– ఏపీసీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శ
విజయవాడ : చెప్పేవి శ్రీరంగనీతులు..చేసేవి దొంగ పనులు అన్నట్లుంది కూటమి ప్రభుత్వం తీరు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీఈఆర్సీ ప్రతిపాదనలకు.. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలకు పొంతనే లేదు. రూ.15651కోట్ల మేర ఛార్జీల వడ్డనకు నియంత్రణ మండలి సర్వం సిద్ధం చేస్తుంటే, బిల్లుల పెంపుపై ప్రజాభిప్రాయానికి ప్రకటన కూడా ఇచ్చేస్తే.. ఇంకా చార్జీలు భారం పడదని చెప్పే చంద్రబాబు మాటలు పాత చింతకాయ పచ్చడితో సమానమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఇప్పటికీ అనడం తీవ్ర హాస్యాస్పదం. అధికారం చేపట్టిన ఏడాదిన్నరలోనే జనాలకు సర్దుబాటు పేరుతో గుండెపోటు తెప్పించారు. రూ.15 వేల కోట్ల మేర ట్రూ అప్ బిల్లులతో జనాల జేబులకు చిల్లులు పెట్టారు. ఇప్పుడు మరో రూ.15 వేల కోట్లకు టైం ఆఫ్ ది డే పేరుతో దోచేందుకు కసరత్తు చేస్తున్నారు. నమ్మి ఓటేసిన పాపానికి రాష్ట్ర ప్రజలకు ఏడాదికో హైటెన్షన్ షాక్ పెడుతున్నారు. లోటు పేరుతో జనాలను బాదడం అత్యంత దారుణం.
ముఖ్యమంత్రి చంద్రబాబుని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నిజంగా కరెంట్ ఛార్జీలు పెంచొద్దని చిత్తశుద్ధి మీకుంటే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నిలబడే తత్వమే మీదైతే, ఏపీఈఆర్సీ రూపొందించిన ప్రతిపాదనలపై తక్షణం స్పందించండి. రూ. 15 వేల కోట్ల భారాన్ని ప్రభుత్వం భరిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేయండి. ఇప్పటి వరకు ప్రజలపై మోపిన మరో రూ.15 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను సైతం రద్దు చేయండి.