– పేషీలో పనిచేసే వారికే బినామీ సేఫ్టీ ఏజెన్సీలు?
– కాకినాడ, ఏలూరులో మెరుస్తున్న ‘వజ్ర’ం!
– విశాఖలో పేషీ బంధువుల ‘శ్రీరామ’రాజ్యం
– మాజీ డైరక్టర్ తమ్ముడిగారి భాగస్వామ్యం
– వారు చెప్పిన ఏజన్సీలకే పనులు
– విజయవాడ లో పేషీ బంధువుల బినామీలకే ఏజెన్సీ పనులు
– వీటికి ఆడిట్ చేసేది కీలక నేత బంధువే
– హైదరాబాద్ నుంచి వచ్చి మరీ పెత్తనం
– సేఫ్టీ డాక్యుమెంటేషన్‌కు కంపెనీ నుంచి 15 నుంచి 20 లక్షల డిమాండ్
– దీనిలో పెద్ద వాటా పేషీ బంధువుకేనట
– గతంలో ఇది 2,3 లక్షలతో అయ్యేదంటున్న పారిశ్రామికవేత్తలు
– ఇన్స్పెక్షన్ లేకున్నా తరచూ కంపెనీల తనిఖీకి వెళుతున్న ఫ్యాక్టరీ అధికారి
– ప్రమాదం జరిగిన కంపెనీల లక్ష్యంగా వసూళ్ల దృష్టి
– పోస్టింగ్ కోసం పేషీకి ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలు
– పేషీపై మంత్రికి పట్టుందా?
– బాబు ఆదేశాలు బేఖాతర్
( మార్తి సుబ్రహ్మణ్యం)
కార్మికశాఖలో కీలక వ్యక్తులు, బంధుమిత్రులు, కొందరు పేషీ ఉద్యోగులకు ఫ్యాక్టరీస్ విభాగం కల్పతరువుగా మారింది. కార్మిక శాఖలో ఎన్ని విభాగాలున్నా బాగా ఆదాయం తెచ్చి పెట్టేది మాత్రం ఫ్యాక్టరీస్ విభాగమే. రాష్ట్రంలో ఇప్పుడున్న సేఫ్టీ డాక్యుమెంటేషన్ ఆడిట్ ఏజెన్సీలలో సింహభాగం.. పేషీ ప్రముఖుడి బంధు-మిత్రులు, పేషీలో పనిచేసే కొందరు ఉద్యోగుల బినామీలదేనంటే ఆశ్చర్యపడక తప్పదు.
విశాఖ, ఏలూరు, విజయవాడ లోని ఫ్యాక్టరీలన్నీ.. ఈ బినామీల ఏజెన్సీలకే పనులిచ్చి తీరాలి. ఎంతంటే.. కేవలం 15 నుంచి 20 లక్షల రూపాయలు మాత్రమేనట. ఇదే గతంలో 2-3 లక్షలతో అయిపోయేది. మరి అంత డబ్బు ఒక్క ఏజెన్సీనే తీసుకుంటుందా అంటే అదీ లేదు. ఫ్యాక్టరీ అధికారి, పేషీ ప్రముఖుల వాటాలు పోతే.. సదరు ఏజెన్సీకి 4,5 లక్షలు మిగులుతుందట.
ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్లో పనిచేసే అధికారులు.. ఎక్కడ పోస్టింగు కావాలంటే అక్కడకు బదిలీ అయ్యే ఏకైక వెసులుబాటు ఉన్న విభాగం. మరో గమ్మతు ఏమిటంటే.. కార్మికశాఖలో మంత్రి కంటే పేషీ ఉద్యోగులు, బంధుమిత్రులే పవర్ఫుల్. రామచంద్రాపురంలోనూ సేమ్ టు సేమ్. శాఖను- పేషీని శాసించేది వాళ్లేనంటే ఆశ్చర్యపోవలసిన పనిలేదన్నది సచివాలయంలో బహిరంగంగా వినిపించే టాక్.
ఒక్క ఫైలు చూసే బాధ్యత లేకపోయినా ఫ్యాక్టరీస్ నుంచి ఒకరిని, లేబర్ నుంచి ఇంకొక జూనియర్ అసిస్టెంట్లను ఏరికోరి తెచ్చుకుని పేషీలో పెట్టుకున్నారంటే.. ఆ నియామాల లక్ష్యం ఏమిటన్నది తెలుసుకోవడానికి మేధావి కానక్కర్లేదు. కారణం.. ‘మామూలే’. వీరి వెనక ఎవరున్నారు? అసలు పేషీలో వీరి విధులేమిటి? పేషీలో వీరికి డిప్యూటేషన్ సేవలు అవసరమా? ఒక్క ఫైలు వీరివద్దకు రానప్పుడు పేషీలో వీళ్ల అవసరం ఏమిటి? అసలు వీరిని పేషీలోకి సిఫార్సు చేసిందెవరు? ఏ లక్ష్యంతో వీళ్లని తెచ్చి పెట్టారన్నది తర్వాత ముచ్చటించుకుందాం.
అసలు ఇవన్నీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు తెలిసి జరుగుతున్నాయా? తెలియకుండా జరుగుతున్నాయన్నదే ప్రశ్న. పేషీపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి.. ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతున్నప్పటికీ, పేషీ ఉద్యోగులను మార్చకపోగా, అదనంగా లేబర్ డిపార్టుమెంట్ నుంచి మరో జూనియర్ అసిస్టెంట్‌ను తెచ్చిపెట్టారంటే, ఇవన్నీ మంత్రికి తెలియకుండా జరుగుతాయా? అన్నది మరో ప్రశ్న.
ఇప్పటివరకయితే..పేషీ ఉద్యోగులు, మంత్రి బంధువులే ఆయన పేరు చెప్పి హవా సాగిస్తున్నారని, ఫ్యాక్టరీస్ అధికారుల బదిలీలు, మామూళ్లలో వారే పెత్తనం చేస్తున్నారన్న ప్రచారం వినిపిస్తోంది. నేరగా ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి ఆదేశిస్తున్నట్లు అధికారులే చెబుతున్నారు. మంత్రికి సరైన అవగాహన లే కపోవడంతో.. పేషీలోని ఓ ప్రముఖుడు, మరో జూనియర్ అసిస్టెంట్‌తో కలసి సమీప బంధువు దందాలు చేస్తున్నారని.. వీరిదూకుడు నచ్చని ఓఎస్డీ, పేషీకి రాకుండా విధులకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. దీనిపై మంత్రికి చెప్పినా స్పందించలేదంటున్నారు.
ఓఎస్డీని కూడా పక్కనపెట్టి పెత్తనం అంతా పేషీలో మరో కీలక ఉద్యోగి సాగిస్తున్నారట. తనకు డాంగిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో సదరు ఓఎస్డీ పేషీకి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఓఎస్డీల వద్ద ఉండాల్సిన డాంగిల్, పేషీపై పెత్తనం చేస్తున్న మరో ఉద్యోగి వద్ద ఉందంటే.. కార్మికశాఖ పేషీలో పెత్తనం ఎవరు చేస్తున్నారన్నది స్పష్టమవుతోందంటున్నారు. దీనితో మంత్రి గారి పరువు ‘హరీ’ అంటోంది.
అసలు మంత్రివర్గంలో కార్మికశాఖమంత్రి పేషీపైనే అధిక ఆరోపణలు రావడం చర్చనీయాంశమయింది. ఫలితంగా.. విస్తరణ ఎప్పుడు జరిగినా కార్మికమంత్రి మార్పు ఖాయమంటూ, మీడియాలో రాయడం సాధారణంగా మారింది. దీనికి ప్రధాన కారణం.. మంత్రిలో స్పష్టత-స్థిర నిర్ణయాలు తీసుకునే లక్షణాలు లేకపోవడమేనంటున్నారు.
