– సొంత గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మించుకోలేకపోయిన ప్రకాష్ రెడ్డి
– మీరు కమీషన్ల కోసం బెదిరించారు.. మేం నిర్మాణం చేసి చూపించాం
– గొరిదిండ్ల విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పరిటాల సునీత
గొరిదిండ్ల: సొంత గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించుకోలేని అసమర్థుడు తోపు ప్రకాష్ రెడ్డి అని.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఆత్మకూరు మండలం గొరిదిండ్ల గ్రామంలో 33/11కేవి విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే పరిటాల సునీత, విద్యుత్ శాఖ అధికారులు, నాలుగు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ ఒక పండుగ వాతావరణంలో ప్రారంభించారు. సబ్ స్టేషన్ లో శిలాఫలాకాన్ని ఆవిష్కరించి అధికారులతో కలసి ట్రాన్స్ ఫార్మర్స్ పరిశీలించారు.
స్విచ్ ఆన్ చేసి విద్యుత్ సరఫరాను ప్రారంభించారు. సబ్ స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ గతంలోనే ఇక్కడ సబ్ స్టేషన్ మంజూరైతే.. తోపు సోదరుల దౌర్జన్యాలు, ముడుపులు, అరాచకాలతో నిర్మాణం జరగకుండా ఆపారన్నారు. గడవులోగా నిర్మాణం చేపట్టకపోవడం వలన సబ్ స్టేషన్ రద్దు చేయాలని నిర్ణయించారన్నారు. కానీ ఒక్కసారి రద్దైతే మళ్లీ మంజూరు చేయించడానికి సమయం పడుతుందని.. ప్రకాష్ రెడ్డి స్వగ్రామం తోపుదుర్తి, గొరిదిండ్లలో సబ్ స్టేషన్ల నిర్మాణం కొనసాగించేలా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను కోరామన్నారు. ఆయన అడిగిన వెంటనే గొరిదిండ్ల తోపుదుర్తితో పాటు ముత్తవకుంట్ల, రాప్తాడులో సబ్ స్టేషన్లు మంజూరు చేశారన్నారు.
వీటి నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని.. త్వరలోనే వాటిని ప్రారంభిస్తామన్నారు. నియోజకవర్గంలో ఇంకనూ ప్రసన్నయపల్లి, ఆలమూరు, మన్నీల, సోమలదొడ్డి, దాదులూరు, మద్దలచెరువు న్యామద్దల, ప్యాధిండి గ్రామాలలో కొత్త సబ్ స్టేషన్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు కొబ్బరి కాయలు కొట్టడం, నాపై విమర్శలు చేయడం తప్ప ప్రకాష్ రెడ్డి చేసిందేమి లేదన్నారు. ఈ రోజు నా గ్రామంతో పాటు నీ గ్రామంలో కూడా సబ్ స్టేషన్ నిర్మించామన్నారు. రైతులను దృష్టిలో ఉంచుకునే ఈ సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టామన్నారు.
ప్రస్తుతం గొరిదిండ్ల సబ్ స్టేషన్ నిర్మాణం వలన వేల కుటుంబాలకి మేలు చేకూరుతుందన్నారు. గొరిదిండ్ల, డి.కె. తాండా, ముట్టాల, పాపంపల్లి మొదలైన గ్రామాలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. ముఖ్యంగా రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. కొండపల్లి గ్రామానికి కూడా విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఒక్క ఆత్మకూరు మండలంలోనే నాలుగు వందలకు పైగా ట్రాన్స్ ఫార్మర్లు అందజేసినట్టు చెప్పారు.
వ్యవసాయానికి మెరుగైన విద్యుత్ సరఫరా చేసేలా, పార్టీలు చూడకుండా అడిగిన ప్రతి ఒక్కరికీ ట్రాన్స్ ఫార్మర్లు అందజేస్తున్నట్టు తెలిపారు. అయితే రైతులు, గృహ వినియోగదారులు పీఎం సూర్యఘర్ పథకం కింది సోలార్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందు కోసం సబ్సిడీ కూడా అందజేస్తున్నట్టు చెప్పారు. దీనిని వినియోగించుకుంటే అసలు విద్యుత్ సమస్యే ఉండదన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల వారికి మేలు చేసే విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పారు. అందుకే తాము ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోందని ఎమ్మెల్యే సునీత అన్నారు.