– ప్రభుత్వ సలహాదారు, శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్
మంగళగిరి : అన్నదాతకు కొండంత అండగా చంద్రన్న ఉన్నాడంటూ మరోసారి ‘అన్నదాత సుఖీభవ’ రెండోసారి నిధులు విడుదల చేసి రైతుకు భరోసానిచ్చారని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీష్ తెలిపారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని జగన్ రెడ్డి ఎంత దారుణంగా నట్టేట ముంచేశారో ఈ గణాంకాలే సాక్ష్యమన్నారు.
గత ఐదేళ్లలో రైతులకు రూ. 58 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, కేవలం రూ. 39 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి, రైతును పూర్తిగా దగా చేశారు. ధాన్యం అమ్ముకున్నా రైతుకు డబ్బులివ్వని దుస్థితి తీసుకొచ్చారు. 84,724 మంది రైతులకు చెల్లించాల్సిన రూ. 1,674.47 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, రైతు కష్టం విలువ తెలిసి, జగన్ రెడ్డి పెట్టిన ఈ రూ. 1,674.47 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించి రైతుకు భరోసా ఇచ్చింది.
జగన్ రెడ్డి ‘వైఎస్సార్ రైతు భరోసా’ అని హంగామాగా ప్రచారం చేసుకుని, ఓటు బ్యాంకు రాజకీయమే లక్ష్యంగా పనిచేశారు. రాష్ట్ర నిధుల నుంచి ఆయన కేవలం రూ. 3,000 మాత్రమే ఇచ్చి, మిగతా రూ. 6,000 కేంద్రం పీఎం కిసాన్‌ను కలిపి, రూ. 13,500 అని అబద్ధాల హడావిడి సృష్టించారు. అంటే, ఐదేళ్లలో ఒక్కో రైతుకు ఆయన ద్వారా కనీసం రూ. 30,000 నష్టం జరిగింది! 64 లక్షల మందికి ఇస్తానని హామీ ఇచ్చి, చివరకు లక్షలాది మంది అర్హులను పక్కన పెట్టి కేవలం 52 లక్షల మందికే వర్తింపజేశారు. ఈ మోసం చాలు, జగన్ రెడ్డి రైతు సంక్షేమాన్ని ఎలా నిర్వీర్యం చేశారో చెప్పడానికి..!
జగన్ రెడ్డి పాలన ఎంత అరాచకంగా ఉందంటే… గిట్టుబాటు ధర లేక, ప్రకృతి విపత్తుల నిధి (రూ. 4 వేల కోట్లు) ఏర్పాటు చేయక, ధరల స్థిరీకరణ నిధి (రూ. 3 వేల కోట్లు)కు దిక్కులేక… రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు! ఐదేళ్లలో మానవ హక్కుల సంఘాల నివేదిక ప్రకారం 2,552 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ దేశంలో రైతు ఆత్మహత్యల సంఖ్యలో 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానం దక్కించుకోవడం వైసీపీ పాలనలోని చీకటి అధ్యాయం! 2024 జూన్ లోపు ఆరు నెలల్లోనే 213 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చింది.
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా రైతులకు నిజమైన భరోసా ఇచ్చాం. పెట్టుబడి సాయం కింద కేంద్రం రూ. 6,000 (పీఎం-కిసాన్)కు అదనంగా రాష్ట్రం సొంతంగా రూ. 14,000 కలిపి, మొత్తం రూ. 20,000 పెట్టుబడి సాయం అందిస్తున్నాం. ఇదే నిజమైన రైతు సంక్షేమం! గత ప్రభుత్వం రూ. 3,000 ఇస్తే, మేము రూ. 5,000 ను రాష్ట్ర నిధుల నుండి ఇచ్చి మా భరోసా నిలబెట్టుకున్నాం.
రెండో విడత డబుల్ ధమాకాలో భాగంగా, నవంబర్ 19న ముఖ్యమంత్రి గారు జగన్ సొంత జిల్లా అయిన వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం నుంచే 46.86 లక్షల మంది రైతులకు రూ. 7,000 (కేంద్రం రూ. 2,000 + రాష్ట్రం రూ. 5,000) చొప్పున మొత్తం రూ. 3,135 కోట్లు విడుదల చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆత్మహత్యలు తగ్గాయి.. 17 నెలల పాలనలో రైతు ఆత్మహత్యలు 128కి మాత్రమే పరిమితమయ్యాయి. అంటే, సంవత్సరానికి 100 లోపుకే తగ్గి, గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది భారీ తగ్గింపు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడటానికి ఇదే నిదర్శనం!
జగన్ రెడ్డి పాలనలో కేవలం 1.43 లక్షల మంది కౌలు రైతులు మాత్రమే ‘రైతు భరోసా’ పరిధిలోకి వచ్చారు. వారికి కూడా రాష్ట్రం నుంచి రూ. 7,500 మాత్రమే ఇచ్చి, కౌలు రైతుల పట్ల పూర్తి నిర్లక్ష్యం చూపారు.
కూటమి ప్రభుత్వం 9.13 లక్షల సీసీ/ఆర్సీ కార్డులు మంజూరు చేసి, పంట నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత వారికి కూడా రెండు విడతలుగా రూ.10వేలు చొప్పున రూ. 20,000 ను రాష్ట్ర నిధుల నుంచే ఇవ్వబోతున్నాం. అంతేకాదు, గత ప్రభుత్వం కేవలం హామీ మాత్రమే ఇచ్చింది కానీ కూటమి ప్రభుత్వం రూ. 4 వేల కోట్లతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేసి రైతుకు భరోసా కల్పించింది. రైతును దగా చేసిన జగన్ రెడ్డి పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతన్న కళ్లల్లో నిజమైన ఆనందం చూసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోందని షరీఫ్ అన్నారు.