– ఈ 18 నెలల కాలంలో ఒక్క పాస్ బుక్ అయినా ఇవ్వగలిగారా?
– మీరు ఏ వేదిక మీదకు రమ్మన్నా చర్చకు నేను సిద్దం
– రెవెన్యూశాఖ సమీక్షకు ఏడాదిన్నర టైం తీసుకున్న సీఎం
– పేదల పట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం
– భూసర్వేపై అబద్దాలు చెప్పి ప్రజలతో ఓట్లేయించుకున్న టీడీపీ
– 18 నెలలుగా నిల్చిపోయిన భూసర్వే కార్యక్రమం
– వైయస్.జగన్ హయాంలో సచివాలయాల ద్వారా ప్రజల చెంతకే సేవలు
– నేడు ఎమ్మెల్యేల చేతుల్లో ఎమ్మార్వో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
– అడ్డూ అదుపూలేని అధికార పార్టీ దోపిడీ
: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం
శ్రీకాకుళం: తన రాజకీయ జీవితంలో సీఎం చంద్రబాబు ప్రజలకు, పేదలకు ఉపయోగపడే ఒక్క సంస్కరణ కూడా చేయలేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. 18 నెలల పాలనలో పేదల కోసం ఒక ఎకరా భూమి కూడా కొనుగోలు చేయలేదు సరికదా… పేదలను కొట్టి పెద్దలకు పంచడమే నైజంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ… రెవెన్యూశాఖ పై సమీక్ష చేయడానికి ఏడాదిన్నర టైం తీసుకోవడమే సీఎం చంద్రబాబుకు పేదల పట్ల, వారి సంక్షేమం పట్ల తీరుకు నిదర్శమని తేల్చి చెప్పారు 1977 తర్వాత రాష్ట్రంలో రైతులకు వైయస్.జగన్ ప్రభుత్వంలోనే మేలు జరిగిందన్న ధర్మాన… 2020లో వైయస్.జగన్ తీసుకొచ్చిన భూసంస్కరణల వల్లే పేదలకు మేలు జరిగిందని తేల్చి చెప్పారు.
గ్రామకంఠం, చుక్కల భూముల వంటి ప్రజల రెవెన్యూ వివాదాల పరిష్కారానికి శాశ్వత కృషి చేసిన వైయస్.జగన్.. సమగ్ర భూసర్వే ద్వారా 10 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేయడం తో పాటు, 30 లక్షల మందికి పట్టాలు పంపిణీ చేశారని స్పష్టం చేశారు. అయితే భూసర్వేపై అబద్దాలు చెప్పి ప్రజలతో ఓట్లేయించుకున్న టీడీపీ హయాంలో 18 నెలలుగా భూసర్వే కార్యక్రమం నిల్చిపోవడంతో … ఒక్క పట్టాదారుపాస్ బుక్కూ మంజూరు చేయలేదని మండిపడ్డారు. ఎమ్మార్వో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో అడ్డూ అదుపూలేని దోపిడీకి చిరునామాగా మారాయని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర తర్వాతైనా రెవెన్యూశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించడం సంతోషం. సాధారణంగా జరిగే కార్యక్రమమే అయినా… దీన్ని చేయడానికైనా సీఎంకు సంవత్సరమున్నర కాలం పట్టింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూశాఖను సమూలంగా సంస్కరించాలంటున్నారు.
2019 నుంచి 12 సంవత్సరాల ముందు వరకు ఆ భూములపై ఉన్న రైతులకు పట్టాలిచ్చే కార్యక్రమం చేశాం. ఇది ఓ గొప్ప నిర్ణయం. వంద సంవత్సరాల్లో పరిష్కరించలేని సమస్యను వైయస్.జగన్ ప్రభుత్వం తీర్చింది. దీనివల్ల ఆయా భూములను రైతులు బ్యాంకుల్లో కుదవపెట్టి రుణాలు తీసుకుని, పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం వచ్చింది. తద్వారా మార్కెట్ లోకి మరలా పెట్టుబడికి అవకాశం, కొంతమందికి ఉపాధి కలిగింది. దీనిపై ప్రస్తుతమున్న చంద్రబాబు ప్రభుత్వానికున్న అభ్యంతరం ఏమిటి?
