పీఎం, సీఎం, మంత్రులు తీవ్ర నేరారోపణలకు పాల్పడితే వాళ్లను తొలగించేలా కేంద్ర ప్రభుత్వం 3 రాజ్యాంగ సవరణ బిల్లులను లోక్ సభలో ప్రవేశ పెడుతోంది. వీటి ప్రకారం కీలక పదవుల్లో ఉన్న ప్రధాని, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు.. ఇలాంటి వాళ్లెవరైనా ఐదేళ్లకు పైబడి శిక్ష పడే కేసుల్లో అరెస్ట్ అయి 30 రోజుల పాటు జైల్లో ఉంటే 31వ రోజు వాళ్లు ఆటోమేటిక్ గా పదవి కోల్పోతారు.
30 రోజులలోపు అలాంటి రాజకీయ నేరస్థులు రాజీనామా చేయాలి. లేకుంటే పదవిని కోల్పోవడం ఖాయం. ఇలా చేయడం ద్వారా రాజకీయ నాయకులు నేరాలకు పాల్పడకుండా ఉంటారు. నేరం చేయాలంటే భయపడతారు. పదవులు దక్కవేమోననే ఆందోళన ఉంటుంది. పదవుల నుంచి తొలగించే అధికారం కేంద్ర స్థాయిలో రాష్ట్రపతి, రాష్ట్రస్థాయిలో గవర్నర్కు ఉంటుంది.
ఇంతకుముందు నేరం రుజువైతేనే శిక్ష పడే వీలుండేది. అప్పటివరకూ ఇలాంటి వాళ్లు పదవులు అనుభవిస్తూ ఉండే వాళ్లు. కానీ ఇప్పుడు అలా వీలు కాదు. ఈ బిల్లులు చట్టరూపం దాల్చితే రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఎక్కువ కావచ్చు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం.
నేరారోపణ ఎదుర్కొంటున్న రాజకీయ నేతలపై కేంద్రం కక్ష సాధించే అవకాశం ఉండొచ్చు. ఈ కేసులకు సంబంధించి న్యాయస్థానాలు 30 రోజుల లోపు తీర్పు వెల్లడించకపోతే రాజకీయ నాయకులు బలైపోతారు.