*రిజర్వేషన్ల కోసం పవన్ పై ఆశలు పెట్టుకున్న కాపులు
*జనసేన పోటీచేసిన అన్ని సీట్లలో అందుకే గెలుపు
*అయినా కాపుల కోర్కెల దిశగా ఆలోచించని పవన్
*”లాంచింగ్ ప్యాడ్ ” విస్మరిస్తే… మళ్ళీ మొదటికే
*కాపులలో పెరుగుతున్న అసహనం
*ఏ పార్టీ అధికారం లోకి రావాలన్నా కాపుల మద్దతే కీలకం
(భోగాది వేంకట రాయుడు )
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో సంఖ్యా పరం గా దాదాపు యాభై నుంచి డెబ్భయ్ లక్షల మంది వరకు కాపు జనాభా ఉన్నారనేది ఒక అనధికార అంచనా. కొంత మంది అయితే…., ” మా జనాభా ఒక కోటి తెలుసా ” అంటుంటారు.
ఒక్కటి మాత్రం నిజం.
కమ్మ, రెడ్డి, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, వెలమ, మాల, మాదిగ, బీసీ వంటి కుల భావనలలో….. ఏ ఒక్క సమూహనికీ ఇంత జన సంఖ్య లేదు.’ బీ సీ ‘ అనేది ఒకే ఒక కుల భావన కాదు. సుమారు వంద కుల భావనలన్నిటికీ కలిపి కామన్ గా వినియోగించే విశేషణం….’బీసీ’. (అంటే వెనుకబడిన కులాలు అని ).
సమాజానికి అవసరమైన సవాలక్ష వ్యవసాయేతర వృత్తులలోనే అనాదిగా మునిగి ఉండడం తో…. సామాజికం గా పలు వర్గాల వారు వెనుకబడి పోయారు.అందుకని వారిని మన సమాజం ‘బీసీ’ లు అంటున్నది. అయితే ; వారిని అలా పరిగణించే ‘ ముందుకు పడిన ‘ వారందరూ… మానసికమైన బీసీ లే.
‘ కాపు’ కుల భావనలో పుట్టి, పెరుగుతున్న వారిది మాత్రం చిత్రమైన పరిస్థితి. ఆర్ధికం గా చూస్తే…. వెనుకబాటు తనం.అంటే…. బీసీ.
సామాజికం గా చూస్తే….’అగ్రవర్ణం’ అంటూ బిల్డ్ అప్.
” మింగడానికి మెతుకు లేదు… మీసాలకు సంపెంగ నూనె… ” అనే సామెత తరహా మానసిక స్థితి అన్న మాట.
“మా తాతలు నేతులు తాగారు…. తెల్సా”అంటూ ఊళ్ళల్లో గోచీలు బిగించి, పారా… పలుగు భుజం పై వేసుకుని పొలం పనులకు వెడుతుంటారు. పట్టణాల్లో అయితే రోజువారి ఆదాయపు పనిపాటల్లో మునిగి, పొట్ట పోసుకునేవారు.
పౌరుషానికి మాత్రం లోటు లేదు. అందుకే, ” కాపు దర్జా ” అనే నానుడి పుట్టి ఉంటుంది.
ఇంత భారీ సంఖ్యలో జనం ఉన్నప్పటికీ ; ఇతర “అగ్ర వర్ణాల” వారితో ఆర్ధికం గా పోటీ పడగల కాపులు మాత్రం పది శాతానికి మించరని కాపు కుల విశ్లేషకులు చెబుతుంటారు. మిగిలిన వారంతా మధ్య, దిగువ మధ్య తరగతి,చిల్లర వృత్తుల తో జీవనం సాగించే వారేననేది ఒక అధ్యయన సారాంశం.
అందుకే, 2014 ఎన్నికలకు ముందు జరిపిన పాదయాత్రలో చంద్రబాబు నాయుడు…. కాపులపై హామీల పూల వర్షం కురిపించారు. ఈ పూల వర్షం లో కాపులు తడిచి ముద్దయి పోయారు. దీనికి తోడు ; కాపులు – తమ కులస్తుడు గా భావించే సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా ” జగన్ హటావో ” నినాదం తో తెలుగుదేశం అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రం లో సుడిగాలి పర్యటనలు చేయడంతో , మరో మాట అనేది లేకుండా…. తెలుగుదేశం ను 2014 ఎన్నికల్లో కాపులు భుజాలమీద మోసేశారు.
కొత్త రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు తొలి ముఖ్యమంత్రి కావడం లో కాపులు గణనీయమైన పాత్ర పోషించారు . కానీ, ఆ ఎన్నికల ముందునాటి పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీల అమలు విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు చిత్త శుద్ధి ప్రదర్శించలేదనే భావం కాపులలో పెద్ద ఎత్తున వ్యక్తం అయింది.
దీనికి తోడు, చంద్రబాబు నాయుడు పై పెంచుకున్న అకారణ వ్యక్తిగత ద్వేషం తో, ఆయనను ఓడించడానికి ఇదే అదును అన్న భావంతో తో ముద్రగడ పద్మనాభం రంగం లోకి దిగారు.
“కాపు అవతారం ” ఎత్తారు. ఆయన చేపట్టిన కాపు భజన….నిజమనుకున్న కాపు సామాజికవర్గం -గతం లో ఎన్నడూ లేని విధం గా సంఘటితం అయింది. ముద్రగడ ఏ ఉద్దేశం తో కాపు అవతారం ఎత్తినప్పటికీ ; కాపు సామాజిక వర్గాన్ని ఈ స్థాయిలో సంఘటితం చేసిన వారు మరొకరు లేరు.
2019 లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడంతో, కడుపు మంట చల్లారిన ముద్రగడ పద్మనాభం…. కాపు ఉద్యమ అవతారం చాలించారు.
మరో పక్కన, రాజకీయావతారం ఎత్తిన పవన్ కళ్యాణ్… 2019 లో అసెంబ్లీ లో అడుగుబెట్టడానికి విశ్వ ప్రయత్నం చేశారు గానీ, కుదరలేదు. నిజానికి, పెద్ద సంఖ్యలో ఉన్నారు కదా అని కాపులను నమ్ముకునే 2009 లో చిరంజీవి గానీ, 2014 లో పవన్ కళ్యాణ్ గానీ రాజకీయ ప్రవేశం చేశారు. అప్పుడు ఆయనకు 18 సీట్లు వస్తే, 2019 లో ఈయనకు ఒక్క సీటు వచ్చింది.
దానితో, పవన్ కళ్యాణ్ కు తత్వం బోధపడింది. తెలుగుదేశం తో జత కట్టకపోతే….., 2019 ఫలితాలే పునరావృతం అవుతాయానే నిశ్చితాభిప్రాయానికి పవన్ కళ్యాణ్ వచ్చేశారు. ఎందుకంటే ; అసెంబ్లీ లో అడుగుపెట్టడమే ఆయన లక్ష్యం.
తెలుగు దేశం తో పొత్తుకు ఆయన వెళ్లకుండా చూడడానికి, చేగొండి హరిరామ జోగయ్య అనే పాతకాలపు పాలకొల్లు రాజకీయ ఘనాపాఠి తో సహా పలువురు వైసీపీ పేటీఎం వీరులు శత విధాల ప్రయత్నించినా…. పవన్ కళ్యాణ్ తొణక లేదు, బెణక లేదు. 2019 ఎన్నికల నాటి అనుభవం నేర్పిన స్థిత ప్రజ్ఞత అది. అసెంబ్లీ లో అడుగుపెట్టడానికి తెలుగుదేశం పై ఆధారపడక తప్పని స్థితి ఆయనది.
సరేలే…. పవన్ కళ్యాణ్ ను కలుపుకుంటే, కాపుల ఓట్లు మళ్ళీ గంప గుత్త గా పడతాయి కదా అని తెలుగుదేశం అనుకుంటే…. తెలుగు దేశం, కాపుల ఓట్లతో అసెంబ్లీ లో కుడి కాలు పెట్టవచ్చు అని పవన్ భావించారు. పరస్పర ప్రయోజనం గా కనపడింది. ఈ పొత్తు. ఈ కాంబినేషన్ ఇంత సూపర్ హిట్ కావడానికి కూడా జగన్మోహన్ రెడ్డే ప్రధాన కారణం.
పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చేతులు కలపక తప్పని అనివార్యతను కల్పించడానికి జగన్ బృందం రేయింబవళ్ళు అవిరళ కృషి చేసింది. జనానికి కూడా వారి వైపు మళ్లడం తప్ప మరో గతి లేని సామాజిక, ఆర్ధిక, రాజకీయ అరాచక పరిస్థితిని ఈ బృందం సృష్టించింది.
అందుకే, జనం…. ఇక, కూటమి అభ్యర్థి ఎవరా అని చూడలేదు. అందుకే, 175 కు 164 సీట్లు కూటమి ఖాతాలో పడ్డాయి. ఇందుకు, తమ ప్రతిభే కారణం అని నేతలు అనుకుంటే…. అది వారి ఇష్టం.
“తమ ప్రతినిధి” అని కాపులు భావించిన పవన్ కళ్యాణ్….పోటీ చేసిన మొత్తం 21 అసెంబ్లీ సీట్లలో గెలుపొందడం, ఆయన ఏకంగా ఉప ముఖ్యమంత్రి కావడం….క్షణాలలో జరిగిపోయాయి.
2014 లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇప్పుడైనా నెరవేరతాయానే బలమైన భావన కాపులలో ఇప్పుడు చోటు చేసుకున్నది.
మరో పక్క ; కాపు హామీల అమలుకు సంబంధించి, ఇప్పుడు ఏ చిన్న అడుగు ముందుకు వేసినా…. పవన్ కళ్యాణ్ ను చిన్న చూపు చూసినట్టుంటుందేమో అని చంద్రబాబు నాయుడు సందేహిస్తున్నారనే భావం టీడీపీ కాపు నాయకుల్లో కనబడుతున్నది. దానితో, తాము అటూ ఇటూ కాకుండా పోతున్నామనే అసహనానికి కాపులు లోనవుతున్నారు.
కూటమిగా ఏర్పడిన పార్టీలు అధికారం చేపట్టి దాదాపు 15 నెలలు కావస్తున్నది. అయినప్పటికీ ; తమకు గతం లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల అమలు లో అంగుళం పురోగతి కూడా ఏమీ లేదని కాపు సామాజిక వర్గంలో మొదలైన అసహనాన్ని ఎగదోసి, ఓ అగ్గిపుల్ల గీచి….. చలి కాచుకునే ప్రయత్నాలు మరో పక్క మొదలయ్యాయి.
పవన్ కళ్యాణ్ రాజకీయానికి పునాదే కాపులు అనడం లో సందేహం లేదు. ఒక సినిమా నటుడుగా ఆయన ఆంధ్రాలో ఎంత పాపులరో…. తెలంగాణ లో అంతకు మించిన ప్రేక్షకాదరణ కలిగిన నటుడు కదా! నివాసం కూడా హైదరాబాదే కదా! కానీ, తన రాజకీయాన్ని మాత్రం ఆయన ఆంధ్రప్రదేశ్ కు పరిమితం చేసుకున్నారు.
కాపులు ఆంధ్రాలోనే ఉన్నారు గానీ, తెలంగాణ లో లేక పోవడమే ఇందుకు కారణం అనడానికి సందేహం ఏమిటి !? అయినప్పటికీ ; ఆయన కాపు కుల నాయకుడిగా కనపడడానికి ఏమాత్రం సుముఖం గా లేరు. అందుకే, అధికారం చేపట్టిన గత 14-15 నెలల్లో ఒక్కసారి కూడా కాపు సమస్యలపై దృష్టి సారించిన సందర్భాలు కనిపించలేదు. ఆ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలేంటనే విషయమై దృష్టి సారించలేదు. ముఖ్యమంత్రి తో సమీక్షించలేదు.
సనాతన ధర్మ పరిరక్షణకు కాషాయం స్వీకరించినంతగా, తన రాజకీయానికి ఇరుసులా నిలబడిన తమ సామాజిక వర్గ సమస్యల వైపు ఆయన కన్నెత్తి చూడలేదు అనే భావనే కాపులలో వ్యక్తమవుతున్నది.