1952 తర్వాత 2019లో ఏర్పడిన వైయస్.జగన్ ప్రభుత్వంలో మరలా భూపంపిణీ చేపట్టడం జరిగింది. అంతే కాకుండా ఆ భూమి పిల్లల చదువులు వంటి వారి ఇతర అవసరాలు తీర్చుకునేందుకు అమ్ముకునే అవకాశం ఇవ్వాలని కోరితే.. వైయస్.జగన్ ప్రభుత్వంలో దానికోసం పెద్ద ఎత్తున కసరత్తు చేశాం. అన్ని రాష్ట్రాల్లో ఇలా ఇచ్చిన భూములను క్రయవిక్రయాలకు జరపడానికి అవకాశం ఇచ్చిన సందర్భంలో…. మన రాష్ట్రంలో కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ మంత్రిగా ఆ చట్టసవరణ నేనే చేశాను. దీని కోసం ఏర్పాటైన కమిటీ నివేదిక ను కేబినెట్ ఆమోదిస్తే… వైయస్.జగన్ ప్రభుత్వంలో వాటిని అమలు చేశాం.
అందులో ఏం తప్పు ఉంది? ఏడాదిన్నరగా దాన్ని నిలిపివేశారు. అంటే ఈ రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈనాడు వైయస్.జగన్ ప్రభుత్వం తప్ప పేదలకు ఉపయోగపడే విధంగా రెవెన్యూ సంస్కరణలు, వారికి ఉపయోగపడే ఏ చట్టాన్ని అయినా మీ ప్రభుత్వం తేగలిగిందా? రెవెన్యూ మంత్రిగా పనిచేశారు, నాలుగుసార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునే మీరు మీ హయాంలో పేదలకు అనుకూలంగా ఒక్క నిర్ణయమైనా చేయగలిగారా?.
సాధారణ రైతులకు, పేదలకు మేలు జరిగే నిర్ణయాలు మీరు ఒక్కటైనా చేశారా? 1977 తర్వాత మరలా 2020 వరకు వైయస్.జగన్ హయాంలో తప్ప రైతులకు మేలు జరిగే రెవెన్యూ సంస్కరణలు ఎవరైనా చేశారా? వాటన్నింటినీ వక్రీకరించి మీరు ఎన్నికల్లో ఓట్లు సంపాదించవచ్చు, కానీ మీ గుండెల మీద చేయి వేసుకుని సమాధానం చెప్పండి? ప్రజల కోసం మీరు తెచ్చిన సంస్కరణ ఒక్కటైనా ఉందా? మీరు ఏ వేదిక మీదకు రమ్మన్నా, చర్చకు నేను సిద్దంగా ఉన్నాను.
మీరు అధికారంలో ఉన్నప్పుడు రిజిష్ట్రేషన్ యాక్ట్ లో ఉన్న 22 ఏ నోటిఫికేషన్ పెట్టి గందరగోళం సృష్టించారు. చాలా వారకు వాటిని ఇవ్వడానికి మేం ప్రయత్నం చేస్తే.. మీరు కేసులు పెట్టి అధికారులను బెదిరించి ఇవ్వడం వల్ల.. ఏ ఒక్క అధికారి 22ఏ నుంచి ప్రాసెస్ చేసి ఇవ్వడానికి భయపడి, ఆగిపోయారు. ప్రతి జిల్లాలో మేము ఎంత మానిటరింగ్ చేసినా చేయలేని పరిస్థితి క్రియేట్ చేశారు.
22 ఏ లో పెట్టడం అంటే.. అది పూర్తిగా ప్రభుత్వ భూమి, దానిలో ఏ కార్యక్రమం జరగకుండా అలా ఎన్ని సంవత్సరాలు ఉంచుతారు? ఈ ఏడాదిన్నరలో మీరు చేసిన ప్రయత్నం లేదు. మీరు ఎంపిక చేసుకున్న రైతులకు రకరకాల చేతులు మారుతున్న తర్వాత చేశారు. మీరు కొత్తగా ఏం చేయలేదు, మేం తెచ్చిన సంస్కరణలను వేటినీ అమలుచేయడం లేదు. మీ మూడోవంతు ప్రభుత్వ కాలం పూర్తైనా… సంస్కరణలు చేసిందేమీ లేదు. భూములు విలువ పెంచడం తప్ప మరేం లేదు. సర్వే కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఏదైనా లోపాలుంటే చూపించండి. ఏదో క సాగు చూపించి… మీకున్నమీడియా సాధనాలు ద్వారా ప్రజలను భయకంపితులను చేసి ఎన్నికల్లో ప్రయోజనం పొందడం మినహా మీరు చేసిందేమీ లేదు.
భూమికి సంబంధించి మీరు అనుసరిస్తున్న విధానాలు చాలా తప్పుగా నడుస్తున్నాయి. ఎమ్మార్వో కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లిపోయాయి. మీరు అనుసరిస్తున్న విధానాలు చాలా తప్పు. ఎమ్మెల్యే పర్మిషన్ లేనిదే అధికారులను బెదిరించే పరిస్థితికి మీ ప్రభుత్వం దిగజారింది. వ్యవస్థలు వ్యక్తుల చేతుల్లోకి పరిపాలన దిగజారిపోయింది. ఏ కార్యాలయానికి వెళ్లినా.. మీ ఎమ్మెల్యేకు చెప్పారా? లేదా? ఆక్కడ డబ్బులిచ్చుకుని రా అన్న పరిస్థితికి వ్యవస్థలు దిగజారిపోయాయి.
