మోసం చేయడంలో చంద్రబాబుది మాస్టర్స్ డిగ్రీ
● నాడు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత బస్సు అని హామీ
● నేడు అడుగడుగునా షరతులు
● దుర్గమ్మ సాక్షిగా హామీ ఇచ్చి మోసం
● ఉత్తరాంధ్ర నుంచి తిరుపతి వెళ్లడానికి 13 బస్సులు మారాలా..?
– కూటమి ప్రభుత్వంపై వరుదు కల్యాణి ఫైర్
విశాఖపట్నం: నాడు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత బస్సు అని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం నేడు ఫ్రీ బస్సు పథకానికి అడుగడుగునా షరతులు విధించడంపై వైయస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… దుర్గమ్మ సాక్షిగా హామీ ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకాన్ని స్త్రీ వంచనగా మార్చివేశారని మండిపడ్డారు. కేవలం 5 రకాల బస్సులకే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేయడాన్ని ఆక్షేపించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..
మహిళా సాధికారత కోసం ఉచిత బస్సు ప్రయాణంపెద్ద, పెద్ద హెడ్డింగులతో అని పత్రికల్లోనూ, ప్రసార మాధ్యమాల్లో కూటమి ప్రభుత్వం ఊదరగొట్టింది. ప్రభుత్వం చేసిన హడావుడి చూసి రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల మంది మహిళలు రాష్ట్రమంతటా ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చని ఎంతో ఆశగా ఎదురు చూశారు. మహిళల ఆశల్ని కూటమి ప్రభుత్వం బస్సు టైర్ల కింద తొక్కిపడేసింది. మహిళలు పవిత్రంగా భావించే శ్రావణమాసం శుక్రవారం కూటమి ప్రభుత్వం మహిళలను దారుణంగా మోసం చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలోనూ, ప్రతి ఎన్నికల ప్రచార సభలోనూ మహిళలకు రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం కూటమి పార్టీలు ఊదరగొట్టాయి. తీరా ఇప్పుడు అమల్లోకి వచ్చేసరికి ఉచిత బస్సు కొన్ని ప్రాంతాలకే పరిమితం అంటూ షరతులు విధించి మహిళలను దారుణంగా మోసం చేశాయి.
దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్ లోకేష్ ఇంత దారుణంగా మోసం చేయడం సమంజసమా? గతంలో రాష్ట్రంలో మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఇదే దుర్గమ్మ పాదాల చెంత హామీ ఇచ్చారా? లేదా? ఇంత పచ్చి అబద్దాలు చెప్పి.. మహిళలు మోసం చేయడం అత్యంత దుర్మార్గం.