– పెట్టుబడులే కంపెనీలతో లక్ష్యంగా విస్తృత భేటీలు
16 అక్టోబర్ 2025: అమరావతి: రాష్ట్రానికి పెట్టుబడులు, సాంకేతిక సహకారం తోపాటు ఇన్నోవేషన్ భాగస్వామ్యాలను ఆకర్షించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఐదు రోజులపాటు స్విట్జర్లాండ్ ,జర్మనీలలో పర్యటిస్తున్న రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల మంత్రి శ్రీనివాస్ పలువురు పారిశ్రామిక ప్రముఖులు, సీఈవోలు, పలుసంస్థల ప్రతినిధులతో కీలక సమావేశాలు నిర్వహించారు.
గురువారం స్విట్జర్లాండ్, జర్మనీ దేశాలలోని సంస్థల ప్రతినిధులతో సమావేశమై పరస్పర సహకార అవకాశాలపై చర్చించారు. స్విట్జర్లాండ్‌లో ప్రీమియం నాణ్యత గల వస్త్ర ఉత్పత్తుల తయారీలో అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఒలివర్ ఫూక్స్ తదితర వస్త్ర పరిశ్రమ ప్రముఖులతో సమావేశమయ్యారు. మంత్రి అభ్యర్థన మేరకు ఒలివర్ ఫూక్స్ భారతదేశంలో తయారీ యూనిట్ స్థాపించడానికి తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, నైపుణ్యం కలిన మానవ వనరులు, ‘ప్లగ్-అండ్-ప్లే’ మౌలిక సదుపాయాలతో కూడిన టెక్స్టైల్ క్లస్టర్ల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం గురించి వివరించారు. ఫూక్స్ పర్యాటక ఉత్పత్తులపై కూడా ఆసక్తి చూపడంతో, ఆయన కున్న డిజైన్ నైపుణ్యాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక అభివృద్ధి కార్యక్రమాలతో అనుసంధానం చేయాలని సూచించామని మంత్రి శ్రీనివాస్ అన్నారు.
జర్మనీలో ఇన్నోవేషన్, స్టార్టప్ భాగస్వామ్యం:
జర్మనీకి చెందిన ఫైర్స్‌ట్‌జెన్ (FyrstGen) సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ ఫిలిప్ అస్మస్,ఎక్స్పోర్ట్-అకాడెమీ బాడెన్-వుర్టెంబర్గ్ ప్రతినిధులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమావేశమై ఫైర్స్‌ట్‌జెన్ సంస్థ ఉపయోగించని మేధోసంపత్తి (Intellectual Property – IP) ఆధారంగా కొత్త స్టార్టప్‌లను స్థాపించడంలో నిమగ్నమై ఉన్న నేపథ్యంలో ఈ వినూత్న మోడల్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో అనుసంధానం చేయాలని, రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 175 యం ఎస్ యం ఈ పార్కులు వారు ఏర్పాటు చేసే ఇన్నోవేషన్ ఆధారిత స్టార్టప్ ఇంక్యుబేషన్ హబ్‌లుగా వినియోగించుకోవాలని మంత్రి ప్రతిపాదించారు. తమ ప్రతిపాదనపై ఫిలిప్ అస్మస్ సానుకూలంగా స్పందించారని మంత్రి శ్రీనివాస్ తెలియజేశారు.
ఎక్స్పోర్ట్-అకాడెమీ బాడెన్-వుర్టెంబర్గ్ ప్రతినిధులతో సమావేశమై, ఎగుమతి శిక్షణ మరియు సాంకేతిక మార్పిడి (టెక్నాలజీ ట్రాన్స్ఫర్) రంగాలలో సహకారంపై చర్చించామని, యం ఎస్ యం ఈలకు ఆన్లైన్ ఎగుమతి శిక్షణ కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభించడానికి ఇరు పక్షాల మధ్య పరస్పర అంగీకారం కుదిరిందని మంత్రి తెలిపారు. తదుపరి దశలో జర్మనీకి ఎక్స్పోజర్ విజిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, దీనిలో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యంగా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లను నిర్వహించాలని ప్రతిపాదించామని మంత్రి తెలియజేశారు.
టై జర్మనీ (TiE Germany) సంస్థ ఫ్రాంక్‌ఫర్ట్‌లో కీలక చర్చలు:
ది ఇండస్ ఎంటర్‌పెన్యూర్స్ (TiE Germany) సంస్థ ఫ్రాంక్‌ఫర్ట్‌లో మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్, ఆయన బృందం గౌరవార్థం విందు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నౌకానిర్మాణం, గ్యాస్ అన్వేషణ, ఇండస్ట్రీ 4.0, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), లైఫ్ సైన్సెస్, ఆటోమోటివ్ టెక్నాలజీలు మరియు జ్ఞాన మార్పిడి వంటి కీలక రంగాలలో సహకార అవకాశాలను చర్చించామని మంత్రి తెలిపారు. జర్మన్-ఇండియా రౌండ్ టేబుల్ చైర్మన్ డా. జోహన్నెస్ వైసర్, భారత్-జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి తమ మద్దతు కొనసాగుతుందని పేర్కొన్నారని ఆయన తెలియజేశారు.
నవంబర్ 14–15 తేదీలలో విశాఖపట్నంలో జరిగే ఇన్వెస్టర్ మీట్ లో జర్మనీకి చెందిన నిపుణుల బృందం పాల్గొంటుందని టై జర్మనీ అధ్యక్షులు డా. అజాక్స్ మొహమ్మద్ ప్రకటించారని, ఇది ఇండో-జర్మన్ ఆర్థిక సహకారాన్ని మరింత బలపరుస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విశ్వాసం వ్యక్తం చేశారు.