ఇటీవల నిర్వహించిన సర్వేలో 80 శాతం మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లోకి వెళ్లిపోయారు. మీరు ప్రజలను తక్కువగా అంచనా వేస్తున్నారు. ఇదేనా మీ పరిపాలన? నాలుగోసారి సీఎం అని చెప్పుకుంటున్న మీరు ఒక ఎకరం భూమైనా సేకరించి పేదలకు ఇవ్వగలిగారా?
వైయస్.జగన్ హయాంలో 30 లక్షల మందికి అవసరమైన భూమిని కొనుగోలు చేసి పట్టాలిచ్చే కార్యక్రమం చేశారు. ఆ పట్టాల్లో ఏవి అమ్ముకుందామన్న ఆలోచన మీ కార్యకర్తల్లో ఉంది. ఎవరి పట్టాలు రద్దు చేద్దామా, ఎవరికిద్దామా అన్న ఆలోచనలో ఉన్నారు. ఇది నిరోధించే పరిస్థితి లేదు.
శ్రీకాకుళం జిల్లాలోనే చూస్తే… వంశధార చేయగలిగారా? ఒక బ్రిడ్జి అయినా పూర్తి చేయగలిగారా? ప్రజలు మీకు 50 ఏళ్లు అధికారం ఇచ్చారా? అప్పుడే ఏడాదిన్నర కాలం పూర్తైంది. మీ ఇంట్రస్టులు మీకు ఉన్నాయి. రూ.2.65 లక్షల కోట్లు అప్పు చేశారు. ప్రతి ఏటా రూ.2లక్షల కోట్లు బడ్జెట్ ప్రొవిజన్ ఉంది. అంటే రెండేళ్లలో రూ.4 లక్షల కోట్లు మీరు అప్పు చేసిన రూ.2.65 లక్షల కోట్లు అప్పు కలిసి మొత్తం రూ. 6.65 లక్షల కోట్లలో మా శ్రీకాకుళం జిల్లాలో మీరు చేసిన కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ కనీసం రూ.500 కోట్లు చూపించగలరా?
ఆముదాలవలస రోడ్డు ఆగిపోయిందని అన్ని విమర్శలు చేశారు. రూ.40 కోట్ల ఇవ్వలేకపోయారు. అన్ని వార్తలు రాశారు, పేమెంట్ ఇవ్వలేకపోయారు. గార బ్రిడ్జి పూర్తి కాలేదు. కలెక్టరేట్ పూర్తి కాలేదు. ఒక్క నిర్మాణం ప్రారంభించి పూర్తి చేయగలిగారా? శ్రీకాకుళం జిల్లాను ఒక ఉదాహరణ కోసమే చెప్పాను. మీకు మాయమాటలు చెప్పడం మినహా, సంస్కరణలు చేయడం మీకు చేతగాదు. సర్వే వల్ల గ్రామాల్లో వివాదాలతో చితికిపోతున్న అనేక కుటుంబాలకు మేలు జరుగుతుంది. 5 సెంమీ కంటే తేడా లేని విధంగా సర్వే చేశాం. దాన్ని నిలిపివేశారు.
మాజీ రెవెన్యూ మంత్రిగా మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. పట్టాదారుపాస్ పుస్తకం నిలిపివేసిన తర్వాత… ఈ 18 నెలల కాలంలో ఒక్క పాస్ బుక్ అయినా ఇవ్వగలిగారా? ఒక్క సంస్కరణ అయినా తెచ్చామని చెప్పగలరా? పేదల భూముల్ని పెద్ద వాళ్లకి ఇచ్చే కార్యక్రమంలో నిమగ్నులవ్వడం తప్ప, పేదలకు, సామాన్య రైతులకు మీరేం మేలు చేయలేదు. అది మీకు సంతోషాన్నివ్వవచ్చు.
ఒకొక్కరు తమ నియోజకవర్గాన్ని రాజ్యాంగా భావించి నాశనం చేశారు. అందరూ రెడ్ జోన్ లోనే ఉన్నారు. ఏ క్షణాన ఎన్నిక జరిగినా మిమ్మల్ని ప్రజలకు తిరస్కరించడం ఖాయం. దివంగత నేత వైయస్సార్ హయాంలో ఏడు విడతలుగా 7 లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేశాం.