– రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వినతి పత్రాలు
తాడేపల్లి: ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేస్తూ, అత్యంత దారుణంగా, ఏకపక్షంగా నిర్వహించిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తోంది. ఆ దిశలోనే ఆ రెండు ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి పోలింగ్ స్టేషన్లు, ఆయా ప్రాంగణాల సీసీ కెమెరా ఫుటేజ్, పలు ఘటనలకు సంబంధించిన వీడియో కవరేజ్, పోలింగ్‌కు సంబంధించిన వెబ్‌కాస్టింగ్, ఆరోజు పోలింగ్ బూతుల్లో కూర్చున్న ఏజెంట్ల పేర్లు. జాబితా, పోలింగ్ ఆఫీసర్ (పీఓ) డైరీ, ఫామ్–12. ఫామ్–32, ఈ ఏడు అంశాల పూర్తి వివరాలు, సమాచారం ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాని (ఎస్ఈసీ)కి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వేర్వేరుగా రెండు (పులివెందుల, ఒంటిమిట్ట) వినతిపత్రాలు పంపించారు. వీలైనంత త్వరగా ఆ వివరాలు, పూర్తి సమాచారం ఇవ్వాలని వాటిలో లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి అధికార పక్షం చేసిన అరాచకాలు, వారికి వత్తాసు పలుకుతూ పోలీసులు వ్యవహరించిన తీరుపై వైయస్సార్సీపీ ప్రత్యక్షంగానూ, లేఖల ద్వారానూ మొత్తం 35 పర్యాయాలు ఎస్ఈసీకి వినతిపత్రాలు అందజేసింది. ఫిర్యాదు చేసింది. ఎన్నికలకు వారం రోజుల ముందు వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, పార్టీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. దానిపై ఆధారాలతో సహా ఎస్ఈసీకి వైయస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. అయినా ఎస్ఈసీ పట్టించుకోలేదు.
ఇక ఎన్నికల రోజున ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, తెల్లవారుజాము నుంచే అన్ని పోలింగ్ బూత్‌లు స్వాధీనం చేసుకున్న అధికార పక్షం నాయకులు, కార్యకర్తలు.. చివరకు ఏ పోలింగ్ బూత్‌లోకి వైయస్సార్పీపీ ఏజెంట్లను అడుగు కూడా పెట్టనీయలేదు. ఈ నేపథ్యంలో ఆ రెండు ఉప ఎన్నికల పూర్తి వివరాలు, సమాచారం, వీడియోలు ఇవ్వాలంటూ వైయస్సార్సీపీ రెండు లేఖల ద్వారా ఎస్ఈసీకి విజ్ఞప్తి చేసింది.