2021 అక్టోబర్ లో వైస్సార్సీపీ ముసుగేసుకున్న “రౌడీ పెద్దలు ” టీడీపీ కేంద్ర కార్యాలయం పై పట్టపగలు…. పోలీసులు చూస్తుండగానే ఎందుకు దాడి చేశారు? ఫర్నిచర్ ను ఎందుకు ధ్వంసం చేశారు? తమను పట్టుకుని శిక్షిస్తారనే ‘భయం ‘ లేకపోవడం వల్ల. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న అప్పటి నర్సాపురం ఎం పీ రఘు రామకృష్ణం రాజును సీ ఐ డీ పోలీసులు హైదరాబాద్ నుంచి దొంగిలించి, గుంటూరు పట్టుకు పోయి, నైటు కు నైటు ఎందుకు కుళ్ళ బొడిచారు? చట్టానికి తాము దొరికిపోతామనే ‘భయం ‘ లేకపోవడం వల్ల.
సీఐడీ అప్పటి చీఫ్ సునీల్ కుమార్ అనే పోలీసు అధికారి ఎందుకు అంత బరి తెగించారు? తాను ఎప్పటికైనా చట్టానికి జవాబుదారీ కావలసి ఉంటుందనే ‘భయం ‘ లేకపోవడం వల్ల. గౌతమ్ సవాంగ్ అనే నార్త్ ఈస్ట్ పోలీసు ఆఫీసర్ కు వైసీపీ ప్రభువులు చట్టం అంటే భయం పోగొట్టడం వల్లే….ఆయన చట్టం, సిగ్గు శరం, గౌరవం అనే బట్టలు వదిలేసి…. ఊరేగారు. తన తోటి పోలీసు ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వర రావు సంతకాలను ఫోర్జరీ చేయడానికి కూడా వెనుకాడలేదు. చివరకు జనానికి ఉన్న మద్యం బలహీనతను అడ్డం పెట్టుకుని వేలాది కోట్లు లూటీ చేసి పెద్దమనుషులుగా చలామణి అవుదామని జగన్ & కో ఎందుకు బరి తెగించారు?
చట్టానికి ఎప్పటికైనా దొరుకుతామనే ‘భయం ‘ లేకపోవడం వల్లనే కదా!. జైలు మొహం చూడాల్సి వస్తుందనే ‘భయం’ అస్సలు లేకపోవడం వల్ల. సమస్త పోలీసు అరాచకాలకు ప్రధాన కారణం ఏమిటి? చట్టం అంటూ ఒకటి ఉంది, జాగ్రత్తగా ఉండాలి అనే ‘ స్పృహ ‘ లేకపోవడం వల్ల. ప్రభుత్వ ఉద్యోగులు…. ఒకపక్క వేలకు వేలు…. లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ కూడా సిగ్గొదిలేసి, లజ్జొదిలేసి,మానాభిమాలొ దిలేసి లంచాలతో తోటి మనుషులను, నిస్సహాయులను ఎందుకు పీడించుకు తింటున్నారు?ఎందుకు కుళ్లబొడుస్తున్నారు? దొరికిపోతామేమో అనే ‘ భయం’ లేకపోవడం వల్లనే కదా! రౌడీ షీటర్లు దర్జాగా వైట్ & వైటు డ్రస్సు, మెళ్ళో పెద్ద నులక తాడు లాటి బంగారు గొలుసు, బ్రేస్ లెట్, నాలుగైదు ఉంగరాలు, రేబాన్ కళ్ళ జోడు, నైక్ షూ తో పౌర సమాజం లొ ఎలా సిగ్గొదిలేసి తిరగ గలుగుతున్నారు? పోలీసులు గానీ, పౌర సమాజం గానీ తమను కట్టడి చేయగలరేమో అన్న ‘ భయం ‘ ఏ కోశానా వారికి లేనందు వల్ల కాదూ!?పోలీసులూ మనుషులే కదా! వారూ లంచాలయ్య లే కదా! రేపులు… ఎల్లుండులు, మర్డర్లు,, దౌర్జన్యాలు, ఫోర్జరీలు చేసే వారు గానీ… వారితో ఆ దుర్మార్గాలు చేయించేవారు గానీ…. ఎందుకు చేయిస్తున్నారు? చట్టం తమను ఏదో చేసేస్తుందేమో అన్న ‘భయం ‘ వారికి పొరపాటున కూడా లేక పోవడమే కారణం కదా! . కదిరి నుంచి గొడ్డలి ఒకటి పులివెందుల వచ్చి , వై ఎస్ వివేకానంద రెడ్డిని విచ్చలవిడిగా నరికి పోగులు పెట్టి దర్జాగా వెళ్ళిపోయింది.
