అమరావతి : బీసీల అభ్యున్నతికి టీడీపీ ఆవిర్భావం నుంచి కృషి చేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ‘కుల గణన సామాజిక న్యాయం’ పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమాజానికి బీసీలు వెన్నుముక వంటివారన్నారు. వారి అభ్యున్నతి కోసమే ఆనాడు అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. ఆనాటి నుంచి బీసీలను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేలా పార్టీ కృషి చేస్తోందన్నారు.
ముఖ్యంగా సీఎం చంద్రబాబునాయుడు బలహీన వర్గాలను రాజ్యాధికారంలోనూ, పాలనలోనూ భాగస్వామ్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. బీసీ కుల గణనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కుల గణనతో బీసీలకు ఎంతో మేలు కలుగుతుందని మంత్రి సవిత అభిప్రాయపడ్డారు.
జనాభాలో అధిక సంఖ్యలో ఉన్నబీసీలకు ఏవిధంగా న్యాయం జరగాలో ‘కుల గణన సామాజిక న్యాయం’ పుస్తకంలో విపులంగా వివరించారన్నారు. ఈ పుస్తకావిష్కరణలో రచయిత నెల్లూరు నర్సింహారావు, ప్రచురణ కర్త కోయ చంద్రమోహన్, తోట నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.