– రైతులకు యూరియానూ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం
– పాలనను పూర్తిగా విస్మరించిన కూటమి
● రాష్ట్రంలో ఎక్కడ చూసినా యథేచ్ఛగా భూకబ్జాలు
● మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి తాబేదార్లే నిందితులు
● వ్యక్తిగత ఆరాధన, సంపాదన తప్ప మరో ధ్యాస లేదు
● కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్నా చేతగానితనం
– విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడాల్సిన బాధ్యత మీదే
– 14 నెలల్లో 15 దఫాలు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు
– అయినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడం లేదు
– రాజమహేంద్రవరం వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
రాజమహేంద్రవరం: కూటమి పాలనలో రాష్ట్రంలో ప్రజలకు ప్రజాస్వామ్యయుతమైన, ప్రజల మంచి కోరే పాలన అందడం లేదని శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్ధులతో సహా ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా యథేచ్ఛగా భూకబ్జాల పర్వం కొనసాగుతోందని, అందులో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రమేయం కనిపిస్తోందని తెలిపారు.
అధ్వాన్నమైన పాలనతో అన్ని రంగాల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం, చివరకు రాష్ట్రానికి తలమానికంగా నిల్చిన, ఎన్నో పోరాటాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కూడా కాపాడలేకపోతోందని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు.
పూర్తిగా వ్యక్తిగత ఆరాధనతోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది మంచి సంప్రదాయం కాదు. గత వైయస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం చేస్తూ అమలు చేసిన రైతు భరోసాకు ఈ ప్రభుత్వం కిందటేడాది ఎగనామం పెట్టింది. ఏడాది తర్వాత ఈ సంవత్సరం కేంద్ర సాయంతో ఇస్తున్న రూ.20 వేలు కూడా గతంలో రైతుభరోసా తీసుకున్న అర్హులైన రైతులందరికీ అందడం లేదు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గతంలో రైతుభరోసా తీసుకున్న రైతుల్లో దాదాపు 80 వేల మందికి ఇప్పుడు కోత పెట్టారు. అలా రాష్ట్రంలో ఏడున్నర లక్షలకు పైగా రైతులకు పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు. ఇది కచ్చితంగా రైతులను మోసం చేయడమే.
పెన్షన్ రూ.1000 పెంచామంటూ గొప్పగా చెబుతున్నప్పటికీ దాంట్లోనూ 5 లక్షలకు పైగా కోత పెట్టారు. ఇంకా లక్ష మందికి వితంతు పెన్షన్ ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నా.. కొత్తగా ఒక్కరికి కూడా మంజూరు చేయలేదు. పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే, అదే పెన్షన్‌ను ఆయన భార్యకిస్తున్నారు తప్ప, కొత్తగా జాబితాలో ఎవరినీ చేర్చడం లేదు. 14 నెలల్లో దాదాపు రూ.2 లక్షల కోట్లు అప్పు చేసినా, పథకాలేవీ అమలు చేయడం లేదు. మరి తెస్తున్న సొమ్ము, చేస్తున్న అప్పు ఎక్కడికి పోతోంది?.
ఇంకా ఘోరం ఏమిటంటే, కేంద్రం ఇచ్చే ఉపాధి హామీ పథకంలో దేశ, రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 7 వారాలు అవుతున్నా వారి వేతనాలు ఇవ్వలేదు. పని చేయించుకున్న తర్వాత పేదవాడి కూలి ఇవ్వకపోతే వారు ఎలా బ్రతకాలి? అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ఇంటింటికీ కుళాయి పథకాన్ని ఇంకా ఎందుకు ప్రారంభించలేదు.
రైతులకు ఒక యూరియా బస్తా ఇవ్వలేని దుస్ధితిలో ఈ ప్రభుత్వం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత యూరియా కావాలి? ఎంత స్టాక్ ఉండాలి? ఎంత బఫర్ స్టాక్ మెయింటైన్ చేయాలన్న దానిపైనా ప్రభుత్వానికి స్పష్టత లేదు. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నా, రాష్ట్రానికి సరిపడా యూరియా తెచ్చుకోలేకపోయారు, కారణం రైతులు, వ్యవసాయం బాగుపై ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదు. వాటి గురించి ఆలోచించే సమయం అంతకన్నా లేదు.
