– రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి: నూతన రాజధాని అమరావతిలో వరదలు ముంచెత్తాయని, అమరావతి మునిగిపోయిందని తప్పుడు ప్రచారం చేసే వైసీపీ మూకలు దమ్ముంటే అమరావతి వచ్చి చూడాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2014 తర్వాత అమరావతిని ఆంధ్రప్రదేశ్ కు నూతన రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి ఏదోక తప్పుడు ప్రచారంతో అమరావతి, రాష్ట్ర పరువు తీయాలని వైసీపీ ప్రయత్నం చేస్తోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఏడాది వరదల సమయంలో కూడా ఇలాగే తప్పుడు ప్రచారం చేసి పబ్బం గడుపుకున్నారని, దమ్ముంటే అమరావతి వచ్చి చూడాలని కొండపల్లి శ్రీనివాస్ ఛాలెంజ్ చేశారు. తాను నాలుగు రోజుల నుంచి అమరావతిలోనే ఉన్నానని, ఈ నాలుగు రోజులు కృష్ణా నదికి భారీగా వరదలు వచ్చినా, గత వారంలో భారీ వర్షాలు పడినా రాజధాని ప్రాంతంలో నీరు నిలబడలేదు అని మంత్రి స్పష్టం చేశారు.
ఈ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యా వంతులు కూడా తప్పుడు ప్రచారం చేయడం విచారకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అనుమానాలు ఉన్న వాళ్ళు అమరావతి వచ్చి చూస్తే, సొంత ఖర్చులతో చూపిస్తాను అంటూ సవాల్ విసిరారు.