– సీఎంను కోరిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్
అమరావతి: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్ఫూర్తి, సృష్టి సభల తీర్మానాలకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం వైపు నుండి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, బీజేపీ స్టేట్ ఆర్గనైజేషనల్ సెక్రటరీ మధుకర్ తెలిపారు. ఈ మేరకు వారు బుధవారం మీడియాతో మాట్లాడారు.
అదేవిధంగా అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే ఖాదీ సంతకు మాధవ్ ఆహ్వానం పలకగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సంచార జాతుల సమస్యలు, విశ్వకర్మల సమస్యలు ఎన్ డి ఎ ప్రభుత్వంగా పరిష్కరించాల్సిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించారు.
ఈ నేపథ్యంలో విశ్వకర్మ విగ్రహాన్ని రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి ప్రత్యేకంగా తీసుకు వెళ్ళారు. భారతీయ జనతాపార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఖాదీ సంత కార్యక్రమం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఖాదీఉత్పత్తులు ప్రదర్శన, కొనుగోలు కు భారీ ప్రచారం కల్పిస్తూ ప్రత్యేకంగా గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ సంతలు ఏర్పాటు చేస్తున్న వివరాలు మాధవ్ వివరించారు.
విజయవాడ లో జరిగే ఖాదీ సంతకు ముఖ్య అతిథి గా హాజరు కావాలని మాధవ్ ముఖ్య మంత్రి కి ఆహ్వాన పత్రికను అందజేశారు భారత ప్రధాని నరేంద్రమోడీ మొదటగా అమరావతి రాజధాని కోసం భూమి పూజ చేసిన స్థలంను 10 ఎకరాలుగా విస్తరించి 100 అడుగుల విశ్వకర్మ విగ్రహం ఏర్పాటుతో విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని, నిరంతర స్వదేశీ వస్తు ప్రదర్శన ఏర్పాటు చేయాలని, భూమి పూజ, పవిత్ర మట్టి, నీరు ఉద్దేశ్యాన్ని ప్రజలకు తెలిసే విధంగా తీర్చిదిద్దాలని కోరారు.
మున్సిపాలిటీ, కార్పొరేషన్ వారు నిర్మించే వాణిజ్య సముదాయాల్లో కార్పెంటర్స్ స్వర్ణకారుల కోసం వారి అమ్మకాల కోసం ప్రత్యేక షాపింగ్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయాలని, వృద్ధాప్య పెన్షన్లు 50 ఏండ్ల నిండిన వారికి విశ్వబ్రాహ్మణ వృత్తుల వారికి అందించాలని అలాగే మరికొన్ని సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్ళారు.