– ఎమ్మెల్యే యార్లగడ్డ
గన్నవరం: గన్నవరం విమానాశ్రయ విస్తరణ నిర్వాసితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో కోరారు. శాసనసభ వర్షా కాల సమావేశంలో భాగంగా సోమవారం అసెంబ్లీలో మాట్లాడిన యార్లగడ్డ విమానాశ్రయ విస్తరణ కోసం 2015 వ సంవత్సరం గన్నవరం మండలంలోని దావాజీగూడెం, బుద్దవరం, అల్లాపురం, అజ్జంపూడి గ్రామాల్లో 835 ఎకరాల భూమిని సేకరించారని భూములు ఇచ్చిన రైతుల సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదన్నారు.
రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విన్నవించారు. విమానాశ్రయ విస్తరణలో 423 మంది ఇళ్ళు కోల్పోగా వారిలో 300 మంది పేద ఎస్సీలు ఉన్నారని తెలిపారు. ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాసం కోసం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ద్వారా ఒక్కొక్కరికి ఐదు సెంట్లు భూమిలో ఇళ్ళు నిర్మించి ఇచ్చేందుకు కాలనీ ఏర్పాటు చేశారని ఈ కాలనీలో కనీస వసతులు లేవని, ఇక్కడ మౌలిక వసతుల కల్పనకు రూ.80 కోట్లు కేటాయించాలని కోరారు.
ఇళ్ళు కోల్పోయిన నిర్వాసితులకు ఒక్కొక్కరికి తొమ్మిది లక్షల పరిహారంగా ఇవ్వాల్సి ఉందని ఇందు నిమిత్తం రూ.59 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దావాజీగూడెంలో మైక్రో కాల్వ నిర్మాణం కోసం 45 ఇళ్ళు తొలగించారని నిర్వాసితులకు వారికి రూ.50 వేలు చొప్పున అద్దె ఇవ్వాల్సి ఉందన్నారు. విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులకు రూ.27 కోట్లు కౌలు బకాయిలు విడుదల చేయాలని యార్లగడ్డ కోరారు.
రూ.459 కోట్లతో చేపట్టిన విమానాశ్రయ టెర్మినల్ భవన నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. విమానాశ్రయ విస్తరణ కోసం సీతారామచంద్రస్వామి ఆలయం, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల భూములు 4.30 ఎకరాలు సేకరించారని ఆ భూములకు రాజధానిలో భూముల కేటాయించాలని అసెంబ్లీలో యార్లగడ్డ కోరారు.