(ఇది ప్రముఖ సీనియర్ పాత్రికేయులు జె వి లక్ష్మణరావు టీచర్స్ డే సందర్భంగా రాసిన స్వీయ అనుభవం.. గొప్ప హ్యూమన్ టచ్ ఉన్న కథనం.అందుకే స్వేచ్చానువాదం చేసాను. ఆయన మాటల్లోనే చదవండి.)
అప్పటికి నాకు అయిదేళ్లు ఉంటాయి. మా నాన్నగారు నన్ను ఒక వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకు నన్ను అప్పగించారు. ఆ పెద్దాయన నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాచేత పలక మీద అ..ఆలు రాయించారు. అప్పుడు అదంతా ఏంటో నాకు తెలియదు గాని అది నాకు అక్షరాభ్యాసం అన్నమాట.
ఆ మాస్టారి పేరు నాకింకా గుర్తే.. శామ్యూల్ సార్. ఆయన రాజమండ్రి చిన్నబజార్లోని దానవాయిపేట నేషనల్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్. అలా ఆ సుమూర్తాన మొదలైన నా ప్రయాణం.. శామ్యూల్ సార్ హస్తవాసి చలవతో అంచెలంచెలుగా అమెరికాలో ఉన్నతస్థాయి జర్నలిస్టుగా ఎదిగే స్థాయి వరకు సాగింది.
ఈ ప్రయాణంలో నేను ఏ దశలోనూ శామ్యూల్ సార్ను మర్చిపోలేదు. 1956 లో ఇంటర్ పూర్తి చేసిన వెంటనే నాకు మొదటగా ట్రైనీ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గా ఉద్యోగం వచ్చింది. తొలి పోస్టింగ్ మహారాష్ట్రలోని భుసవాయి.
నా మొదటి జీతం 151 రూపాయలు అందుకున్న రోజున నా మదిలో మొదటగా మెదిలింది నా జీవిత తొలి గురువు మా అమ్మ. ఆమెకు చీర కొని నా బట్టల అలమరలో భద్రంగా దాచి నా పనిలోకి వెళ్లేవాడిని. అమ్మ కడుపులో తొమ్మిది నెలలు ఉన్నాననో ఏమో, అమ్మకి చీర కొన్న తొమ్మిది నెలల తరువాతే నాకు మొదటిసారిగా సెలవు దొరికింది.
రెక్కలు కట్టుకుని రాజమండ్రి వచ్చి అమ్మ దగ్గర వాలిపోయాను. ఎంతో అపురూపంగా పెట్టెలో దాచిన చీర తీసి గర్వంగా అమ్మ చేతిలో పెట్టాను. అయితే నాకు ఆశ్చర్యం కలిగేలా అమ్మ ఆ చీర తీసుకోలేదు. అప్పుడు అమ్మ ఏమందో తెలుసా..ఒరేయ్ ముందు సామ్యూల్ మాస్టారి ఇంటికి వెళ్ళి నీ మొదటి జీతంతో ఆయనకి గురుదక్షిణ ఇచ్చిరారా అంది. మా నాన్నగారు కూడా అలాగే చెయ్యమన్నారు.
వెంటనే నేను పరుగున స్కూలుకి వెళ్ళి మాస్టారి గురించి వాకబు చేసాను. ఆయన అప్పటికే రిటైర్ అయ్యారు. అయితే అదృష్టవశాత్తు అక్కడి సిబ్బంది మాస్టారి ఇంటి అడ్రస్ ఇచ్చారు.
పూరి గుడిసె..వసారాలో నులక మంచం..కూర్చుని ఉన్నారు శామ్యూల్ మాస్టారు.
నన్ను..నాలాంటి ఎందరో విద్యార్ధులను సొంత పిల్లల్లా ప్రేమించి విద్యాబుద్ధులు నేర్పిన సరస్వతీ స్వరూపులు.
మాస్టారు నన్ను చూడగానే గుర్తు పట్టారు. ఎలా ఉన్నావురా లక్ష్మణా అని ఆప్యాయంగా పలకరించారు.
నేను మొదటగా మాస్టారి కాళ్ళకి మొక్కి ఆయన కోసం కొన్న వెండి గ్లాసుని అబ్బురంగా చేతిలో పెట్టాను..అది చూసి మాస్టారి కళ్ళు చెమ్మగిల్లాయి. నాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కాసేపు మాస్టారితో గడిపి ఇక సెలవని చెప్పగానే పెద్దాయన మంచంపై నుంచి లేచి నన్ను దగ్గరికి తీసుకుని.. ఇంకా ఇంకా ఎదగాలిరా నువ్వు అని దీవించారు.