అంటే…కారణం ఏమిటి ? తన వంక చట్టం కన్నెత్తి చూడడానికి దానికి ఎంత ధైర్యం అనే ధీమానే కదూ!? అసలు ఆ ‘ భయమే’ లేకపోవడం గొడ్డలి రక్తం లోనే లేదు ! పరకామణి చోరీ, ఆ తరువాత జరిగిన సెటిల్మెంట్ల కు కారణం ఏమిటి? చట్టానికి దొరికి పోతాం అనే ‘ భయం ‘ లేకపోవడమే కదా! చట్టం అనేది ఒకటి ఉన్నదనే భావనే ఇప్పుడు జనానికి కలగడం లేదు.ఏ రకమైన తప్పుడు పని చేసినా దొరికిపోతామనే ‘భయం’ ఏ వర్గం వారిలోనూ కూడా కనపడక పోవడం వల్లనే …. సమాజం…. సమస్త అరాచకాలు , అక్రమాలు , దోపిడీలు, అనర్ధాలతో నిండిపోయింది. చట్టం ఉన్నదనే ‘ భయం ‘ ఉద్యోగులకు లేదు…. పోలీసులకు లేదు…. పొలిటికల్ క్లాస్ కు లేదు. ప్రభుత్వం మీద పడి బతికే ఏ కేటగిరీ మనుషులకూ లేదు. కంట్రాక్టర్లకూ లేదు. అందరూ వైట్ & వైటే. రేబాన్ కళ్ళ జోళ్ళే. నైక్ షూసే. మెళ్ళో గొలుసులే. నోరు తెరిస్తే నీతులే.
తలకు నల్ల రంగులే. చట్టం అంటే ‘ భయం ‘ లేనందువల్ల ; పోగేసిన పెంట కుప్ప చుట్టూ కంచి పట్టు చీర కప్పి, దాని మీద సెంటు స్ప్రే చేసినట్టుగా…సమాజం తయారైంది. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వానికి ఒక ఆస్తిత్వం అంటూ ఏమీ ఉండదు. అదొక భావన. అదొక మిధ్య అని సాక్షాత్తు ఎన్ టీ రామారావు చెప్పారు. ఆ భావనకు ప్రాతినిధ్యం వహించే పాలకులైన ప్రజాప్రతినిధులు. ప్రభుత్వంలో పని చేసే వారిపై అదుపు ఉండదు. లంచాలు తీసుకోవద్దు అని చెప్పే ధైర్యం ఉండదు. లంచాలు, కమిషన్లు, డబ్బు సంపాదన కోసం ఇతర మార్గాలు తొక్క వద్దని తోటి పొలిటికల్ క్లాస్ కు చెప్పే నైతికత పాలకులకు ఉండదు.
