది. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలి అంటే ప్రభుత్వ కొనసాగింపు ముఖ్యం.
టీడీపీ ఆవిర్భావంతో మహిళలకు పెద్దపీట
భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. ఏ రంగం తీసుకున్నా మహిళలే నంబర్ 1. ఆవకాయ్ పట్టాలన్నా మీరే… అంతరిక్షంలోకి వెళ్ళాలి అన్నా మీరే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండే మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం ఇచ్చింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ దివంగత నందమూరి తారకరామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 9 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. మహిళల కోసం తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ఇచ్చింది చంద్రబాబు నాయుడు.
విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది, మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు ఇచ్చింది, మహిళా కండక్టర్లను నియమించింది, దీపం పథకం అమలు చేసింది చంద్రబాబు. ప్రతిభా భారతిని తొలి మహిళా స్పీకర్ చేసింది చంద్రబాబే. స్త్రీ శక్తి కి ఎదురులేదు. నేను మంత్రి అయిన తరువాత షైనింగ్ స్టార్స్ అని కార్యక్రమం నిర్వహించాను. టెన్త్, ఇంటర్ లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన వారిని సన్మానించాను. ర్యాంకులు వచ్చిన వారంతా అమ్మాయిలే, వారిని చూసి ఆశ్చర్యపోయాను. 80 శాతం ర్యాంకులు అమ్మాయిలకే వచ్చాయి. అబ్బాయిలు ఎక్కడ ఉన్నారు అని వెదుక్కునే పరిస్థితి వచ్చింది.
అవకాశాలు కల్పిస్తే అద్భుతంగా రాణింపు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను మంగళగిరి లో స్త్రీ శక్తి అని ఒక కార్యక్రమం ప్రారంభించాను. మహిళలకు కుట్టు మెషిన్, బ్యూటిషన్ ట్రైనింగ్ ఇచ్చాం. 3623 మంది మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మెషీన్లు అందించాం. ట్రైనింగ్ ఇచ్చి వదిలేయలేదు, వారికి మార్కెట్ లింకేజ్ కూడా ఏర్పాటు చేశాం. జ్యూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ ఇలా అనేక ఐటమ్స్ తయారు చేసి సొంత కాళ్ళ పై నిలబడ్డారు. మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు. దానికి ఉదాహరణ మా ఇల్లే. కుటుంబం ఆర్థిక అవసరాల కోసం రాజకీయాల పై ఆధారపడకూడదు అని 1992లో చంద్రబాబు హెరిటేజ్ ప్రారంభించారు.
రెండేళ్ల తర్వాత బాబు ఫైనాన్స్, రెవిన్యూ మంత్రి అయ్యారు. అమ్మ కంపెనీ చూసుకోవాల్సి వచ్చింది. ఆయన రాజకీయాల్లో బిజీ అయిన తరువాత మా అమ్మ భువనేశ్వరికి వ్యాపార బాధ్యతలు అప్పగించారు. మొదట్లో మా అమ్మ ఆఫీస్ కు వెళ్ళడానికి భయపడేవారు. కొన్ని సార్లు ఆఫీస్ వరకూ వెళ్లి బయటే కార్లో కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి. కట్ చేస్తే ఆమె హెరిటేజ్ కంపెనీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారు.
ఈరోజు 5వేల కోట్ల విలువైన కంపెనీ నడిపిస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తోంది. పవనన్న 50లక్షల విరాళం ఇచ్చారు. నా భార్య బ్రాహ్మణి స్టాన్ ఫర్డ్ లో చదివింది. నా క్రెడిట్ కార్డు బిల్లు కూడా ఈరోజు ఆమె కడుతుంది. ఇల్లు మొత్తం చూసుకుంటుంది. బసవతారకం డైరక్టర్ గా నిరుపేద కుటుంబాలకు సహాయం అందిస్తుంది.
మహిళలను అగౌరవంగా మాట్లాడొద్దు
స్త్రీ శక్తి కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నాను. కొంత మంది మహిళల్ని కించపరుస్తూ మాట్లాడతారు. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే మా తల్లి కోలుకోవడానికి మూడు నెలలు పట్టింది. చేతికి గాజులు వేసుకున్నావా? అమ్మాయిలా ఏడవకు? అంటూ కొన్ని పదాలు మాట్లాడతారు. అలాంటివి వాడితే నాకు బాధ కలుగుతుంది. అటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అవన్నీ ఆగాలి. మార్పు ముందు మన ఇంటి నుండి మొదలు అవ్వాలి. అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే ఇంకోసారి మాట్లాడొద్దని గట్టిగా చెప్పండి. మళ్లీ మాట్లాడితే అన్న లోకేష్ తోలుతీస్తాడని చెప్పండి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఒక కోరిక కోరుతున్నాను. సినిమాల్లోనూ, వెబ్ సిరీస్ ల్లోనూ మహిళల్ని అవమానపరిచే డైలాగ్స్ బ్యాన్ చెయ్యమని కోరుకుతున్నాను. ఒక వేళ అలాంటి డైలాగ్స్ ఉంటే తీసేసే వరకూ రిలీజ్ ఆపమని, ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతున్నాను. మహిళల భద్రత గురించి అందరూ మాట్లాడతారు. చట్టాలతోనే భద్రత రాదు. ప్రవర్తనలో మార్పు రావాలి.
విద్యార్థి దశ నుండి మహిళల్ని గౌరవించడం నేర్పాలి. మార్పు మన ఇంటినుంచే మహిళలను గౌరవించాలి. అందుకే చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన నైతిక విలువల పుస్తకాలు పిల్లలకు ఇస్తున్నాం. పాఠ్యపుస్తకాల్లో ఇంటిపనుల ఫోటోలు చెరో సగం ఉండేలా చేశాం. మొన్న జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో పిల్లలతో తల్లికి వందనం చేయించామని మంత్రి లోకేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎండి ద్వారకా తిరుమలరావు, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్, బోండా ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు