– ప్రజల కోసమే పని చేశాం… అందుకే సుదీర్ఘ రాజకీయం చేస్తున్నాం
– సంస్కరణలకు భయపడితే సంక్షేమం అందించలేం
– గతాన్ని గుర్తుంచుకోవాలి… భవిష్యత్తుకు ప్రణాళికలు వేయాలి
– అప్పుడు… ఇప్పుడు… ఎప్పుడూ లా అండ్ ఆర్డరే టాప్ ప్రయార్టీ
– జాతీయ స్థాయిలో పాలసీల్లో ఆలోచనలు పంచుకోవడం గర్వకారణం
– ముఖ్యమంత్రి చంద్రబాబు
– తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా చంద్రబాబుకు మంత్రులు, నేతలు, అధికారుల అభినంనదలు
– 30 ఏళ్ల అనుభవాలను పంచుకున్న చంద్రబాబు
అమరావతి : ప్రతినిత్యం కొత్తగా ఆలోచనలు చేయాలనేది తన విధానమని… ఇదే తన సక్సెస్ ఫార్ములా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం రాజంపేట పర్యటన ముగించుకుని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబును మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు కలిశారు. సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు పూర్తి కావడంతో చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి వారితో కాసేపు భేటీ అయ్యారు. 30 ఏళ్ల కాలంలో నాలుగు సార్లు సీఎంగా తాను తీసుకున్న నిర్ణయాలు… పాలనా అంశాలు, అమలు చేసిన పథకాలు, చేపట్టిన కార్యక్రమాలపై అనుభవాలను చంద్రబాబు పంచుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… “గతాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి… ఆ స్ఫూర్తితో భవిష్యత్ కు ప్రణాళికలు రచించాలి. గతంలో సక్సెస్ అయిన పాలసీలను స్టడీ చేయాలి… నేటి అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలి. అధికారులైనా, ప్రజా ప్రతినిధులు అయినా ఒక తపనతో పని చేస్తేనే ఫలితాలు వస్తాయి. కొత్తగా ఆలోచిస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయి.
నా రాజకీయ జీవితంలో అదొక విధానంగా పెట్టుకున్నా. ఇదే నా విజయ రహస్యం. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు అనేక సవాళ్లు వచ్చాయి. వాటిని ఎదుర్కోని ధృఢ నిర్ణయాలతో పాలన సాగించాం. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రాంతంలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. విద్యా రంగంలో అనేక మార్పులు తెచ్చాం. రంగారెడ్డి జిల్లాలో 10 హైస్కూళ్లు కూడా ఉండేవి కాదు. అలాంటి చోట 240 ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చాం.
నాడు రంగారెడ్డి అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉండేది. అలాంటి జిల్లా అనంతర కాలంలో రిచ్చెస్ట్ ప్రాంతంగా మారింది. నాడు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భూములు ఇస్తామంటే కంపెనీలు ముందుకు వచ్చేవి కావు. తరువాత వారిని ఒప్పించి మౌళిక సదుపాయాలు కల్పించి సంస్థలను ఏర్పాటు చేశాం. హైటెక్స్, నాక్ వంటి సంస్థలు తెచ్చాం.. నాడు తెచ్చిన హైటెక్స్ దేశంలోనే పెద్ద కన్వెన్షన్ సెంటర్ గా నిలిచింది.” అని చంద్రబాబు చెప్పారు.
మంచి చేయడానికి ఆలోచన ఎందుకు..?
“కొన్ని నిర్ణయాలను ఉద్యోగ, కార్మిక సంఘాలు వ్యతిరేకించేవి. ప్రజలకు మంచి జరుగుతుందనుకుంటే… భయపడేవాడిని కాదు. విమర్శలకు భయపడి సంస్కరణలకు దూరంగా ఉండకూడదు. భయపడితే అక్కడే ఆగిపోతాం… ప్రజలకూ మంచి చేయలేం. సంస్కరణలు అనుకుంటే అమలు చేసేసేవాళ్లం. ప్రజల మంచి కోసం నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే… దేనికీ ఆలోచించే వాళ్లం కాదు. మొదట్లో విమర్శించిన వాళ్లే… ఆ తర్వాత కాలంలో ఆ నిర్ణయాలు… ఆ సంస్కరణల్లో విషయముందని మెచ్చుకున్నారు. శాంతి భద్రతల విషయంలో అత్యంత కఠినంగా ఉండేవాడిని. నాడు సీమలోగాని, హైదరాబాద్ సీటీలో మార్పు తెచ్చాం.
తెలంగాణ ప్రాంతంలో నక్సలిజం సమస్య తీవ్రంగా ఉండేది. నాయకులు ఊళ్లలో ఉండలేక హైదరాబాద్ వచ్చేసేవాళ్లు. ఎప్పుడోగాని భద్రతతో గాని గ్రామాలకు వెళ్లే వాళ్లు కాదు. అధికారుల్లో నైతిక స్థైర్యం పెంచడానికి స్వయంగా నకల్స్ ప్రాంతానికి వెళ్లే వాడిని. దీంతో అధికారులు సాకులు చెప్పడం తగ్గించి ధైర్యంగా పని చేశారు. రాయలసీమలో విపరీతమైన ఫ్యాక్షన్ ఉండేది. ఇళ్లల్లో మహిళలు, పిల్లలపైనా ఆ ఫ్యాక్షన్ ప్రభావం ఉండేది. హత్యకు హత్య అనే విధంగా నాడు కొందరు ఉండేవాళ్లు. దాన్ని కంట్రోల్లో పెట్టాం.
