(మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి… పిసిసి చీఫ్‌గా ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారన్నది పక్కనపెడితే.. సినిమా కార్మికుల సన్మానసభలో ఇచ్చిన హామీ మాత్రం నిలబెట్టుకుని, వారి పెదవులపై చిరునవ్వులు పూయించారు. అదేమింటంటే ఏదైనా పెద్ద హీరో లేదా పెద్ద సినిమాకు టికెట్ రేట్లు పెంచినప్పుడు అందులో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలని, అలాగైతేనే సినిమా టికెట్ల రేట్లు పెంచుతామని షరతు విధించారు. అన్నట్లుగానే.. బాలకృష్ణ సినిమా నుంచి దానిని అమలుచే సి, అందరితో శహభాషనిపించుకున్నారు.
నిజంగా ఇది దేశ చలనచిత్రరంగంలోనే అద్భుతం, అనితర సామాన్యం. కోట్లు సంపాదించుకుంటున్న నిర్మాతల ఆదాయంలో ఓ 20 శాతం అదే సినిమాలకు పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి వారి నుంచే ఇప్పించడం ఒక వినూత్న-మానవీయ ప్రయోగం. ఏదేతేనేం.. రేవంత్ సినిమా వాళ్ల మెడలు వంచారు. ఇది బహు బాగు. రావుగోపాలరావు భాషలో చెప్పాలంటే.. సినిమా కార్మికులు ఆల్ హ్యాపీసు.
అదే చేత్తో జర్నలిస్టులకు సంబంధించి వేతన సమస్యలపైనా ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంటే.. జర్నలిస్టులకూ డబుల్ హ్యాపీసు! సపోజ్.. పర్ సపోజు.. కొత్త సినిమాలకు రేట్లు పెంచాలంటే సినిమా కార్మికులకు అందులో 20 శాతం ఇవ్వాలని షరతు విధించినమాదిరిగానే.. జర్నలిస్టులకు ప్రతినెలా జీతాలిచ్చిన వారికే ప్రభుత్వ ప్రకటనలు ఇస్తామని..ఆ మేరకు తమ మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులందరికీ జీతాలిచ్చినట్లు ప్రతి నెల బ్యాంకు స్టేట్మెంట్లు తీసుకున్న తర్వాతనే ప్రకటనలిస్తామన్న షరతు విధిస్తే, రేవంత్‌ను దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు అనుసరించడం ఖాయం.
అదేమీ పెద్ద కష్టం కాదు. సమస్య అంత కంటేకాదు. కాకపోతే కావలసింది దమ్ము, దైర్యం. ఆ రెండు రేవంత్‌కు ఉన్నాయని, కొత్త సినిమా షరతు విషయంలో రుజువయింది. అంటే ఈ పాలిసీని అమలు చేస్తే-గీస్తే ఒక్క రేవంత్ మాత్రమే చేయాలి. మరెవరూ ఆ సాహసం చేయడం దుర్లభం.
ఎందుకంటే తాను సీఎంగా ఉన్నంతవరకూ, దిగిన తర్వాత.. తన గురించి చరిత్ర చెప్పుకోవాలని రేవంత్ తరచూ చెబుతుంటారు. మరిప్పుడు ఆ చరిత్ర సృష్టించే అవకాశాన్ని రేవంత్ సద్వినియోగం చేసుకుంటారా? లేక మీడియా అధిపతులతో ఎందుకొచ్చిన పంచాయితీలెమ్మని మౌనంగా ఉంటారో చూడాలి.
గతంలో ఓసారి రేవంత్.. పాలు-నీళ్లను విడదీసినట్లు, నిజమైన జర్నలిస్టులెవరో తేల్చాలని జర్నలిస్టు యూనియన్లకు సూచించారు. వెనకటికి ఒక ముతక సామెత చెప్పినట్లు.. అసలు ఆ జర్నలిస్టు సంఘ నాయకులు నడిపే పత్రికలు, నాయకులు పనిచేసే మీడియా సంస్థలే జీతాలిస్తున్న దిక్కులేదు.
