– జై శ్రీకృష్ణ బీసీ సమితి వ్యవస్థాపకుడు ద్రావిడ దేశం కృష్ణారావు డిమాండ్
విజయవాడ: పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్, సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.కృష్ణయ్యపై అనుచిత వ్యాఖ్యలు దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని జై శ్రీకృష్ణ బీసీ సమితి వ్యవస్థాపకుడు ద్రావిడ దేశం కృష్ణారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. కృష్ణయ్యపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా కృష్ణయ్యపై మాట్లాడటం దురదృష్టకరం అని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కృష్ణయ్య సీనియార్టీని గుర్తించి రాష్ట్రంలో ఎంతో బాధ్యత గలిగిన పిసిబి చైర్మన్ పోస్టును ఇచ్చారని, కృష్ణయ్య సౌమ్యుడు మృదుస్వభావి అని తెలిపారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారిపై అనుచిత వ్యాఖ్యలను వాపస్ తీసుకోకపోతే బీసీ సంఘాలు చూస్తూ ఊరుకుండబోవని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా యాదవ జేఏసీ అధ్యక్షుడు చిరుమామిళ్ల గోపికృష్ణ, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బంకా చిరంజీవి, బీసీ నాయకులు సాదం నరసింహారావు, శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.