• వంద మార్కులతో హాస్టళ్ల పనితీరు అంచనా
• విభాగాల వారీగా మార్కులు కేటాయింపు
• విద్యార్థుల హాజరుకు 10 మార్కులు
• ఉత్తీర్ణతా శాతానికి 40 మార్కులు
• పీ-4 మోడల్ అమలుకు 6 మార్కులు
• అత్యధిక మార్కులు సాధించిన వార్డెన్లకు బదిలీలు, పదోన్నతుల్లో ప్రాధాన్యం
• బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యే లక్ష్యం
– మంత్రి సవిత
అమరావతి: కార్పొరేట్ విద్యా సంస్థల హాస్టళ్లకు దీటుగా, సొంతింటిని మరిపించే సౌకర్యాలతో బీసీ బిడ్డలకు ఆరోగ్య భద్రతతో కూడిన నాణ్యమైన విద్యను అందించేలా రాష్ట్రంలో బీసీ హాస్టళ్ల నిర్వహణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిధులు, పరికరాలు అందించడమే కాకుండా మంచి పనితీరు కనబరిచే హాస్టళ్లకు మార్కులు వేయనుంది. అత్యధిక మార్కులు సాధించిన హాస్టళ్ల వార్డెన్లకు బదిలీలు, పదోన్నతల్లో ప్రాముఖ్యతనిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 1,110 బీసీ హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో 747 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, 363 పోస్టు మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. 660 వసతి గృహాలు ప్రభుత్వ భవనాల్లో ఉండగా, మిగిలిన 450 హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి బీసీ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. 104 బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఎస్ఆర్ శంకరన్ రిసోర్సు సెంటర్లను ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వం చెల్లించకుండా మిగిల్చిన రూ.76.38 కోట్ల డైట్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం చెల్లించింది.
వసతి గృహాల్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్.ఆర్.ఎస్.) అటెండెన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టి పారదర్శకతకు పెద్దపీట వేసింది. వసతి గృహాల భవనాల్లో మరమ్మతులకు రూ.13.10 కోట్లు మంజూరు చేసింది. డీఎంఎఫ్, సీఎస్ఆర్ ఫండ్స్, ఇతర వనరుల ద్వారా రూ.20 కోట్లకు పైగా జిల్లా కలెక్టర్ల ద్వారా సమీకరించి, వసతి గృహాల్లో మరమ్మతులు, విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలను కల్పించింది. వసతి గృహాలకు అవసరమైన వంట పాత్రలతో పాటు విద్యార్థులకు అవసరమైన సామాగ్రి కొనుగోలుకు రూ.18 కోట్లు అందజేసింది.
వసతి గృహ పిల్లలకు సన్నబియ్యంతో నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తోంది. తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే అందరికీ రూ.13 వేల చొప్పున తల్లుల ఖాతాలో జమచేసింది. క్రీడల్లో ప్రోత్సాహంలో భాగంగా వసతి గృహాల విద్యార్థులకు త్వరలో స్పోర్ట్స్ మెటీరియల్ అందజేయనుంది. అన్ని వసతి గృహాల్లోనూ విద్యార్థుల రక్షణ, సౌకర్యార్థం సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ నిధులతో తమ నియోజక వర్గాల్లో ఉన్న బీసీ హాస్టళ్లలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఎంపీలు బస్తిపాటి నాగరాజు, కలిశెట్టి అప్పలనాయుడు తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి కోటి రూపాయల చొప్పున బీసీ హాస్టళ్ల అభివృద్ధికి కేటాయించారు.
హాస్టళ్ల నిర్వహణకు మార్కులు
విమర్శలకు తావివ్వకుండా పారదర్శకతతో బీసీ హాస్టళ్ల నిర్వహణకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా, బాగా పనిచేసే హాస్టళ్లకు 100 మార్కులు ఇవ్వనుంది. మార్కులను ప్రతి ఏటా యాన్యూవల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్టు(ఏసీఆర్) ద్వారా వార్డెన్ల పనితీరును రాష్ట్ర కార్యాలయానికి అందజేయనున్నారు. విధుల్లో చిత్తశుద్ధితో పనిచేసే వార్డెన్లకు కూడా ప్రోత్సాహించేలా ప్రణాళికులు రూపొందించింది. అత్యధిక మార్కులు సాధించిన వార్డెన్లకు బదిలీలు, పదోన్నతుల్లో ప్రాధాన్యమిచ్చేలా చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు హాస్టల్ పనితీరు అంచనా విధానానికి శ్రీకారం చుడుతోంది.
మార్కులు కేటాయింపు ఇలా…
బీసీ హాస్టళ్లు పనితీరు మెరుగుపరిచే ప్రణాళికల్లో భాగంగా 100 మార్కులు కేటాయిస్తోంది. విద్యార్థుల హాజరుకు 10 మార్కులు, పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభకు 20 మార్కులు, ఉత్తీర్ణతా శాతం ఆధారంగా మరో 20 ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మెనూ అమలు చేస్తే 10 మార్కులు, హాస్టళ్లలో ఎటువంటి ఘటనలూ చోటుచేసుకోకపోతే మరో 5 మార్కులు ఇవ్వనున్నారు.
హాస్టళ్ల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం పెంపుదలకు 5 మార్కులు, పేరెంట్స్ మీటింగ్స్ కు 4 మార్కులు, ఎప్పటికప్పుడు హాస్టళ్లలో వైద్య శిబిరాల ఏర్పాటుకు 4 మార్కులు, రికార్డుల నిర్వహణ, సకాలంలో బిల్లుల అందజేతకు 4 మార్కులు, సాంకేతిక విద్య అమలు, విద్యార్థులతో చేయించే నూతన ఆవిష్కరణలకు 4 మార్కులు, పీ-4 మోడల్ అమలుకు 6 మార్కులు, హాస్టళ్ల నిర్వహణపై విమర్శలు రాకుండా మెరుగైన పనితీరు కనబర్చే వార్డెన్లకు 2 మార్కులు ఇవ్వనున్నారు.
బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యే లక్ష్యం
బీసీ హాస్టళ్ల నిర్వహణపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. కార్పొరేట్ విద్యా సంస్థల ధీటుగా బీసీ హాస్టళ్లలో సౌకర్యాలు కల్పిస్తున్నాం. బీసీ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్య భద్రత అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. సన్నబియ్యం భోజనం అందిస్తున్నాం. సీసీ కెమెరాలు, ఇన్వర్టర్లు, స్వచ్ఛమైన తాగునీటికి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. గత ప్రభుత్వం పెట్టిన డైట్ బకాయిలు, కాస్మోటిక్ చార్జీలు చెల్లించాం. ఎప్పటికప్పుడు డైట్ బిల్లులు, కాస్మోటిక్ ఛార్జీలు చెల్లిస్తున్నాం.
హాస్టళ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేశాం. హాస్టల్ విద్యార్థులకు తల్లికి వందనంతో పాటు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్లు అందజేశాం. కంప్యూటర్ విద్యకు ప్రాధాన్యమిస్తున్నాం. హాస్టల్ విద్యార్థులకు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. బీసీ హాస్టళ్ల నిర్వహణ మెరుగుపరచడంతో పాటు విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేసే వార్డెన్లకు గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మార్కులు విధానం తీసుకొస్తున్నాం. ఈ విధానంతో బీసీ హాస్టళ్లు పనితీరు మరింత పెరుగుపడడం ఖాయం.