జర్నలిస్టులకు ఎందుకు జీతాలివ్వడం లేదని మీడియా సంస్థల కార్యాలయాలకు వెళ్లి లెక్చర్లు ఇచ్చి, వారిని భయపెట్టి వారి నుంచి పోస్టుడేటెట్ చెక్కులు ఇప్పించిన యూనియన్ నేతలు.. తాము నడిపే పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులకు మాత్రం నెలల తరబడి జీతాలివ్వకపోవడమే కామెడీ. ఇంకా జర్నలిస్టు హక్కులు-జీతాలపై ఫోజులు కొట్టే కొందరు యూనియన్ లీడర్లు.. తాము పనిచేసే మీడియా సంస్థల్లో జర్నలిస్టులకు నెలల తరబడి జీతాలివ్వకపోయినా ఇదేమి అన్యాయమని నిలదీస్తున్న పాపాన పోవడం లేదు. ఇలా హక్కులపై నిలదీయకుండా నవరంధ్రాలూ మూసుకున్న జర్నలిస్టు సంఘ నాయకులు.. ప్రెస్‌క్లబ్, జిల్లా కార్యవర్గ సమావేశాల్లో మాత్రం జర్నలిస్టు సంక్షేమానికి కృషి చేస్తామంటూ వేదికలపై రక్తవిరేచనాలు, వాంతులు చేసుకోవడమే వింత.
సినిమాలను నైజాం, సీడెడ్ ఏరియాల మాదిరిగా అమ్మేసినట్లు.. ఇప్పుడు చాలా పత్రికలు, చానెళ్లు జిల్లాలను వేలం వేసి అమ్మేసుకుంటున్నాయి. ఈ వేలంలో ఏ దావూద్ ఇబ్రహీం లాంటివాడో పాల్గొని, జిల్లాను లక్ష రూపాయలకు పాడుకున్నా అడిగే దిక్కులేదు. అంటే మేనేజ్మెంట్లకు నెలకు ఇంత డబ్బులు చెల్లిస్తే, వాళ్లే నెలకు ఇన్ని కాపీలని సదరు కొనుగోలుదారుకు పంపిస్తారు.
వాటిని సదరు జర్నలిస్ట్ ఫ్రాంచైజరు… టౌన్, రూరల్ కంట్రి బ్యూటర్ల హోదా కోసం వేలం వేసి.. ఆ ఏరియాను ఎవరు ఎక్కువ పాడుకుంటే వారికి ఆ హోదాతోపాటు, అక్రిడెటేషన్ కార్డు ఇవ్వాలని కలెక్టర్లకు రాస్తారు. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులకంటే.. వేలంలో వేసే ఈ కంట్రిబ్యూటర్ల హోదాకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది మరి! నిజానికి ఇది కంట్రిబ్టూర్లకు వల వేసే తిరుగులరేని సాధనం.
బస్టాండ్లు-రైల్వేస్టేషన్ల సమీపంలో.. మడతమంచాలు అద్దెకివ్వబడును. గీజరు-వైఫై సౌకర్యం కూడా కలదు. అనే పెద్ద బోర్డులు కనిపిస్తుంటాయి. సేమ్ టు సేమ్.. మొన్నామధ్య కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో చూశా. మా పేపరుకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉంది. లైసెన్సు కూడా ఉంది. అక్రిడెటేషన్ సౌకర్యం కూడా ఉంది. కాబట్టి మా పత్రికలో చేరాలనుకునే ఉత్సాహవంతులు ఇన్ని వందల రూపాయలు చెల్లిస్తే, వారికి గుర్తింపు కార్డు ఇవ్వబడును. రిపోర్టరు కావాలనుకున్న వారే ఫోన్ చేయండి. టైమ్ పాస్ కోసం ఎవరూ ఫోన్ చేయవద్దు అన్న ప్రకటనలు చూస్తే.. జర్నలిజంపై జాలి పడక తప్పని విషాదం. అది వేరే కథ.
మరి ఇన్ని రకాలుగా జర్నలిస్టుగిరీ కోసం డబ్బులు పిండుకుంటున్న మీడియా సంస్థలు, తమ వద్ద పనిచేసే జర్నలిస్టులు.. అంటే స్టాఫ్ రిపోర్లర్లు, డెస్కులో పనిచేసే సబ్ ఎడిటర్లకు క్రమం తప్పకుండా జీతాలు ఇస్తున్నాయా అంటే అదీ లేదు. నెలల తరబడి జీతాలివ్వకుండా వేధిస్తున్న అమానవీయం. పోనీ మానేద్దామంటే, పనిచేసిన కాలానికి జీతాలివ్వరన్న భయం జర్నలిస్టులది!
