– స్వాతంత్య్ర వేడుకల్లోనూ పదే పదే జగన్ నామస్మరణ
– కళ్లార్పకుండా పదే పదే అబద్ధాలు చెప్పడమే సరిపోయింది..
– ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై శైలజానాథ్ ఆగ్రహం
అనంతపురం: స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో కూడా పచ్చి అబద్దాలు చెప్పిన చంద్రబాబుకి పొద్దస్తమానం జగన్ పేరు తలవకుండా రోజు గడవడం లేదని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైయస్సార్సీపీ సమన్వయకర్త సాకె శైలజానాథ్ ఎద్దేవా చేశారు.
అనంతపురం లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వారం వారం అప్పులు, అబద్దాలతో సీఎం చంద్రబాబు ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బ తీస్తున్నారని ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత కూడా గత ప్రభుత్వం అంటూ మాపై బురద జల్లడం తప్ప, హామీల అమలుపై చంద్రబాబు ఆలోచన చేయకపోవడం ప్రజలను వంచించడమే అవుతుందని అన్నారు. అలాంటి టీడీపీకి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని ప్రశ్నించిన శైలజానాథ్, అధికారాన్ని అడ్డం పెట్టుకుని రిగ్గింగ్ చేసి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…
స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలోనైనా సీఎం చంద్రబాబు ఏదైనా ప్రజలకు ఉపయోగపడే కొత్త అంశాలు చెబుతారని భావిస్తే గత ప్రభుత్వం అంటూ అవే పాత ఆవు కథలు చెప్పారు. దీంతోపాటు సూపర్ సిక్స్ అమలు చేశానని ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉంది. ఆఖరుకి స్వాతంత్య్ర వేడుకల్లో నాణ్యమైన మద్యం ఇస్తానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. ఇదంతా చూస్తుంటే మా నాయకులు వైయస్ జగన్ చెప్పినట్టు ఇవే తనకి ఆఖరి ఎన్నికలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చాడనిపిస్తుంది. ఆయన ఇప్పటికైనా మారకుండా ఇలాగే అబద్ధాలు చెబుతూ పోతుంటే గూగుల్‌లో చంద్రబాబు పేరు కొడితే మోసం, వెన్నుపోటు అని వస్తుందేమో.
ఇండిపెండెన్స్ డే రోజున అమలు చేస్తున్నట్టు బాకా ఊదుకున్న ఫ్రీ బస్సు పథకం పేరుతో మహిళలను మరోసారి వంచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి ఇప్పుడు అమలు చేస్తున్న విధానానికి ఏమాత్రం పొంతన కుదరడం లేదు. 15 నెలల పాలన చూస్తే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం జగన్ పేరు తలవడంతోనే చంద్రబాబుకి సరిపోయింది తప్ప ప్రజలకు చేసిన మేలు ఒక్కటీ లేదు. అప్పులు, అబద్దాలతో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ని చంద్రబాబు నాశనం చేస్తున్నారు.