ఎందుకంటె, ఎన్నికల్లో పోటీ చేద్దామనుకునే వారికి ఇచ్చే టికెట్లను వారు అమ్ముకుంటారు, పదవులను అమ్ముకుంటారు. ఎం ఎల్ సీ పదవులను అమ్ముకుంటారు. రాజ్యసభ సభ్యత్వాలను అమ్ముకుంటారు. కాంట్రాక్టులను అమ్ముకుంటారు. అందినంత దండుకోడానికి పెద్ద పెద్ద భారీ…. ఎప్పటికీ పూర్తికాని అతి భారీ ప్రాజెక్టు ల కోసం వెంపర్లాడుతుంటారు. ఇందుకోసమే కోట్లకు కోట్లు ఎన్నికల్లో దారపోసి, ప్రభుత్వ యంత్రాంగం పై పెత్తనం చేసే హక్కు ను కైవసం చేసుకునేది. నియోజక వర్గానికి ఓ యాభై లక్షలు మించి ఖర్చు పెట్టాగుడదు అని ఎన్నికల నిబంధనలు ఉంటే… ఏ ఒక్కరైనా ఈ నిబంధన పాటించారా? అంటే, అక్రమ మార్గం లోనే కదా ఈ రాజకీయ వాదులు అధికారం చేజిక్కించుకున్నది!? చివరికి అధికారం లో ఉండేది ఐదేళ్లు. ఈ ఐదేళ్ళల్లో ఎంత పోగేస్తామన్నదే లెక్క.
అందుకే, వైసీపీ అధికారం లో ఉన్నప్పుడు ఆ స్థాయి దోపిడీ, ఆ స్థాయి దౌర్జన్యాలు. ఆ స్థాయి కుమ్ముళ్లు. ఇలా ; పాలకుల వెంపరలాటలో పాలకులు ఉంటే…. ప్రభుత్వ ఉద్యోగులు…. వారి వెంపర్లాటలో వారు ఉన్నారు. అందరూ ‘నిప్పే ‘ ఎవర్నీ ముట్టుకోడానికి లేదు . ఎవర్ని కాల్చేద్దామా అని వెదుకులాట. అందుకే, చట్టం అంటే భయం లేకుండా పోతున్నది. ఒక వేళ, పొరపాటున, బై మిస్టేక్… దొరికినా…. నాలుగు రోజులు జైలు లో కాలక్షేపం. అక్కడ కూడా మనుగుడుపు పెళ్ళికొడుకులను చూసినట్టు చూసుకునే జైళ్ళ పాలకులు. ఏసీ ఉండాలి. దోమ తెరలు ఉండాలి. ఇంటిదగ్గర నుంచి క్యారేజ్ రావాలి. చదువుకోడానికి న్యూస్ పేపర్ లు ఉండాలి.
వళ్ళు కాస్తంత వేడెక్కడానికి ‘స్వాతి’ వీక్లీ ఉండాలి. కాళ్ళు పిసకడానికి ఓ ఇద్దరు అటెండర్లు ఉండాలి. స్నానానికి వేన్నీళ్ళు పెట్టాలి. వళ్ళు తోం కోడానికి మైసూర్ శాండిల్ గోల్డ్ సబ్బు కావాలి. మాసాజ్ కి మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం లో ఓ పదిహేను రోజుల విశ్రాంతి కావాలి. ఓ నెల పోయాక బెయిల్ కావాలి. బెయిల్ వచ్చాక, ఇక ఛార్జ్ షీట్ వేయాల్సిన పని లేదు. ఇలాటి పొలిటికల్ క్లాస్…. చట్టాన్ని ఎలా అమలు చేస్తుంది? చట్టం అంటే ఎవరికి భయం ఉంటుంది? అందుకే…. యధాః రాజా తధాః ప్రజా అన్నట్టుగా… మొత్తం సమాజానికి చట్టం అంటే దమ్మిడీ విలువ లేకుండా పోతున్నది. అందుకని చట్టమే అన్నీ మూసుకుని, పోలీస్ లాకప్ సెల్ లో దూరి ; తనకు తాను లాకప్ చేసేసుకుంటున్నది, నూటికి తొంబై సందర్భాలలో .

– భోగాది వేంకట రాయుడు.