● రాజధాని అమరావతి ప్రాంతం మునిగిపోవద్దని కుట్ర
● కొండవీటి వరద నీటిని గుంటూరు, కృష్ణా, అప్పాపురం ఛానళ్లకు మళ్ళింపు
● ఫలితంగా వరద ఉద్ధృథి పెరిగి కాల్వలకు గండ్లు
● పొన్నూరు నియోజకవర్గంలో 72 వేల ఎకరాల్లో పంట మునక
● తీవ్రంగా నష్టపోయిన రైతులు
● ప్రభుత్వ చర్య అనైతికం
– మీడియా సమావేశంలో అంబటి మురళీకృష్ణ వెల్లడి
తాడేపల్లి: రియల్ ఎస్టేట్ మాయలో పడి కళ్లు మూసుకుపోయిన ప్రభుత్వం అమరావతిని బతికించుకోవడం కోసం కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా, గుంటూరు, అప్పాపురం ఛానళ్లకు మళ్లించి పొన్నూరులో పొలాల ముంపునకు కారణమైందని వైయస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గం సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆక్షేపించారు. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, అందుకు వారు ప్రభుత్వాన్ని ఎప్పటికీ క్షమించరని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇంకా ఏం మాట్లాడారంటే…
ప్రభుత్వ కుట్ర వల్ల పొన్నూరు నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయినా మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం రివ్యూ చేసి ఎన్యుమరేషన్ చేయించకుండా చోద్యం చూడటం బాధాకరం. పంటలు మునిగి రైతులు నష్టపోయి వ్యవసాయానికి దూరమైతే పొలాలను రియల్ వెంచర్లుగా మార్చి రూ.3 వేల కోట్లు దోచుకోవాలని ఎమ్మెల్యే ధూళిపాల్ల నరేంద్ర కుట్ర చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎలాగూ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాదని భావిస్తున్న నరేంద్ర, నియోజకవర్గ రైతాంగాన్ని పూర్తిగా గాలికొదిలేశారు.
ఈ ఏడాది వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అయినా ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. మరోవైపు రాజధాని అమరావతి కోసం పొన్నూరు రైతులను కొండవీటి వరదనీటితో ముంచారు. పంటలు నీటమునిగి రైతులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నా మంత్రులు కానీ, కూటమి ఎమ్మెల్యేలు కానీ పొలాల వైపు కన్నెత్తి కూడా చూసిన పాపానపోవడం లేదు. పంట నష్టంపై అధికారులను నివేదిక కోరినట్టు కూడా ఎక్కడా వార్తలు కూడా లేవు. రైతుల సమస్యలతో ప్రభుత్వానికి సంబంధమే లేదన్నట్టు వారి సమస్యలు అసలు సమస్యలే కావన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది.