‘రెండు కోహినూర్ కథలు’ పేరుతో సాక్షిలో జనతంత్రం కాలమ్ లో వర్ధెల్లి మురళి రాసిన వ్యాసం ‘చదువులేని పాత్రికేయం అంటే ఇదేనా?’ లేదా ‘పాత్రికేయానికి చదువు లేకపోవడం అంటే ఇదేనా?’ అన్న మౌలికమైన ప్రశ్నలతో పాటు ‘హానికరమైన పాత్రికేయం అంటే కూడా ఇదేనా?’ అన్న ప్రశ్ననూ ఉత్పన్నం చేస్తోంది.
వ్యాసాన్ని పరికిద్దాం…
వ్యాసంలోని ప్రధాన విషయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని విమర్శించడం… అది సాక్షికి రాజకీయ అవసరం, సాక్షి నుంచి జీతం తీసుకుంటున్న వర్ధెల్లి మురళి ఆ పని చెయ్యాల్సిందే. ఆ తరువాతది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు విషయం. నిజానికి ఆ ప్రసక్తి కూడా సాక్షికి రాజకీయ అవసరమే. పవన్ కళ్యాణ్ కూడా సాక్షి విమర్శలకు గురికావాల్సిందే.
మనం రాజకీయాల్ని వదిలేసి సరైన ‘చదువు’ లేని పాత్రికేయ పేలాపన ఎలా ఉంటుందో చూద్దాం…
1. “అశోకుడు చెట్లు నాటించెను, బాటలు వేయించెను, బావులు తవ్వించెను అనే పాఠం చదవకుండా ఎవరైనా ప్రాథమిక విద్యను పూర్తి చేస్తారా?” అని వర్ధెల్లి మురళి అత్యంత సాహసంతో అబ్బురపడాల్సిన రీతిలో ఒక ప్రశ్నను సూటిగా సంధించారు.
– అశోకుడు చెట్లు నాటించడం, బాటలు వెయ్యడం, బావులు తవ్వించడం… ఇవి బడి పిల్లల పాఠ్యపుస్తకంలో చెప్పబడ్డ పిచ్చి మాటలు. అశోకుడికి ముందు మనదేశంలో చెట్లు, బాటలు, బావులు లేవా? అసలు అశోకుడు ఒక్కడే అప్పట్లో రాజా? అశోకుడి కాలంలో అతడి రాజ్యానికి పక్కన ఎన్ని రాజ్యాలు ఉండేవో ‘చదువు’ ఉండుంటే మురళి చెప్పగలిగే వారు; ఆయన బడిపిల్లల స్థాయిని దాటి ఎదగాల్సిన అవసరం ఉందని ఈ మాటలు చదివిన మనలాంటి వాళ్లకు అనిపిస్తుంది. ఆయనకూ అనిపించాల్సిన అవసరం ఉందేమో?
2. “…ఆరొందల సంవత్సరాల ట్రావెలాగ్ కోహినూర్ది…” అని తన అనితరసాధ్యమైన చదువును చాటుకున్నారు వ్యాస రచయిత.
– ట్రావెల్ అంటే ప్రయాణం. ట్రావెలాగ్ అంటే ‘a film, book, or illustrated lecture about the places visited by or experiences of a traveller’ అని మనలాంటి మామూలు వాళ్లకు తెలిసిన అర్థం. ఈ వర్ధెల్లి ఒక విద్యాధికుడైన సీనియర్ పాత్రికేయుడుగా కోహినూర్ వజ్రానిది ఆరొందల సంవత్సరాల ట్రావెలాగ్ అంటున్నారు. హతవిధీ… కోహినూర్ది ఆరొందల సంవత్సరాల ట్రావెల్ కదా? ట్రావెల్ కూ, ట్రావెలాగ్ కూ తేడా తెలియని విదూషకత్వం ఇలా మనకు ఒక్క సాక్షిలోనే ఎందుకు తెగ కనిపిస్తోంది?
ఇటీవల సాక్షిలో వచ్చిన ఒక సంపాదకీయంలోనూ, కీ.శే. కోట శ్రీనివాసరావు పై వచ్చిన వ్యాసంలోనూ ఈ స్థాయి విదూషకత్వాన్ని మనం చూశాం. అసలు ఈ తరహా రచనలు చేస్తున్న సీనియర్ పాత్రికేయులు సాక్షిలోనే కొలువుతీరి ఉండడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా?
3. ” … కాకపోతే ఫాంటసీ పేరుతో చరిత్రను వక్రీకరించడాన్ని, ఆ వక్రీకరణ ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టాలని ఉద్దేశించడాన్ని మాత్రం సహించలేము…”
– వక్రీకరణల గురించి సాక్షి సీనియర్ సంపాదకుడు మాట్లాడ్డం విడ్డూరం. కంచె ఐలయ్య ‘రెండు వేలసంవత్సరాలుగా తెలుగువాళ్లకు విద్యలేదు’ అని పేలాపన చేస్తే పెద్ద అక్షరాలతో ఎడిట్ పేజ్లో ప్రధానాంశంగా వేసిన మేధావి ఈ మురళి. అంతేకాదు, కుల నింద, హిందూ, దేశ వ్యతిరేక, చైనాకు తోకాడించే వ్యాసాల్ని క్రమం తప్పకుండా ప్రచురించే మురళి వక్రీకరణ అంటూ ఈ రాయడం ఏమిటి?
4. “….కానీ, మొఘల్ చక్రవర్తుల కాలంలో అన్నీ అక్రమాలు, అకృత్యాలే జరిగాయా? ఇంకే గొప్పతనం లేదా?… వివిధ చారిత్రక దశల్లో ఆర్థిక వ్యవస్థల తీరుతెన్నులపై అధ్యయనం చేసిన నిపుణుల సమాచారం ప్రకారం క్రీస్తుశకం 16, 17 శతాబ్దాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ జీడీపీలో 25 శాతం వాటాగా ఉన్నది. కొద్ది తేడాతో చైనా తర్వాత రెండో స్థానం…”
– ఎంత మాత్రమూ చదువు లేకుండా, కేవలం లెఫ్ట్ భావజాల జనిత ఇస్లామ్ సమర్థన ఈ పేలాపన. అంతర్జాతీయంగా పలు పుస్తకాలు వచ్చాయి ఇస్లామ్ పాలకులు మన మట్టిలో చేసిన అతి భయంకరమైన దారుణాలు, దోపిడి గురించి. నెట్లో వెతికినా వివరాలు తెలుస్తాయి. ఈ మాటలు వర్ధెల్లి
మురళి చదువును, పాత్రికేయ స్థాయిని, మనస్తత్వాన్ని మనకు పట్టిస్తున్నాయి.
5. “…భారత ఉపఖండంలో విశాల భూభాగాన్ని ఐక్యం చేసి శాంతి, సుస్థిరతలను సాధించినందు వలన అక్బర్ చక్రవర్తి కాలంలో…”
– ఈ పాత్రికేయ శిఖామణి చదువు ఏ పాటిదో ఈ మాటలు పట్టిస్తున్నాయి. ఈ మేధావి 10వ తరగతి పాఠ్య పుస్తకం తరువాత కూడా చదువు ఉంటుందని తెలుసుకోవాలి. అక్బర్ దారుణాల గురించి అంతర్జాతీయ పరిశోధకులు రాసిన పుస్తకాల చదువు లేకపోతే పోనీ కనీసం అవి ఉన్నాయి, ఉంటాయి అన్న ఊహ అయినా ఈ పాత్రికేయ పండితుడికి ఉండాల్సింది. సాక్షి ఉద్యోగులకు ‘చదువు’ అన్నది అందని ద్రాక్షా?
6. “…అశోక చక్రవర్తి కాలంలో జరిగిన సామ్రాజ్య విస్తరణ,శాంతి – సుస్థిరత స్థాపనల ఫలితంగా, ఆ కాలంలో విరాజిల్లిన బౌద్ధమతం వెలుగులో…”
– ఇలాంటి మాటలు అజ్ఞానంవల్ల మాత్రమే వస్తాయి. అశోకుడి కాలంలో బౌద్ధం విరాజిల్లలేదు. బౌద్ధం రూపొందింది కనిష్కుడి కాలంలో. అశోకుడు ఒక బుద్ధ ఉపాసకుడు అంతే. అశోకుడు తాను బుద్ధ ఉపాసకుడు అయిన తరువాతే భారత ప్రదేశంలో మెట్ట మొదటి మత నరమేధం చేయించాడు. అశోకుడి తరువాత వచ్చిన రాజు జైనుడు. చరిత్ర తెలియని, చదువు లేని ఇలాంటి పేలాపనలు విదూషకత్వం; సమాజానికి హానికరం.
సాక్షిలో క్రమం తప్పకుండా వస్తున్న ఇలాంటి తప్పుడు వ్యాసాలు వాస్తవాలకు మాత్రమే కాదు. తెలుగు సమాజానికి కూడా హానికరం. ఈ వ్యాసంలో ఇస్లామ్ పాలకుల పరంగా చెప్పినవి అజ్ఞానం మాత్రమే కాదు ‘హిందూ వ్యతిరేకత కూడా’ అన్న భయాన్ని కలిగిస్తున్నాయి. ఇలాంటి తప్పుడు వ్యాసాలతో వస్తున్న సాక్షి విషయంలో తెలుగు హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
‘సాక్షిది చదువు లేని పాత్రికేయం మాత్రమే కాదు, సమాజానికి హానికరమైన పాత్రికేయం’ అని మనం తెలుసుకోవాల్సిన తరుణం వచ్చేసిందా?
– రోచిష్మాన్
9444012279