వార్షికోత్సవాలు, సంక్రాంతి, దసరా, దీపావళితో పాటు న్యూ ఇయర్ క్యాలెండరు, డైరీల పేరుతో బాదేస్తున్న మీడియా సంస్థలు కనీసం వాటికోసం కష్టపడే జర్నలిస్టులకు, కమిషన్లు కూడా ఇవ్వని దయనీయం. మరి ఇంత దండుకుంటున్న మీడియా సంస్థలకు, జర్నలిస్టులకు సక్రమంగా జీతాలిచ్చేందుకు ఏం మాయరోగం?
ఇవన్నీ సో కాల్డ్ జర్నలిస్టు సంఘాలకు- నాయకులకూ తెలియవా?.. తెలుసు. కానీ వాళ్లూ మాట్లాడరు. ఎందుకంటే సదరు జర్నలిస్టు నాయకులు కూడా, అదే మీడియా సంస్థల్లో పనిచేస్తున్నారు కాబట్టి. ఈ వీరుల ప్రతాపమంతా ప్రభుత్వంపైనే తప్ప.. పనిచేసినందుకు జీతాలివ్వని యాజమాన్యాలపై చూపించరు. పొరపాటున ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని తీసేస్తారన్న భయం. కానీ ఈ ముఖాలే.. అక్రెడిటేషన్లు, ఇళ్ల స్థలాలు, ఇన్సూరెన్సులు, ఆరోగ్యశ్రీల కోసం సర్కారుపై సమరం సాగిస్తుంటారు. బ్రహ్మానందం మాదిరిగా ఇదో సీరియస్ కామెడీ!
అంతెందుకు? ఇటీవల హైదరాబాద్‌లో ఒక టీవీ సంస్ధ.. జర్నలిస్టులకు సక్రమంగా జీతాలివ్వడం లేదని ఒక జర్నలిస్టు యూనియన్ నాయకుడు, త మ సభ్యులను వెంటేసుకుని…సిబ్బందికి జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని, యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్తారా? చస్తారా అని గొంతుమీద కూర్చోవడంతో, పోస్టుడేటెడ్ చెక్కులిచ్చేందుకు ఆ సంస్థ అంగీకరించింది.
సీన్ కట్ చేస్తే.. శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు.. జర్నలిస్టులకు జీతాలివ్వాలని మరొక మీడియా సంస్థ ఆఫీసులో గత్తర చేసిన సదరు జర్నలిస్టు నాయకమ్మన్యుడు.. తాను నడిపే పత్రికలో పనిచేసే జర్నలిస్టులకు జీతాలివ్వక కొన్ని నెలలయిపోయిందట. మాకు రావలసిన జీతాల ముచ్చటేందని, ఆయన పత్రికలో పనిచేసే జర్నలిస్టులు, సిబ్బంది నిలదీస్తే.. ‘తప్పకుండా మీ జీతాలను పువ్వుల్లోపెట్టి ఇస్తాం. కానీ ఇప్పుడు కాదు. ఉన్నప్పుడు ఇస్తా’ మని చావు కబురు చల్లగా చెప్పారట. ప్రపంచానికి సుద్దులు చెప్పే జర్నలిస్టు నాయకుల సక్కదనమిదీ!
ఇక కొత్త అక్రెడిటేషేన్లు ఇవ్వాలంటూ గత్తర చేస్తున్న కొన్ని జర్నలిస్టు సంఘాలు.. తమ యూనియన్ జర్నలిస్టు ఉద్ధారకులు, పదవులు వెలగబెడుతున్నప్పుడే ఎందుకు సాధించలేదు? అన్నది జర్నలిస్టుల ఉవాచ. జర్నలిస్టులతో గొడ్డు చాకిరీ చేయించుకుని, జీతాలివ్వని మీడియా సంస్థలతో ప్రెస్ అకాడెమీ చైర్మన్లు ఎందుకు చర్చించరు? పాలకులతో కలసి వారిపై చట్టాలు ప్రయోగించి, ఎందుకు దారికి తీసుకురారన్నది ప్రశ్న.
సాంకేతికంగా ప్రెస్ అకాడెమీ చైర్మన్లకు, జర్నలిస్టులకు జీతాలిప్పించే బాధ్యత లేకపోవచ్చు. కానీ ఇప్పుడు చైర్మన్లుగా వెలగబడుతున్న వారంతా, అంతకుముందు జర్నలిస్టు యూనియన్లలో నాయకులుగా వెలగబెట్టిన జర్నలిస్టోద్ధారకులే కదా?.. సర్కారు పదవి రాకముందు జర్నలిస్టుల కోసం పిడికిలి బిగించిన ఆ వీరులు, పదవి వచ్చిన తర్వాత మౌనవ్రతం పాటిస్తే ఎలా అన్నదే లా పాయింటు!
చైర్మన్లుగా పదవీకాలం ముగిసిన తర్వాత మళ్లీ జర్నలిస్టు అవతారమెత్తి.. మళ్లీ జర్నలిస్టు హక్కుల కోసం గళమెత్తితే, నోటితో నవ్వరన్నది పాత్రికేయలోకం ఉవాచ. ఈ బాపతు నాయకమ్మన్యుల వ్యవహార శైలి, ఇప్పటికే నవ్విపోదురుకాక.. నాకేటి సిగ్గన్నట్లుందన్నది, అదే కలంవీరుల అదనపు ఉవాచ. తెలుగు పాత్రికేయాన్ని దశాబ్దాల నుంచి వెన్నాడుతున్న ఇదో దరిద్రం!
నిజానికి తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు క్రమం తప్పకుండా జీతాలిచ్చే మీడియా సంస్థలను వేళ్లపై లెక్కించవచ్చు. చానెళ్లలో ఎన్టీవీ, టీవీ 9, టీవీ 5, ఈటీవీ, సాక్షి, 10 టీవీ, ఏబీఎన్, టీ న్యూస్, వీ-6 మినహా.. మిగిలిన ఏ చానెళ్లూ జర్నలిస్టులకు సక్రమంగా జీతాలిచ్చే దిక్కు లేదు. ఇక పత్రికల్లో ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ మినహా ఏ ఒక్క పత్రిక జర్నలిస్టులకు క్రమం తప్పకుండా జీతాలివ్వని దుస్థితి.
మిగిలిన పత్రికల్లో పనిచేసే జర్నలిస్టుల జీతాల పరిస్థితి దైవాధీనం లారీ సర్వీసు! స్టాఫ్ రిపోర్టర్లు/కంట్రిబ్యూటర్లయితే యాడ్స్ తెచ్చుకుని సంపాదించుకోవాలి. సరే. మరి డెస్కుల్లో పనిచేసే సబ్ ఎడిటర్ల పరిస్థితి? వారు ఎలా బతకాలి? నెలకు ఇన్ని వేలు ఇస్తేనే రిపోర్టరు గిరీ, కార్డులూ గట్రాలూ ఇస్తారు. అక్రెడిటేషన్ కార్డుల అమ్మకాలు దీనికి అదనపు దందా. ఇదే ఇప్పటి నయా జర్నలిజం!
ఇటీవలి కాలంలో వస్తున్న వార్తలు, వీడియోలు పరిశీలిస్తే.. జర్నలిజం పేరుతో ఎంత విచ్చలవిడితనం పెరిగిందో అర్ధమవుతుంది. సరిహద్దుల వద్ద మైనింగ్-ఇసుక-మట్టి లారీలను ఆపి, వసూళ్లు చేస్తున్న విలేకరులను పట్టుకున్న ఫొటోలు.. యూట్యూబర్లు, చిన్నా చితకా పత్రికలు రింగుగా ఏర్పడి స్థానిక వ్యాపారులను బెదిరిస్తూ, అడ్డంగా దొరికి జైలు పాలవుతున్న వీడియోలు ఒక్కటి చాలు… జర్నలిస్టులను యాజమాన్యాలు ఏ స్థాయికి దిగజార్చాయో చెప్పడానికి! గతంలో ఎమ్మెల్యేలు, ఎస్పీలు ప్రెస్‌మీట్ పెడితే మహా అయితే పది మంది లోపు వచ్చే వారు. ఇప్పుడు హీనపక్షం 200 మంది విలేకరులు వస్తున్న వైచిత్రి. అందుకే చాలామంది ప్రెర్మీట్లు పెట్టడం మానేసి, ప్రెస్నోట్లు పంపిస్తున్న పరిస్థితి.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రెస్‌క్లబ్‌లలో ప్రెస్మీట్లు పెట్టాలంటే.. ప్రెస్‌మీట పెట్టిన వారి జేబులు చిల్లు పడాల్సిన భయానకం. ప్రెస్‌మీట్ ముగిసిన తర్వాత విలేకరుల బృంద నాయకుడొచ్చి.. ‘మేం ఇంతమంది ఉన్నాం. ఎంతిస్తార’ని బేరాలు ఆడటమే కాదు. దగ్గరుండి మరీ ఫోన్ పేలు చేయించుకుంటున్న అరాచకం. ఆ మధ్య కాలంలో విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నేను స్వయంగా చూసిన దృశ్యమిది.
