తెలుగు ప్రజలకు గర్వకారణం
– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ: ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటించడం తెలుగు ప్రజలకు గర్వకారణం. పార్టీలు, రాజకీయాలను పక్కన పెట్టీ న్యాయ నిపుణుడికి ఇండియా కూటమి అవకాశం ఇవ్వడం హర్షణీయం. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్న ఈ సమయంలో సుదర్శన్ రెడ్డి లాంటి న్యాయరంగ నిపుణులు ఉప రాష్ట్రపతి పదవిలో ఉంటేనే రాజ్యాంగానికి రక్షణ ఉంటుందని ఇండియా కూటమి బలంగా నమ్ముతుందన్నారు.
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన తెలుగు వారికి దక్కిన గౌరవం. రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు ఏకం కావాల్సిన సందర్భం ఇది. తెలుగు బిడ్డకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే సమయం ఇది. సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. ఆయనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఆయన ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్. సుదర్శన్ రెడ్డిని తెలుగు బిడ్డగా పరిగనణలోకి తీసుకుని, న్యాయరంగంలో ఆయన చేసిన విశేష సేవలను గుర్తు చేసుకుంటూ, రాజకీయాలు ఆపాదించకుండా టీడీపీ, జనసేన, వైసీపీ, బీఆర్ ఎస్ పార్టీలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. ఇందుకు చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్, కేసీఆర్ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా అని అన్నారు.