– 2025 ఖరీఫ్ కోసం 31.15 లక్షల మెట్రిక్ టన్నులు అంచనా
– ఇప్పటివరకు 21.34 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేశాం
– ఎరువుల కొరత రాకుండా 1.10 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ సిద్ధం
– గోదావరి వరదలతో సమస్యలు తలెత్తినా, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది
– వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి: రాష్ట్రంలోని రైతులకు ఎరువుల సరఫరా విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పంటలకు అవసరమైన ఎరువులు సమయానికి అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఖరీఫ్ 2025 సీజన్లో ఎరువుల అవసరం, సరఫరా, నిల్వలు, కేంద్రం–రాష్ట్రం సమన్వయం, రైతులకు ఇచ్చిన హామీలపై మంత్రి అచ్చెన్నాయుడు విస్తృతంగా వివరణ ఇచ్చారు. ఖరీఫ్ సీజన్‌కు 31.15 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరంగా అంచనా వేయబడి, ఇప్పటి వరకు 21.34 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి చేరాయని తెలిపారు. అందులో యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎస్ఎస్పీ, కాంప్లెక్స్ ఎరువులు కలిపి 6.22 లక్షల మెట్రిక్ టన్నులు రైతులకు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రం మొత్తం రైతుల అవసరాలను బట్టి జిల్లాల వారీగా సరఫరాలను సక్రమంగా పర్యవేక్షిస్తున్నామని వివరించారు.
బఫర్ స్టాక్ ఏర్పాటు – భవిష్యత్ ప్రణాళిక
రైతులకు ఎరువుల కొరత రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని 1.10 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఉంచిందని మంత్రి తెలిపారు. గోదావరి వరదల వల్ల కొన్ని ప్రాంతాల్లో రవాణా సమస్యలు తలెత్తినప్పటికీ, రైతులకు ఎరువులు సమయానికి అందేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇంకా 79,633 మెట్రిక్ టన్నులు డిపోలలో నిల్వగా ఉండగా, అవసరమైన ప్రాంతాలకు తరలింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
కేంద్రం – రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పంపిణీపై కఠిన పర్యవేక్షణ
ఎరువుల సరఫరాలో కేంద్రం–రాష్ట్రం సమన్వయంతో 50:50 నిష్పత్తిలో పంపిణీ జరుగుతోందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం నుండి ఇప్పటి వరకు 3.50 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా, అందులో 1.30 లక్షల మెట్రిక్ టన్నులు చేరాయని, 0.47 లక్షల మెట్రిక్ టన్నులు రాబోతున్నాయని తెలిపారు. ఆగస్టు నెలలో 1.65 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా, అందులో 0.75 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి చేరాయని, మిగిలిన 0.90 లక్షల మెట్రిక్ టన్నులు గంగవరం, కాకినాడ, విశాఖపట్నం, ఒరిస్సా పోర్టుల ద్వారా త్వరలో చేరనున్నాయని వివరించారు.
రైతులకు ఎరువులు పారదర్శకంగా, సమయానికి అందించేందుకు ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. ఈ విధానం వల్ల ఎరువుల నిల్వలు, అవసరాలు, పంపిణీపై రియల్ టైమ్ సమాచారం అందుతుందని చెప్పారు. జిల్లా స్థాయి అధికారులు, సహకార సంఘాలు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా సమన్వయం చేసుకుంటూ ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నారని వివరించారు.
రైతులకు హామీ – భరోసా
ప్రస్తుతం రాష్ట్రంలో 6.48 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని మంత్రి స్పష్టం చేశారు. రైతులు సాగు కొనసాగించడానికి కావలసినంత ఎరువులు సకాలంలో అందుతాయని హామీ ఇచ్చారు. వర్షాల ప్రభావంతో కొన్నిచోట్ల రవాణా ఆలస్యం జరిగినా, రైతులకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వర్షాల వలన దెబ్బతిన్న ప్రాంతాల్లో పంటలకు ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎరువులు అందిస్తున్నామని చెప్పారు.
మార్కెట్లో కొందరు మధ్యవర్తులు అధిక ధరలకు ఎరువులు అమ్మే ప్రయత్నాలు చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నల్లబియ్యం, అరటి, చెరకు వంటి ప్రత్యేక పంటలకు తగిన ఎరువులు సరఫరా అయ్యేలా ప్రత్యేకంగా పర్యవేక్షణ జరుగుతోందని తెలిపారు. రైతుల సంఘాలు, సహకార సంఘాలు, మార్కెటింగ్ సొసైటీల ద్వారా ఎరువుల సరఫరా వేగంగా జరుగుతోందని వివరించారు. అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం పంట అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. కేంద్రం సహకారంతో రాష్ట్రంలోని ప్రతి రైతుకి ఎరువులు అందేలా కృషి చేస్తున్నామని అని మంత్రి అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు.