– రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
– అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
– నీట మునిగిన 200 ఎకరాల పంట
– సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
– నదిలో చిక్కుకున్న గొర్రెలను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్
హైదరాబాద్: : అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురిసిన వర్షాలు ఉమ్మడి మెదక్ జిల్లాను అతలాకుతలం చేశాయి. సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో అత్యధికంగా 23.5 సెంటిమీటర్ల వర్షం కురిసింది. కుండపోత వర్షానికి గౌరారంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
వర్గల్, ములుగు, గజ్వేల్ ప్రాంతాల్లో చెరువు కుంటలు పొంగి పొరడడంతో వర్షం నీరు రహదారులపై చేరి రాకపోకలకు కొంతసేపు ఇబ్బంది ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని పంటపొలాలు పూర్తిగా నీటమునిగాయి. వాగుల ఉద్ధృతికి పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్
నీట మునిగిన 200 ఎకరాల పంట
దుబ్బాక మండలంలోని కూడవెల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గజ్వేల్ శివారులోని హల్దీ వాగు ఉప్పొంగుతోంది. శివ్వంపేట మండలం పాంబండ వద్ద నిర్మించిన రహదారి కొట్టుకుపోయింది. హల్దీ ప్రాజెక్టు ఉద్ధృతితో కొప్పులపల్లి-హకీంపేట మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ర్సాపూర్ మండలం కాజీపేట గ్రామంలోని మోతుకులకుంటకు భారీగా వరద చేరగా అధికారులు గండికొట్టి నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు.
శివ్వంపేట, నరసాపురం మండలంలో చెరువులు, కుంటలు అలుగులు పోస్తున్నాయి. అల్లాదుర్గంలో బట్టికుంట చెరువు కట్ట తెగడంతో దాదాపు 200 ఎకరాల్లో పంటనీట మునిగింది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దాతర్‌పల్లిలో కట్టు కాల్వ తెగిగ్రామం నుంచి వర్షపునీరు ప్రవహించింది. తూప్రాన్‌లో పలు కాలనీలు జలమయం అయ్యాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వాసర్ వాగులో వరద ఉధృతికి కారు కొట్టుకు పోయింది. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మేడ్చల్ నుంచి గౌడవెళ్లి రోడ్డుపై వాగు ఉద్ధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రి వద్ద వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు ఎవరూ అటు వైపు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. లక్ష్మాపూర్ అలుగు పారి ఉదృతంగా ప్రవహిస్తోంది. పోలీసులు వాగుల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు.
నారాయణపేట జిల్లాలో కురుస్తున్న వర్షాలకి, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండారెడ్డిపల్లి చెరువు మత్తడి పోస్తోంది. జిల్లా కేంద్రంలోని వాగు ఉద్ధృతికి ఊట్కూరు మండలంలోని అమీన్ పూర్, పగిడిమారి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు మంగపేటలోని రోడ్లు, పలు కాలనీలు జలమయమయ్యాయి. మంచిర్యాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జోరువానలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
సురక్షిత ప్రాంతాలకు తరలింపు
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తాయి. ఏజెన్సీ మండలాలు వెంకటాపురం, వాజేడు, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయిలో వర్షాలు దంచికొట్టాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లి సింగరేణి డివిజన్ లోని కాకతీయ ఖని-2, 3 ఉపరితల గనుల్లో ఒక షిఫ్టు నడిచే పరిస్థితి లేక బొగ్గును తరలించే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో బొగత ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
ఏటూరునాగారం-కమలాపూరం మధ్య జీడివాగు ఉద్ధృతి పెరిగింది. పలు చోట్ల ఇళ్లలోకి భారీగా నీరు చేరడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలకు తాడ్వాయిలో మహిళ మృతి చెందింది. వరద బాధిత ప్రాంతాలతో పాటు మేడారంలో జంపన్నవాగు, రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద ఉద్ధృతిని మంత్రి సీతక్క పరిశీలించారు. భారీవర్షాలు కురుస్తున్నందున ప్రజలు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.