పౌరసరఫరాల శాఖ మంత్రి జిల్లాల పర్యటనలో పీడీఎస్ బియ్యం గురించి అనేక మాటలు చెబుతారు. ఇంటి గడప వద్దే రేషన్ అందించే ఎండీయూ వాహనాలకు మంగళం పాడారు. దీంతో రేషన్ బియ్యం ఎక్కడికక్కడ దారి మళ్లుతోంది. అయినా ఎవరిమీదా ఏ చర్యలు లేవు. విశాఖపట్నం వెళ్లి గోదాములు సీజ్ చేయమని మంత్రే ప్రకటిస్తారు. కానీ, రెండు రోజుల తర్వాత కాదంటారు. అసలు ఏమిటీ మర్మం?.
‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో 32 మంది బలిదానంతో స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. అలాంటి స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిçంచే చర్యలు మొదలయ్యాయి. ఈ నిర్ణయాన్ని కూడా అధికార పార్టీ నాయకులు ప్రతిఘటించడం లేదు. తాజాగా ఉక్కు కర్మాగారంలోని పవర్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయడానికి టెండర్లు పిలిచారు.
ఇంకా మరో 32 విభాగాలను కూడా ప్రైవేటుపరం చేస్తున్నారు. దీన్ని కూడా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఎందుకు అడ్డుకోవడం లేదు?.
ఇదే స్టీల్‌ప్లాంట్‌పై గతంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, పలువురు మంత్రులు, బీజేపీ నేతలు చాలా పెద్ద, పెద్ద మాటలు చెప్పారు. మరి ఇవాళ వారంతా నోరెందుకు మెదపడం లేదు?.
సీఎం చంద్రబాబు ఈ 14 నెలల్లో 15 దఫాలు ఢిల్లీ వెళ్లారు. కానీ ఏం సాధించారు? ఆ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటి? ప్రధాని స్వయంగా విశాఖపట్నం వచ్చినా, రాష్ట్రానికి వచ్చినా ఆయనతో ఎందుకు స్టీల్ ప్లాంట్ గురించి హామీ పొందలేకపోతున్నారు? ఇన్ని తప్పుడు విధానాలు, వైఫల్యాలతో ఎవరిని మభ్యపెడదామని చూస్తున్నారు?.
ఆ ఎన్నికకు రాజకీయం ఆపాదించొద్దు:
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వంటి రాజ్యాంగ బద్ధమైన పదవులకు జరిగే ఎన్నికలకు రాజకీయం ఆపాదించడం సరి కాదు. సంఖ్య ఎక్కువగా ఉన్నా కావాలనే పోటీ పెట్టి, ఆ పదవికి ఉన్న ప్రాముఖ్యతను తగ్గించకూడదని మా పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయం.
గతంలో నేను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ నుంచి ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతి పదవికి ప్రతిపాదిస్తే.. ఆ నిర్ణయాన్ని ఆరోజు జగన్ సమర్థించారు. అప్పుడు ఆయన కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నా, రాష్ట్రపతి ఎన్నికలో మా పార్టీకి మద్దతు ఇచ్చారు.
రాష్ట్ర విభజన తర్వాత 2014లో అప్పటి టీడీపీ పభుత్వం స్పీకర్‌గా కోడెల శివప్రసాద్ ని పెట్టినప్పుడు, మా వైయస్సార్సీపీకి తగిన సంఖ్యా బలం ఉన్పప్పటికీ, ఆ పదవికి గౌరవం ఇస్తూ, పార్టీ నుంచి అభ్యర్థిని దింపలేదు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావాలన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నాం.
రాజధాని నిర్మాణంలో అంతులేని అవినీతి:
రాజధాని అమరావతిలో చదరపు అడుగు నిర్మాణానికి రూ.10 వేలు ఖర్చు చేస్తున్నారు. నిజానికి చదరపు అడుగుకు రూ.5 వేల వ్యయంతో అత్యంత విలాసంగా నిర్మాణం చేయొచ్చు. కానీ, ఇక్కడ అమరావతిలో అంతకు రెట్టింపు వ్యయం చేస్తూ, అంతులేని అవినీతి చేస్తున్నారు.
అదే సమయంలో వర్షాలకు రాజధాని అమరావతి ప్రాంతం మునిగిపోతోంది. ఇది వాస్తవం. గతేడాది బుడమేరుకు విజయవాడలో వరదలు వచ్చాయి. అప్పుడేం చెప్పారు. పైన రెండు ఆనకట్టలు కట్టి, ఈ నీటిని రాకుండా చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ మాటే మర్చిపోయారు. మళ్లీ ఇప్పుడు వరద రావడంతో అదే మాట చెబుతున్నారు. ఇక జగన్ రాజమహేంద్రవరంలో త్వరలోనే పర్యటిస్తారని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ చెప్పారు.