•సూపర్ సిక్స్ హామీలను అన్నింటినీ సూపర్ హిట్ గా అమలు చేస్తున్నాం
•అనంతపురంలో నిర్వహించిన “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” సభ విజయవంతం
•ప్రతి పక్ష పార్టీ అక్కసుతో చేస్తున్న విమర్శలు, రాస్తున్న కథనాల్లో ఏమాత్రం నిజం లేదు
– రాష్ట సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
అమరావతి: ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అన్నింటినీ అధికారంలోకి వచ్చిన 16 మాసాల కాల వ్యవధిలోనే సూపర్ హిట్ గా కూటమి ప్రభుత్వం అమలు చేసిందని, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. బుధవారం అనంతపురంలో నిర్వహించిన “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” సభ విజయవంతం అవ్వడమే కాకుండా సభా ప్రాంగణాన్ని దాటిపోయి దాదాపు 12 కి.మి. వరకు ప్రజలు బారులు తీరి నిల్చుండిపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. అత్యల్ప కావలవ్యవధిలోనే తమ కూటమి ప్రభుత్వం మోగించే విజయదుందుభిని తట్టుకోలేక ప్రధాన ప్రతిపక్ష నాయకులు అక్కస్సుతో చేసే విమర్శలలో ఏమాత్రం నిజం లేదని ఆయన తెలిపారు.
రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో గురువారం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న వయస్సును, అనుభవాన్ని గౌరవించకపోగా, వారిపై శాపనార్థాలు పెట్టే విధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకులు మాట్లాడటం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు పర్చకపోగా, అన్ని వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేయడమే కాకుండా రాష్ట్రం అప్పుల ఊబిలో దింపారని విమర్శించారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దడంలోనే నాలుగైదు మాసాలు గడిచిపోయాయని, మిగిలిన ఏడాది కాలంలోనే తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నింటినీ విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
తమ ప్రభుత్వం ఏ ఒక్క పింఛన్ ను తొలగించలేదని, గతంలో ఉన్న పింఛన్లనే కొనసాగించిందన్నారు. పింఛన్ల రూపేణా గత ప్రభుత్వం మాసానికి రూ.1400 కోట్లు వెచ్చిస్తే తమ ప్రభుత్వం రూ.2,746 కోట్లను వెచ్చిస్తున్నట్టు తెలిపారు. పింఛన్లు పొందుతూ భర్తను కోల్పోయిన వితంతువులకు వితంతు పింఛన్లు తమ ప్రభుత్వం మంజూరు చేస్తోందన్నారు. రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు రూ.13 వేలు ఇస్తామన్న గత ప్రభుత్వం కేవలం రూ.7 వేలు మాత్రమే ఇచ్చిందన్నారు. అయితే తమ ప్రభుత్వం అన్నదాతా సుఖీభవ పథకం కింద ఏడాదికి మూడు విడతల్లో రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని చెప్పి తొలి విడత సొమ్మును దాదాపు 47 లక్షల మంది రైతుల ఖాతాలకు జమ చేసిందని తెలిపారు