“కాపులకు ఆయన బాగా దూరంగా జరుగుతున్నట్టు కనబడుతున్నది. పవన్ కళ్యాణ్ వైఖరి ఇలాగే కొనసాగితే, ఆయనకు మద్దతు ఇచ్చే విషయం లో కాపులలో పునరాలోచన తథ్యం…” అని కాపు సంక్షేమ సమితి అధ్యక్షుడు ఆరేటి ప్రకాష్ అన్నారు. దాదాపు రెండు దశాబ్దాలు పైబడి ఆయన కాపు సంక్షేమ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
పవన్ కళ్యాణ్ పై ఆశలు వదిలేసుకున్న కాపులలో కొందరు….. రాజకీయ మంటలు రాజేయడానికి అగ్గిపెట్టె జేబుల్లో పెట్టుకుని తిరగడాన్ని గమనించిన ఆరేటి ప్రకాష్ ; అటువంటి దుందుడుకు చర్యలు కాపు సామాజిక వర్గానికి మరో సారి నష్టం చేస్తాయని హెచ్చ రిస్తున్నారు.
ముద్రగడ పద్మనాభం కాడి పారేయడం, ఇటు పవన్ కళ్యాణ్ కాపు సమస్యల వైపు కన్నెత్తి చూడక పోవడం వల్ల కనబడుతున్న నాయకత్వ గ్యాప్ లో…. ఇప్పుడు, నేతి బీరకాయలు వంటి కొన్ని ” లెటర్ హెడ్ ” కాపు జేఏసీ లు పుట్టుకొచ్చాయి. నెయ్యికి, నేతి బీరకాయలకు సంబంధం లేనట్టు గానే, ఈ లెటర్ హెడ్ కాపు జేఏసీ లకు, కాపు లకు సంబంధం లేదనేది పెద్ద బహిరంగ రహస్యం. ఏదో…. ఈ జీవితానికి ఓ చిన్నపాటి గుర్తింపు. అది చాలు వాళ్లకు. కానీ, వీటి వల్ల న్యూసెన్స్ వాల్యూ మాత్రం తప్పదు…. యూ ట్యూబ్ చానళ్ల పాపమా అని.
సాన సతీష్ జాగత్త్రగా అడుగులేయాలి!
తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఇటీవలి కాలం లో కాపుల అంశాలపై దృష్టి పెట్టినట్టు కనబడుతున్నది. కొంచెం దూకుడుగా వెడదాం అనే కొందరు గోదావరి జిల్లాలకు చెందిన జేఏసీ వ్యక్తుల ఆలోచనలకు సానా సతీష్ “బ్రేకులు ” వేశారు. అంతవరకు బాగానే ఉంది.
కాపు సామాజిక వర్గ ప్రధాన సమస్యల పరిష్కారానికి సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన…. కాకినాడ లో తన కార్యాలయం లో జరిపిన ఒక సమావేశం లో హామీ ఇచ్చారు. ఈ లెటర్ హెడ్ జేఏసీ లను ఎక్కడ ఉంచాలో సానా సతీష్ అక్కడ ఉంచాలి.
తెలుగుదేశం లోని కాపు ప్రజాప్రతినిధులకు రాజకీయ పరమైన ఇబ్బందులు ఉన్న దృష్ట్యా, బహిరంగంగా కాపు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లలేని దుస్థితిలో పడిపోయారు. కావాలంటే… తమ పిల్లల్ని అటువంటి సమావేశాలకు పంపుతామని, చందాలు కావాలంటే ఇస్తామని అంటున్నారు.
ప్రభుత్వం లో చెట్టంత కాపు – పవన్ కళ్యాణ్ ఉండగా…. తాను చొరవ తీసుకుంటే, కాపు సామాజిక వర్గం డిమాండ్లను ఆయనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లడం సముచితం అనే భావన ఈ కాపు ప్రజా ప్రతినిధులలో కనబడుతున్నది. పవన్ కళ్యాణేమో… కాపు నాయకుడి గా కాక ; ఒక పరిణతి చెందిన స్టేట్స్ మన్ లా వ్యవహరించాలని భావిస్తూ…. తన రాజకీయానికి అండగా నిలబడిన కాపు సామాజిక వర్గానికి వీలైనంత దూరంగా జరుగుతున్నారు.
చంద్రబాబు నాయుడు 2015 లో ఏర్పాటు చేసిన ” కాపు కార్పొరేషన్ ” ప్రస్తుత పరిస్థితి , కాపులపై పవన్ కళ్యాణ్ అనాసక్తి కి అద్దం పడుతుంది.
దీనివల్ల ఆయన, ఆయనను దగ్గరికి తీసిన ముఖ్యమంత్రి…. ఇద్దరూ భవిష్యత్ లో రాజకీయం గా నష్టపోయే ప్రమాదం లేకపోలేదని కొందరు హార్డ్ కోర్ టీడీపీ కార్యకర్తలు లోపాయికారిగా వ్యాఖ్యానిస్తున్నారు.
1.పేరుకు అగ్రవర్ణం అనే భావన లో ఉన్నప్పటికీ, తమ ఆర్ధిక వెనుకబాటు తనాన్ని దృష్టిలో పెట్టుకుని, తమ పిల్లలకు విద్యా ఉపాధి అవకాశాల్లో 5%రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని కాపు సమూహం కోరుతున్నది . దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతం లో అంగీకరించారు. శాసన సభలో తీర్మానం ఆమోదింప చేశారు. జీ. ఓ. కూడా జారీ చేయించారు . అది అమలులోకి రాలేదు. పవన్ కళ్యాణ్ దీనిపై నోరెత్తలేదు.
2.ఆర్థికం గా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజెర్వేషన్లు కల్పిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఏకం గా రాజ్యాంగ సవరణే చేసింది. ఈ పది శాతం లో సగం – అంటే, యాభై శాతం కాపులకు కేటాయిస్తూ చంద్రబాబు నాయుడు గతం లోనే జీ ఓ జారీ చేయించారు. జగన్ ఆ జీ ఓ ను ఆపు చేయించారు. ఇప్పుడు దాని అమలుకు అడ్డంకి ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ దీనిపై మాట్టాడలేదు.
3.ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకం గా చేపట్టిన -పీ 4 -పథకం లో పది శాతం లబ్ది దారులను తమ నుంచి ఎంపిక చేయాలని కాపులు కోరుతున్నారు. నిజానికి, దీనికి ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన పని లేదు. దీనిపై కూడా పవన్ మౌనం గా ఉంటున్నారు.
ఒక విషయం మాత్రం సుస్పష్టం అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
కాపుల మద్ధతు లేకుండా ఏ రాజకీయ పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్ లో అధికారం లోకి రాలేదు. తెలుగు దేశం అయినా, జగన్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, పూర్వ కాలం లో కాంగ్రెస్ అయినా.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో…. కాపులు ఏకపక్షం గా కూటమి కి మద్దతు తెలిపారు.
వారి ఓటు బ్యాంకు ను అదే స్థాయిలో కాపాడుకోవడానికి పవన్ కళ్యాణ్., చంద్రబాబు చేయగలిగినదంతా …చేయాలి. 2024 లో లభించిన “జగన్ వ్యతిరేక ” ఓట్ ను 2029 లో “కూటమి అనుకూల” ఓట్ గా మార్చి, విజయం సాధించాడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏమి చేస్తారో చూడాలని ఏపీ ఓటర్లు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
చివరగా, ఈ ఇద్దరి నేతలకూ ఓ సూచన. రాజకీయాలలో ఇంత ఎత్తుకు ఎగరడానికి ఉపకరించిన “లాంచింగ్ ప్యాడ్ ” లను చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా విస్మరించగూడదు.
బంగారాన్ని… బంగారమే అని నిరూపించడానికి చాలా పరీక్షలు చేస్తారు.
కానీ, బొగ్గును బొగ్గు అని చెప్పడానికి ఏ రకమైన పరీక్షలూ అవసరం లేదు. చూడగానే, తెలిసిపోతుంది అది బొగ్గు అని. తెలిసిపోయింది కూడా.
అందుకే, తాము నిర్వహిస్తున్న పదవులకు అర్హులమని జనం భావించేవిధం గా వీరు ముందుకు వెళ్ళాలి.
(రచయిత… జర్నలిజం లో ఏపీ ప్రభుత్వపు ‘కళారత్న’ అవార్డ్ గ్రహీత)