మంత్రికి శాఖపై సరైన అవగాహన లేకపోవడం, అదనపు బాధ్యతలు ఉండటంతో పేషీలో ఏం జరుగుతోందో దృష్టి సారించలేకపోతున్నారంటున్నారు. పైగా ఆయన నమ్మకం ఉంచి నియమించిన వారే.. అడ్డగోలు పనులకు పాల్పడుతూ తన పరువు తీస్తున్నారన్న విషయం, మంత్రి తెలుసుకోలేకపోతున్నారని ఆయన సన్నిహితులే చెబుతున్నారు.
పేషీలో ఇద్దరు ముగ్గురు చెప్పింది గుడ్డిగా నమ్మి తీసుకున్న నిర్ణయాలే ఆయనపై విమర్శలకు కారణమవుతున్నాయంటున్నారు. ఒకవేళ ఇవన్నీ మంత్రికి తెలియకుండా జరుగుతుంటే, పేషీని ఎందుకు ప్రక్షాళన చేయడం లేదు? అంటే మంత్రికి తెలిసే ఇవి జరుగుతున్నాయా? తన శాఖలో అవినీతిపై మీడియాలో కథనాలు వస్తున్న విషయం కూడా తెలియనంత అమాయకంగా ఉన్నారా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక దండిగా ఆదాయం సమకూర్చే సేఫ్టీ ఆడిట్ డాక్యుమెంటేషన్ ఏజెన్సీల కేటాయింపు కూడా.. పేషీ ఉద్యోగులు-బంధుమిత్ర సపరివార కనుసన్నలలోనే నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిలో వస్తున్న ఆదాయం అనతికాలంలోనే పేషీ ప్రముఖలను ధనవంతులుగా మారుస్తోందంటున్నారు. అసలు కొత్తగా వెలసిన ఈ ఏజెన్సీల్లో సింహభాగం, వారి బినామీలవేనన్న విషయం ఇంటెలిజన్స్ విచారణలో తేలిందట. ఇందులో మేజర్ వాటా ‘బంధువు’ది కాగా.. మిగిలినది పేషీలో పనిచేసే మరో ఇద్దరిదని, వీటికోసమే డిప్యూటేషన్ తెప్పించుకున్నట్లు ఇంటెలిజన్స్ పరిశీలనలో తేలినట్లు సమాచారం.
కాగా అత్యధిక కంపెనీలున్న కాకినాడ, విశాఖ, ఏలూరు ప్రాంతాల్లో వీరి బినామీ ఏజెన్సీలకే పనులు ఇవ్వాలని.. ఫ్యాక్టరీస్ అధికారులు తమ పరిథిలోని ఫ్యాక్టరీలకు హుకుం జారీ చేశారట. అందుకోసం పేషీ ప్రముఖులు తెలివిగా.. తమకు అనుకూలంగా ఉండే అధికారులనే అక్కడ ముందస్తుగా పోస్టు చేయించుకున్నట్లు చెబుతున్నారు. వారి ద్వారానే ఈ దందా నడిపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిజానికి గత ప్రభుత్వంలో ఒక కంపెనీకి సేఫ్టీ ఆడిట్ చేసి, నివేదిక ఇవ్వాలంటే 2 నుంచి 3 లక్షల రూపాయల లోపు ఖర్చయ్యేది. ఏజెన్సీలు కూడా అంతే కొటేషన్ ఇచ్చేవి. అందులో కొంత ఫ్యాక్టరీస్ అధికారులకు ఇచ్చేవారు. ఆ ప్రకారంగా ఖర్చులు పోగా, 70 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఏజెన్సీలకు మిగిలేది. ఇది పారిశ్రామికవేత్తలకూ పెద్ద భారంగా ఉండేది కాదు.
కానీ గత ఏడాదిన్నర నుంచి ‘ఆకలి’తో ఉన్న పదేషీ ప్రముఖులు, ఆ పద్ధతి మార్చేశారు. తొలుత తమకు కోరినంత ఇచ్చే ఏజెన్సీలను ప్రోత్సహించారు. అయినా ఈ విధానంలో తమకు ఏమీ రావడం లేదని గ్రహించిన పేషీ ప్రముఖులు- కొందరు ఉద్యోగులు.. ఏకంగా తమ బంధు మిత్రుల పేరుతో బినామీ ఏజెన్సీల దుకాణం తెరిచారు. తాము ఖరారు చేసిన రేటునే ఏజెన్సీలకు ఇవ్వాలని, ప్యాక్టరీస్ అధికారుల ద్వారా హుకుం జారీ చేశారట.
ఆ ప్రకారం ఇప్పుడు ఒక్కో కంపెనీ సేఫ్టీ ఆడిట్ రిపోర్టు తెప్పించుకోవాలంటే, 15 నుంచి 20 లక్షలు రూపాయల ఖర్చవుతుంది. గతంలో 2-3 లక్షలతో అయ్యే పని, ఇప్పుడు ఏకంగా 20 లక్షలవడంతో పారిశ్రామికవేత్తలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కంపెనీలయితే ఈ విషయాన్ని సీఎంఓ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.
ఈ 15-20 లక్షల్లో సింహభాగం పేషీ ప్రముఖులైన బినామీలకు వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో తక్కువ మొత్తం తీసుకున్న ఫ్యాక్టరీస్ అధికారులకు, ఇప్పుడు బాగానే గిట్టబాటవుతోందట. ఎందుకంటే గతంలో 2 లక్షలున్న సేఫ్టీ ఆడిట్ ఏజెన్సీ కొటేషన్.. ఇప్పుడు ఏకంగా 20 లక్షలకు పెరగడమే. ఏజెన్సీలకు ఎంత వస్తే అధికారులకు అంతా లాభమన్నమాట!
‘ఇందులో మాదేం లేదు. పేషీ నుంచి వచ్చే ఆదేశాల మేరకు పనిచేస్తున్నాం. వారిని ప్రశ్నించి ఇక్కడ పనిచేసే పరిస్థితి లేదు. అయితే ఆ ఏజెన్సీలకు వర్కు ఇవ్వాలా? వద్దా అన్నది కంపెనీల ఇష్టం. మాతో అయితే ఇప్పటిదాకా మంత్రి గారు ఎప్పుడూ మాట్లాడలేదు. అంతా పేషీలోని ఆ ముగ్గురే మాట్లాడతారు. బంధువు చెప్పిన కంపెనీలకే ఏజెన్సీ పనులివ్వాలి. ఇది అందరికీ తెలిసిందే’’ అని ఫ్యాక్టరీస్ అధికారి ఒకరు అసలు విషయం వెల్లడించారు.
—-.
విశాఖలో తనిఖీల ఇష్టారాజ్యం
సహజంగా ఒక ఫ్యాక్టరీ అధికారి ఏదైనా ఫ్యాక్టరీకి వెళ్లి తనిఖీ చేయాలంటే, దానికి కొన్ని నిబంధనలుంటాయి. ఎప్పుడంటే అప్పుడు వెళ్లడానికి వీల్లేదు. ఏ అధికారి ఎప్పుడు తనిఖీ చేయాలో ‘సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్’ ఆన్లైన్ ద్వారా నిర్దేశిస్తుంది. ఇది డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కార్యాలయ పర్యవేక్షలో ఉంటుంది. దాని ప్రకారమే తనిఖీలకు వెళ్లాల్సి ఉంటుంది. పైగా ఒకే అధికారి మళ్లీ అదే కంపెనీకి వెళ్లే వీల్లేదు. రోస్టర్ పద్ధతిలో తనిఖీ చేయాలి. అయితే ఇవన్నీ ఫ్యాక్టరీ యజమానులకు తెలియవు. వారి అమాయకత్వం ఆసరా చేసుకుని ఓ అధికారి.. ఎప్పుడంటే అప్పుడు ఫ్యాక్టరీలకు తనిఖీలకు వెళ్లి ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
——
పేషీది గోదావరి జిల్లాల్లో ‘వజ్ర’ సంకల్పం.. విశాఖలో ‘శ్రీరామ’రాజ్యం
ఫ్యాక్టరీలన్నీ ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా సేఫ్టీ ఆడిట్ చేయించుకోవాలి. అంటే తమ పరిశ్రమలో భద్రతాప్రమాణాలన్నీ సక్రమంగా ఉన్నాయని ఆ సేఫ్టీ ఆడిట్ ఏజెన్సీతో ధృవీకరించుకోవాలన్న మాట. నిపుణులైన వారే ఏజెన్సీలను నిర్వహించాలి. ఎవరంటే వారు ఏజెన్సీ నిర్వహించుకునే వీలులేదు. ఈ అంశంలో ఫలానా ఏజెన్సీతో ఆడిట్ చేయించుకోవాలన్న నిబంధన ఏమీ లేదు. ఏ ఏజెన్సీతోనయినా చేయించుకోవచ్చు. ఏడాదిన్నర క్రితం వరకూ విశాఖ పరిశ్రమలకు, కేవలం 2 లక్షల రూపాయల కొటేషన్తోనే ఏజెన్సీలు ఆడిట్ చేసేవి. దానితో పరిశ్రమలు కూడా తమకు నచ్చిన ఏజెన్సీతో ఆడిట్ చేయించుకునేవి.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్ధతి మారిపోయి..కార్మికశాఖ పేషీలోని ముగ్గురు వ్యక్తులు, ఏ ఏజెన్సీకి ఆడిట్ పనులు ఇవ్వాలో ఆదే శించే సంప్రదాయం మొదయిలంది. ఫలితంగా ఏడాదిన్నర క్రితం 2 లక్షలతో చేసిన అదే ఆడిట్ రిపోర్టు.. ఇప్పుడు 15 నుంచి 20 లక్షలకు పెరిగింది. ఆ ప్రకారంలో విశాఖలో చిన్న కంపెనీలకు 5 లక్షలు, పెద్ద కంపెనీలకు 15-20 లక్షల ఫీజు వసూలు చేస్తున్నట్లు పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. ఈ ‘శ్రీరామ’రాజ్యంలో.. గతంలో డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌గా పనిచేసిన ఓ అధికారి తమ్ముడు, హవా సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఇక ఉభయ గోదావరి జిల్లాలో కూడా.. పేషీలో పనిచేసే వారి ఆదాయ ‘వజ్ర’సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది. తాము సూచించిన ఆ కంపెనీకే ఆడిట్ పనులివ్వాలని, పల్నాడు జిల్లా నుంచి వచ్చిన ఓ అధికారి హుకుం జారీ చేస్తున్నారట. ఆ ప్రకారంగా వారి ‘వజ్ర’ సంకల్పం కొటేషన్ 5 లక్షల రూపాయలంటున్నారు. విచిత్రంగా.. ఈ జిల్లాల్లో ఉన్న ఫ్యాక్టరీస్ అధికారులు.. పేషీలోని ఆ ప్రముఖుల దయతో అక్కడ పోస్టింగు పొందిన వారేనట. వీరిలో ఇద్దరిపై ఫిర్యాదులున్నా పట్టించుకోకుండా, ఆదాయం ఉన్న ఆ జిల్లాలో పోస్టింగులిచ్చేశారు.
—-
ఆ అధికారుల టార్గెట్.. టీడీపీ-జనసేన సానుభూతిపరులేనట!
కాగా ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్లో పనిచేసే విశాఖ, గోదావరి, ఏలూరు, కాకినాడ అధికారులు కొందరు.. టీడీపీ-జనసేన-బీజేపీ సానుభూతిపరులయిన పారిశ్రామికవేత్తల లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జిల్లాల్లోని కమ్మ-కాపు సామాజికవర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, గత ఎన్నికల ముందు టీడీపీ-జనసేనపై ఉన్న అభిమానంతో విరాళాలు ఇచ్చారు.
పైగా వారి బంధుగణాలు కూడా ఆయా పార్టీల్లో పనిచేస్తుండటం కూడా దానికి మరో కారణం. సహజంగా ప్రతి ఎన్నికల్లో పారిశ్రామికవేత్తలు తమ స్థాయిలో చందాలు ఇస్తూనే ఉంటారు. ఆ తర్వాత అధికారంలో వచ్చిన పార్టీ నుంచి,ఏదో ఒక రూపంలో పనులు చేయించుకోవడం కొత్తేమీ కాదు. ఇదంతా బహిరంగ రహస్యమే.
పైగా జగన్ హయాంలో బాగా నష్టపోయి, ఫ్యాక్టరీలు మూసుకునే పరిస్థితి వరకూ వెళ్లిన కమ్మ-కాపు పారిశ్రామికవేత్తలు, కూటమి అధికారంలోకి వస్తే స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చన్న ఆశతో కూటమికి చేయూత అందించారు. ముఖ్యంగా విశాఖలో కమ్మ వర్గానికి చెందిన టీడీపీ సానుభూతిపరులైన థర్డ్‌పార్టీ సేఫ్టీ ఏజెన్సీ సంస్థల యజమానులు, వైసీపీ దిగిపోతే మంచిరోజులు వస్తాయని భావించి, తమ స్థాయిలో విరాళాలు అందించారు.
వీరిలో కొందరు చంద్రబాబు పాదయాత్రలో ఆయనతో కలసి నడిచిన వారూ లేకపోలేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై వైసీపీ ముద్ర వేసిన కార్మిక శాఖ పేషీ అధికారులు- వారి స్ధానాల్లో తమ కులాలకు చెందిన థర్డ్‌పార్టీ సేఫ్టీ ఏజెన్సీలను, బినామీలతో నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్‌పై ఆధారపడి జీవనం సాగించే, కమ్మ వర్గానికి చెందిన ఏజెన్సీలకు ఇప్పుడు ఎక్కడా పనిలేకపోవడంతో, రోడ్డునపడాల్సిన దుస్థితి నెలకొంది.
కూటమి అధికారంలోకి వస్తే తమకు లబ్థి చేకూరుతుందని కమ్మ-కాపు పారిశ్రామికవేత్తలు భావించగా.. విచిత్రంగా ఇప్పుడు కార్మికశాఖలోని ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్లో, అందుకు భిన్నమైన వ్యవహారం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కూటమికి అనుకూలంగా పనిచేసి, విరాళాలు ఇచ్చిన వారి పరిశ్రమలే లక్ష్యంగా నోటీసులు ఇస్తున్న వైనం, పారిశ్రామికవర్గాల అసంతృప్తికి కారణమవుతోంది.
నిబంధనల సాకుతో తనిఖీలు, నోటీసులతోపాటు.. తాము సూచించిన థర్డ్‌పార్టీ సేఫ్టీ ఆడిట్ ఏజెన్సీలకు 15-20 లక్షలు ఇచ్చి ఆడిట్ చేయించుకోవాలని హుకుం జారీ చేయటంతో, ఎన్నికలకు ముందు కూటమికి విరాళాలు ఇచ్చిన పారిశ్రామికవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఫలానా పారిశ్రామికవేత్త కూటమిలోని ఫలానా పార్టీ సామాజికవర్గానికి చెందిన వారని తెలిసినా, ఆ నలుగురు ఫ్యాక్టరీ అధికారులు నోటీసుల పేరుతో వేధిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్ వ్యవహారాలను నేరుగా మంత్రి-ఆయన పేషీనే చూస్తుండటంతో ఎవరూ జోక్యం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలో పేషీలోని కొందరు రంగంలోకి దిగి, నోటీసులు అందుకున్న కమ్మ-కాపు పారిశ్రామికవేత్తలతో బేరసారాలకు దిగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.