– అసెంబ్లీ నా – జ్ఞాపకాలు 4
(శ్రీపాద శ్రీనివాస్)
1998-99 స. మధ్యలో అనుకుంటాను…..
ఓ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తన కార్యాలయంలో ( రాజమండ్రి) ఊరి పెద్దలతో ఓ విషయం మీద సీరియస్ గా చర్చిస్తున్నారు.
ఆ సమయంలో నా బోటి వాళ్ళం ఆయన కార్యాలయం లోనే వున్నాం.
ఇంతలో ట్రింగ్…ట్రింగ్ అంటూ లాండ్ ఫోన్ మ్రోగింది.
వెంటనే ఆ ఫోన్ ను అందుకుని అరుణ్ కుమార్ గారు ఫోన్ చేసిన వారి మాటలు వింటూ కాస్త ఎర్రబాడిన వదనంతో నాకేసి చూడ సాగారు.
కానీ ఆ కోపంలో కూడా తనకు వస్తున్న నవ్వును తన పెదవుల మధ్యనే దాచుకుంటూన్నట్లుగా నాకైతే అనిపించింది.
” నిన్ను అన్నాడని నాకు ఫోన్ చేసావు. బాగానే వుంది. మమ్మల్ని కూడా అలానే అంటుంటాడు.మేం ఎవరికి చెప్పాలి” అంటూ అరుణ్ కుమార్ గారు ఫోన్ లో అనసాగారు.
హఠాత్తుగా ముఖ కవళికలను మార్చుకున్న అరుణ కుమార్ గారిని చూసి ” ఏమైంది…!” అంటూ ఆత్రుతగా అడగసాగారు ఆయన ముందు వున్న ఊరి పెద్ద లలోనీ ఒకరు.
” ఏముంది…నిన్న ఏదో విషయమై మన శ్రీపాద శ్రీనివాస్ ను జక్కంపూడి మందలించాడట.
” నాకు కోపం తెప్పిస్తే జక్కంపూడిని అయిపోతా..” అని జక్కంపూడి రామ్మోహనరావునే బెదిరించాడట మన శ్రీనివాస్. తనకి ఏం చేయాలో తోచక రామ్మోహన్ నాకు ఫోన్ చేసాడు” అంటూ అరుణ్ కుమార్ గారు పెద్దలతో అంటున్నారు.
” అవును నన్ను కూడా ఒకసారి ఇలానే బెదిరించాడు” అంటూ అక్కడే వున్న సత్తి గంగాధర్ రెడ్డి గారు అనడంతో ఒక్కసారి ఊరి పెద్దలు నాకేసి చూసారు. ” ఔరా…ఎంత పని చేసావు శ్రీపాద..” అని అర్దం వచ్చే రీతిలో!
కాస్త కోపం వచ్చినా ” జక్కంపూడి” ని అయిపోతాను..అనడం శ్రీనివాస్ కి ఊత పదం. అలవాటు అయిపొయింది. మనం సద్దుకుపోతాం. ఆఖరికి జక్కంపూడి మొహం మీదనే ఇలా అనేసాడు” అంటూ నినివ్వెరపోతున్న అరుణ్ కుమార్ గారు నవ్వసాగారు.
” పొద్దస్తమాను అరుణ్ కుమార్ గారితోనే వుంటావు.. కనీసం అందుకైనా ” అరుణ్ కుమార్ ” ను అయిపోతాను అనొచ్చుగా.. పోకపోక ” ఆ రామ్మోహన్” జోలికి ఎందుకు వెళ్ళడం” అంటూ “రత్నాజీ” గారు ( అరుణ్ కుమార్ గారి ఫ్రెండ్) అనడంతో ఆయన ఆఫీస్ అంతా ఒక్కసారి నవ్వులతో నిండిపోయింది.
ఇక్కడే ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి రామోహన్ గారి గురించి….
నాబోటి వారికి సైతం ఊత పదంగా మారేటంత క్రేజ్ ఆ రోజుల్లో జక్కంపూడి గారికి ఎలా వచ్చింది అంటే…
” 1988-89 సం.మధ్య అనుకుంటాను….
అప్పుడే రామ్మోహన్ గారికి ” జక్కంపూడి రాజా” పుట్టిన సమయంలో
రాజమండ్రిలోని ” దేవిచౌక్ – అల్లూరి సీతారామరాజు విగ్రహాం” సెంటర్ లో కాంగ్రెస్ – టీడీపీ వర్గాలు ఓ విషయమై ఘర్షణ పడి తలపడ్డారు.
సోడా బుడ్డులు.. రాళ్ళు..విసురుకుంటూ తన్నుకోసాగారు. ఇలాంటి వీధి పోరాటాలు రాజమండ్రి వాసులకు అప్పట్లో కొత్త. అప్పటికే రెండుసార్లు ఎన్నికల్లో సాధించిన విజయం కారణంగా టీడీపీ వారు మంచి ఊపుతో, కాంగ్రెస్ శ్రేణులపై దాడి చేయసాగారు.
సరిగ్గా అదే సమయంలో జక్కంపూడి రామ్మోహనరావు గారు అక్కడకు చేరుకోవడంతో, మొత్తం పరిస్థితే మారిపోయింది… కాంగ్రెస్ శ్రేణుల్లో రెట్టించిన ఉత్స్తాహం కలిగింది. మొత్తం మీద నగర పెద్దల జోక్యంతో ఆ వివాదం ముగిసింది.
కానీ ఆ క్షణం నుండి జక్కంపూడి అంటే రాజమండ్రి రాజకీయాల్లో ఒక క్రేజ్ ఏర్పడింది. ఆయనతో పరిచయం కలిగి వుండటమే ఒక అంతస్తు.. అంతేకాదు ఆయనకు ఒక కరచాలనం చేస్తే చాలు గర్వంగా ఫీల్ అయ్యే రోజులు నాలాంటి కుర్రాళ్లకు (..అప్పట్లో)
నాకైతే మరి కాస్త గర్వంగా ఉండేది. ఎందుకంటే ఆయన కుటుంబం మొట్టమొదటి సారిగా ” ఎలక్షన్” రాజకీయాలను ఎదుర్కొన్నది మా వార్డ్ ” వీరభద్రపురం – జయకృష్ణ పురం” నుండే!
ఆ ఎన్నికల్లో రామ్మోహన్ గారి అర్దాంగి శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి గారు కౌన్సిలర్ గా విజయం సాధించారు. ఆమె విజయానికై .. మా నాన్న గారితో పాటు.. సర్వశ్రీ చింతపెంటా రాజా.. మేడిశెట్టి నానారావు వంటి పెద్దలు ఎంతో శ్రమించారు.