ఫ్యాక్షన్ అంతం చేశాం. హైదరాబాద్ నగరంలో మత కలహాలు కొనసాగితే పెట్టుబడులు రావని ఆలోచించాం. అందుకే మత ఘర్షణలపై ఆ వర్గం ఈ వర్గం అని లేకుండా చాలా కఠినంగా ఉన్నాం. సమర్థులైన అధికారులను చార్మినార్ సహా సున్నితమైన ప్రాంతాల్లో విధుల్లో వేసేవాడిని.. ఫుల్ పవర్స్ ఇచ్చేవాడిని. దీంతో జంట నగరాల్లో మత కలహాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలకే హై ప్రయార్టీ ఇస్తున్నాం.” అని సీఎం స్పష్టం చేశారు.
ఓట్ల కోసం ఏనాడూ ఆలోచన చేయలేదు
”జాతీయ స్థాయిలో మంచి పేరున్న వాళ్లను, ప్రముఖులను తెచ్చి ప్రజల్లో చైతన్యం తెచ్చేవాళ్లం. వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ వంటి వాళ్లను తీసుకువచ్చి ప్రచారం చేయించాం. కార్యక్రమాలు చేపట్టాం. ఇంకుడు గుంతలు వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవాళ్లం.. ఇది ఎంతో మంచి ఫలితాన్ని ఇచ్చింది. అనంతరపురం జిల్లాలో 10 ఏళ్లలో 8 ఏళ్లు కరవు ఉండేది. రైతులు నష్టపోయే వాళ్లు. దీంతో నాడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పెట్టాం.. తొలిసారి ఈ విధానం తెచ్చింది మనమే.
మహిళా శక్తిని సమర్థంగా వినియోగించుకోవాలని గొప్ప సంకల్పంతో పని చేశాం. నాడు విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో ఆడబిడ్డలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. అందుకే మహిళా సాధికారతలో అనేక మార్పులు వచ్చాయి. డ్వాక్రా సంఘాలు తెచ్చిన సమయంలో కూడా విమర్శలు చేశారు.. వ్యతిరేకించారు. కానీ వాటి ఫలితాలు చూస్తున్నాం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల శ్రేయస్సు కోసమే పని చేశాం కాబట్టే.. ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నాం. విపత్తులు వచ్చినప్పుడు నేను తీవ్రంగా స్పందిస్తా. అన్నీ కోల్పోయి తీవ్ర నిస్పృహలో ఉండే వారికి సాయంగా నిలవాలి. అదే నిజమైన ప్రజాసేవ.
ఉత్తరాఖండ్ వరదల సమయంలో ప్రతిపక్షంలో ఉండి కూడా పని చేశాం. ప్రత్యేక విమానాలు, ప్రత్యేక కార్లు పెట్టి వారిని ఇళ్లకు పంపాను. రాజకీయంగా ఓట్లు రావచ్చు.. రాకపోవచ్చు.. కానీ అలాంటి సమయంలో సేవ చేశా అనే తృప్తి మిగులుతుంది. అంత పెద్ద విపత్తు నుంచి మనం వారిని బయటకు తెచ్చాం.. ఇలాంటివి సంతృప్తినిస్తాయి.” అని ముఖ్యమంత్రి వివరించారు.
సంకల్ప బలమంటే ఏంటో పుట్టపర్తి సత్యసాయి బాబా దగ్గర చూశా
”ఒక రోజు పుట్టపర్తి సత్యసాయి బాబా నన్ను పిలిచారు. ఆయన అందరినీ బంగారు అని పిలుస్తాడు.. నన్ను అలాగే పిలిచేవాడు. పుట్టపర్తి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న తాగు నీటి సమస్య గురించి మాట్లాడారు. తాగునీటి సమస్య పరిష్కారానికి నేను ప్రాజెక్టులు చేపడతాను.. ప్రభుత్వం వాటిని నిర్వహణ బాధ్యత చూడాలి అని అన్నారు. నేను సరే అన్నాను. వాస్తవంగా అప్పుడు ఆయన దగ్గర అంత మొత్తంలో డబ్బు లేదు. కానీ సంకల్పం ఉంది. భక్తులను స్పందించమని కోరారు. లేదంటే నా ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టి అయినా తాగునీటి ప్రాజెక్టులు చేపడతా అన్నారు.
దీంతో పెద్దఎత్తున నిధులు రావడంతో పనులు చేశారు. ఇదీ సంకల్పానికి ఉన్న గొప్పదనం. ఆయన తరువాత కాలంలో మెదక్, మహబూబ్ నగర్ లో కూడా తాగునీటి పథకాలు చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కుల వృత్తులకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవాళ్లం. ఆదరణ వంటి పథకంతో వారికి ఎంతో చేయూతను ఇచ్చాం. అయితే నేడు కుల వృత్తుల్లో మార్పులు వచ్చాయి. వాటికి అనుగుణంగా మనం ఆయా వర్గాల వారికి చేయూతను ఇవ్వాలి. మార్పునకు అనుగుణంగా కుల వృత్తుల్లో, సేవల్లో మార్పులు తేవాలి. అప్పుడే వారి ఆదాయం పెరుగుతుంది.
ఏ విషయమైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు తపనతో పని చేయండి. అప్పుడు మార్పు తేవడం సాధ్యమే. అధికారులు వినూత్నంగా ఆలోచన చెయ్యాలి.. రోటీనుకు భిన్నంగా పని చేస్తేనే ఫలితాలు వస్తాయి. జాతీయ స్థాయి పాలసీలో ఆలోచనలు పంచుకోవడం గర్వకారణం.” అని చంద్రబాబు చెప్పారు.