– జగన్ హయాంలో పెట్టించిన కేసులు క్వాష్!
రక్తపు వాంతులు గట్రాల మీద తదుపరి లోతైన విచారణ చేస్తే జగన్ & భారతీల వరకు వెళుతుంది.
బంతిని సీబీఐకి ఇచ్చిన సుప్రీంకోర్టు!
వివేకా హత్యకేసు నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కే. సింగ్ ధర్మాసనం విచారించింది.
సునీత తరపు లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు
వివేకా కుమార్తె సునీత తరపు లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు. దర్యాప్తును ముగించడానికి సుప్రీంకోర్టు విధించిన గడువే కారణమని సీబీఐ చెబుతోందని తెలిపారు. ఈ కేసులో ఇంకా మరింత దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా ఈ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నిందితులు సాక్ష్యులను బెదిరించడంతో పాటు సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని లూథ్రా ఆరోపించారు.
అంతేకాకుండా, సునీత దంపతులు మరియు సీబీఐ అధికారి రాంసింగ్‌పై పెట్టిన కేసులను రద్దు చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డే ప్రధాన సూత్రధారి అని సిద్ధార్థ లూథ్రా వాదించారు.
సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు
సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. నిందితులను నిరవధికంగా జైల్లో ఉంచడం సరికాదని ఆయన అన్నారు. హత్య జరిగిన తీరు చూస్తుంటే, నిందితులకు రెండు, ఐదు సంవత్సరాల జైలు శిక్ష చాలా తక్కువే అనిపిస్తోందని తెలిపారు. నిందితులు ఆధారాలను చెరిపివేయడం, సాక్ష్యాధారాలు లేకుండా చేయడం నిరూపితమైందని అన్నారు.
మొదట గుండెపోటు అని, ఆ తర్వాత రక్తపు వాంతులు అని ప్రచారం చేసి హత్యను కప్పిపుచ్చడానికి అన్ని విధాలా ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు. దర్యాప్తులో ఈ విషయాలన్నీ పూర్తిగా బయటపడ్డాయని ఎస్వీ రాజు వివరించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు
ఈ విచారణలో, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయవచ్చని సీబీఐ పేర్కొంది. కేసులో మరింత దర్యాప్తు అవసరమా లేదా అనే దానిపై సీబీఐ ఒక పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటివరకు ఈ విచారణను పెండింగ్‌లో ఉంచుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.