తర్వాతి రోజుల్లో ఎన్నో చదివినా.. ఎంతో జీవితాన్ని చూసినా.. సగం ప్రపంచాన్ని చుట్టేసినా ఆ అక్షణంలో అనుభవించిన సంతృప్తి ఓ గొప్ప అనుభూతిగా ఇప్పటికీ నా హృదయంలో అలా పచ్చిగా మిగిలిపోయింది.
ఇప్పుడిక నా జీవిత గురువులు అమ్మానాన్నల గురించి..
మాస్టారి దగ్గర వీడ్కోలు తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత చీరను అమ్మ చేతిలో పెట్టాను. అమ్మ ఆ చీరను తీసుకుంది గాని ఒరేయ్.. చిన్నప్పుడు నీకు అన్నీ నేర్పిన మీ పెద్దక్కకి ఇచ్చేస్తారా ఈ చీరని అంది. అయినా మీ నాన్న ఉండగా నాకేంటిరా..
నాకు ఏం కావాలో అన్నీ ఆయనే చూసుకుంటారు అంది అమ్మ తృప్తి నిండిన కళ్ళతో నాన్న వైపు ప్రేమగా చూస్తూ..
ఆ క్షణాన నాన్న మొహంలో ప్రపంచాన్ని గెలిచినంత గర్వం తొణికిసలాడింది. అప్పుడు అమ్మలో పరిపూర్ణ స్త్రీ మూర్తిని చూసాను.
రెండేళ్ల తర్వాత నాకు సికింద్రాబాద్బదిలీ అయింది. అప్పుడు అమ్మానాన్నల్ని కూడా నా దగ్గరికి తెచ్చుకున్నాను. మేము ముగ్గురం కలిసి ఒక అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. కొంతకాలం గడిచాక హౌసింగ్ బోర్డులోని ఒక ఇంటి గురించి నేను బ్యాంక్ రుణం కోసం దరఖాస్తు చేద్దామని అనుకుంటుండగా,
మా నాన్నగారు నా చేతిలో కొంత డబ్బు పెట్టారు.
ఇదెక్కడిది నాన్నా అని అడిగినపుడు ఆయన చెప్పిన సమాధానం నన్ను అమితాశ్చర్యానికి గురి చేసింది..ఒరేయ్ నాన్నా.. నువ్వు మహారాష్ట్రలో ఉన్నంత కాలం ప్రతి నెలా నాకు కొంత పైకం పంపుతూ ఉండేవాడివి కదా..ఆ డబ్బులు నేను వాడకుండా పోస్టాఫీసు పొదుపు ఖాతాలో వేసాను. వడ్డీతో కలిపి అదే ఇపుడు నీకు ఇస్తున్నానని చెప్పారు నాన్న.
ఇది నీ డబ్బే..తీసుకో అని చేతిలో పెట్టారు. ఆ క్షణంలో నాకు నాన్నలో గొప్ప గురువు కనిపించారు.కొద్దికాలంలోనే మేము కొత్త ఇంట్లోకి చేరాము.
నా జీవితంలో ఎప్పుడూ అమ్మని నాన్నని అలక్ష్యం చెయ్యలేదు.జన్మని ఇవ్వటమే గాక విద్యాబుద్ధులు నేర్పించి ఎన్నెన్నో జీవిత పాఠాలు బోధించిన గొప్ప గురువులు వాళ్ళు.
ఇలా జీవితంలో తొలి అక్షరాలు దిద్దించిన గురువును.. ఎన్నో జీవిత పాఠాలు నేర్పిన నా తల్లిదండ్రులను ఉపాధ్యాయ దినోత్సవం నాడు తలచుకుంటూ నివాళి అర్పిస్తున్నాను.
(లక్ష్మణరావు నాకు జర్నలిస్టుగా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో తొలి అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. జర్నలిజంలో ఆయన నా తొలిగురువు..ఎనభై ఏడేళ్ళ వయసులో కూడా నిత్యం ఏదో ఒకటి రాస్తూ మాలాంటి ఎందరిలోనో స్ఫూర్తి నింపే ఆ పాత్రికేయ కురువృద్ధుడికి ఈ చిన్న అనువాద ప్రయత్నం నా చిరు గురుదక్షిణ)
(ఎలిశెట్టి సురేష్ కుమార్)
విజయనగరం
9948546286
7995666286