– రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్
అమరావతి: గత ఐదేళ్లలో అన్ని రంగాల్లో నష్టపోయిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గ నిర్దేశకత్వంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళే ఇందుకు ఈ కూటమి ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ చెప్పారు. సచివాలయంలో సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో మంత్రి ప్రారంభోపన్యాసం చేశారు.
ఏపీ బ్రాండ్ ను తిరిగి తీసుకువచ్చేందుకు సీఎం కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. సూపర్ హామీలు ఇచ్చి సూపర్ 12 అమలు చేశామని గుర్తు చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు సమ ప్రాధాన్యం ఇచ్చి అన్ని పధకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్టు మంత్రి సత్య ప్రసాద్ స్పష్టం చేశారు. జిల్లాల్లో కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రతినిధులని ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలను పబ్లిక్ గ్రీవియోన్స్ రిడ్రస్సల్ సిస్టం ద్వారా సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రెవెన్యూ శాఖలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చామన్నారు.
తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాలను అందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ప్రజల ఆస్తుల పరిరక్షణకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కుడా రద్దు చేశామన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు జరగకుండా నివారించేందుకు శాఖలో అనేక మార్పులు తీసుకు వచ్చామని తెలిపారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములను పటిష్టంగా క్రమబద్ధీకరణ చేసినట్టు చెప్పారు. అన్ని రెవెన్యూ రికార్డులు డిజిటలైజేషన్ చేయడం ద్వారా ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నామన్నారు.రెవెన్యూ అప్పీళ్ళ సత్వర పరిష్కారానికి ఇ-కోర్టులను ఏర్పాటు చేశామన్నారు.
ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు అయ్యేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని మంత్రి సత్య ప్రసాద్ స్పష్టం చేశారు. చివరగా ఇటీవల నేపాల్లో చిక్కున్న ఏపీ వాసులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్, ఇతర మంత్రులు, కేంద్ర ప్రభుత్వానికి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ సవాళ్ళను అధిగమిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళేందుకు కృషి జరుగుతోందన్నారు. పరిశ్రమలు, ఇంధన రంగాల్లో అనేక సంస్కరణలు తీసుకు వచ్చామని తెలిపారు. పీజీఆర్ ఎస్ విధానం ద్వారా ప్రజలకు సంబంధించిన సమస్యల్ని 90 శాతానికి పైగా పరిష్కరించడం జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో సుస్థిరాభివృద్ధికి, అందరికీ సామాజిక న్యాయం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతకు ముందు సీసీఎల్ఏ జయలక్ష్మి సమావేశానికి స్వాగతం పలికారు