– ట్రాఫిక్ తనిఖీల సమయంలో వారి వీడియోలు చిత్రీకరించి వైరల్
– వాహనాలు తనిఖీ చేసే సమయంలో వీడియోలు, రీల్స్ చేయడానికి ప్రాధాన్యం
– ట్రాఫిక్ పోలీసులకు సీపీ రాజశేఖర బాబు తలంటు
– పబ్లిసిటీ చర్యలు ఉపేక్షించేది లేదు
విజయవాడ: నగరంలో కొందరు ట్రాఫిక్ పోలీస్ అధికారులు డ్యూటీలు వదిలేసి సొంత ప్రచారం చేసుకోవడంపై సీపీ రాజశేఖర బాబు స్పందించారు. నగరంలోని కీలకమైన కూడళ్లలో ట్రాఫిక్ విధుల్లో ఉంటున్న సిఐలు, ఎస్సైలు సొంతంగా యూ ట్యూబర్లతో ప్రచారం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
మహిళలు, విద్యార్ధినులు, యువతులు, సామాన్య ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ తనిఖీల సమయంలో వారి వీడియోలు చిత్రీకరించి వైరల్ చేస్తున్నారు. ఈ వ్యవహారం గత కొన్నేళ్లుగా సాగుతోంది. యూ ట్యూబర్లతో పోలీసుల దోస్తీ వ్యవహారం సీపీ దృష్టికి రావడంతో కొద్ది రోజుల క్రితం ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
ప్రజల్లో అవగాహన కోసం చేపట్టే డ్రైవ్ లు, ఇతర కార్యక్రమాలను వ్యక్తిగత పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించకుండా కేవలం చలాన్లు రాయడం, వీడియోలకు పరిమితం అవుతున్నారు. రోడ్లపై ఆక్రమణలు తొలగించడంపై కూడా దృష్టి పెట్టడం లేదు. వాహనాలు తనిఖీ చేసే సమయంలో వీడియోలు, రీల్స్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
శనివారం విలేకరుల సమావేశంలో ట్రాఫిక్ పోలీసుల తీరును సీపీ దృష్టికి తీసుకు వెళ్ళడంతో ఆయన వివరణ ఇచ్చారు. ట్రాఫిక్ పోలీసులు ప్రచారం, రీల్స్ ప్రజల అవగాహన కార్యక్రమాలకు పరిమితం కావాలని, ఇటీవల కొందరు పోలీసులు తల్లీ కూతుళ్లను తనిఖీ పేరుతో చేసిన వీడియో అభ్యంతరకరంగా ఉండటం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇలాంటి పబ్లిసిటీ చర్యలు ఉపేక్షించేది లేదన్నారు.