– తెలంగాణ భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి
– హైకోర్టు తీర్పు స్పష్టంగా చెప్పింది
– టీజీపీఎస్సీ నిర్లక్ష్యం, పక్షపాతం, అక్రమాలు.
– పరీక్ష మొత్తాన్ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి
– ప్రభుత్వమే అన్యాయం చేస్తే యువతకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది
– ఎమ్మెల్సీ డా శ్రవణ్ దాసోజు
ఇటీవల హైకోర్టు వెలువరించిన 220 పేజీల తీర్పు తెలంగాణ యువతకు న్యాయం చేసిన తీర్పుగా అభివర్ణించారు. ఈ పరీక్ష కేవలం మార్కుల గురించి కాదు. ఇది యువత భవిష్యత్తు, న్యాయం, విశ్వాసం గురించి. ప్రభుత్వమే అన్యాయం చేస్తే యువతకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది?” అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
హైకోర్టు పారా 369, పేజీ 182లో గ్రూప్-1 మైన్స్ పరీక్ష నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికత పాటించలేదని పేర్కొంది. పారా 370, పేజీ 183లో టీజీపీఎస్సీ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగ యువత నష్టపోయారని వ్యాఖ్యానించింది. పారా 371, పేజీ 183లో రెండుసార్లు పరీక్ష రద్దయినా కమిషన్ పాఠం నేర్చుకోలేదని తేల్చింది.
రెండు హాల్ టికెట్లు జారీ చేసి ఆడిట్ ట్రైల్ చెడగొట్టడం, అటెండెన్స్ డేటాలో గందరగోళం (21,075 / 21,085 / 20,161 అని వేర్వేరు సంఖ్యలు చూపించడం), కొన్ని సెంటర్లలో 35 మంది ఎంపిక అవ్వగా మరికొన్ని సెంటర్లలో కేవలం 5 మాత్రమే ఎంపిక కావడం, వరుస అభ్యర్థులకు ఒకే మార్కులు రావడం (1,369 కేసులు), ఇంగ్లీష్ క్వాలిఫైయర్ నియమాన్ని ఉల్లంఘించి ఫెయిల్ అయిన వారిని మెరిట్ లిస్టులో పెట్టడం వంటి అక్రమాలను కోర్టు గుర్తించింది.
అనుభవం లేని రిటైర్డ్ ఫ్యాకల్టీ, కోచింగ్ ట్యూటర్లు మూల్యాంకనలో పెట్టడం, 1.26 లక్షల స్క్రిప్టులు 90 రోజుల్లో, ఒక్కో పేపర్ 2–3 నిమిషాల్లోనే చెక్ చేయడం, మోడరేషన్ లేకుండా మూల్యాంకనం జరగడం, తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరగడం (తెలుగు మీడియం 8,694లో 56 మాత్రమే క్వాలిఫై – 0.64%; ఇంగ్లీష్ మీడియం 12,381లో 506 – 4.1%), డబుల్/ట్రిపుల్ వాల్యుయేషన్‌కు స్పష్టమైన నియమాలు లేకపోవడం వంటి అంశాలను కూడా హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ అన్యాయాల వల్ల నిజమైన అభ్యర్థుల నమ్మకం దెబ్బతిందని, తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, కోచింగ్ మాఫియాలు, ప్రభావవంతులకే లాభమని, మెరిట్‌తో పాటు సామాజిక న్యాయం కూడా పణంగా పెట్టబడ్డాయని దాసోజు శ్రవణ్ అన్నారు.
టీజీపీఎస్సీపై న్యాయపరమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం వ్రిట్ అప్పీల్ దాఖలు చేయకూడదని, గ్రూప్-1 పరీక్ష మొత్తాన్ని రద్దు చేసి UPSC తరహా రక్షణ చర్యలతో మళ్లీ నిర్వహించాలని, జీఓ 29 రద్దు చేసి జీఓ 55 పునరుద్ధరించాలని, విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
“ముఖ్యమంత్రి, మీ ముందున్న రెండు మార్గాలు – ఒకటి: టీజీపీఎస్సీని కాపాడుతూ అక్రమాలను కొనసాగించడం. రెండోది: తెలంగాణ యువతతో నిలబడి వారి భవిష్యత్తును కాపాడడం. మీరు ఏది ఎంచుకుంటారు?” అని ప్రశ్నించారు దాసోజు శ్రవణ్.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, బీఆర్ఎస్వి ఉపాధ్యక్షులు తుంగ బాలు, కడారి స్వామి యాదవ్, కొడంగల్ బీఆర్ఎస్ నేత మహిపాల్ పాల్గొన్నారు.