పట్టణ-గ్రామీణ ప్రాంతాల్లో రెండు మూడు పత్రికలు- మరో రెండు మూడు చానెళ్లు మినహా, మిగిలినవేమీ గౌరవ వేతనాలు/లైన్ అకౌంట్లూ ఇవ్వడం లేదు. అందుకే జీవనభృతి కోసం చాలామంది స్థానిక జర్నలిస్టులు, ఇలా దోపిడీదారుల అవతారమెత్తుతున్న ఆందోళనకర పరిస్థితి. తప్పెవరిది? జీతాలివ్వకుండా.. మీరు ఎంత దోచుకున్నా ఫర్వాలేదు. మా టార్గెట్లు మాత్రం పూర్తిచేయాలన్న యాజమాన్యాలదా? మరొక పనిచేసుకోకుండా, ఈ దందానే బాగుందని ఈ రొచ్చులోనే కొనసాగుతున్న విలేకరులదా? బహుశా.. సీఎం రేవంత్‌రెడ్డి, గతంలో నిజమైన జర్నలిస్టులెవరన్న ప్రశ్న సంధించినట్లుంది! ఆయన ప్రశ్నలో తప్పు లేదు.
పోనీ ఈ బాపతు పత్రికల ప్రభుత్వ యాడ్ టారిఫ్ ఏమైనా చిన్న సన్నగా ఉంటుందా అంటే లేదు. పట్టుమని పదిమంది సబ్ ఎడిటర్లు, పదిమంది స్టాఫ్ రిపోర్టర్లు కూడా లేని పత్రికల యాడ్ టారిఫ్.. ఈనాడు-సాక్షి స్థాయిలో ఉంటుంది. 500 నుంచి 2 వేల కాపీలు ప్రింట్ చేసే ఈ బాపతు పత్రికల ఆదాయం మాత్రం కోట్లపైమాటే.
విజయవాడలో అయితే అసలు ఈ బాపతు పత్రికలకు.. భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా ఆఫీసులు కనిపించవు. కానీ ప్రభుత్వ ప్రకటనలతో మాత్రం కోట్లు సంపాదిస్తున్నాయి. 500 నుంచి 2 వేల కాపీలు ప్రింటు చేసే,చిన్నా చితకా పత్రికలకు సైతం ఈనాడు-సాక్షికి సమానంగా టారిఫ్ చెల్లిస్తున్న దారుణం. అసలు ఈ పత్రికలు ఒక్కోసారి ఐ అండ్ పి ఆర్ ఆఫీసులో కమిషనర్లకే కనిపించవు. మరికొన్ని కేవలం సమాచారశాఖ, సచివాలయం, విజయవాడలోని హెచ్ఓడి కార్యాలయాలకు మాత్రమే పంపిస్తుంటాయి. అంటే అన్ని కాపీలే ప్రింటు చేస్తాయన్నమాట. ఇదంతా సర్కారుకు తెలియదనుకోవడం అమాయకత్వం! అయినా పెద్దగా పట్టించుకోరు. కారణం.. ‘మామూలే’
ఇవి కాకుండా యాజమాన్యాల పైరవీలు అదనం! అంటే అసెంబ్లీ లైవ్ టెలికాస్టు హక్కులు, ఐ అండ్ పీఆర్‌తో కాంట్రాక్టులు, వగైరాలన్నమాట!! పైగా ఎవరికివారు రాజగురువులవ్వాలనే ఆశ. మరి జర్నలిజం ముసుగులో ఇన్నేసి కోట్లు సంపాదిస్తున్న మీడియా సంస్థలు, తమ సంస్థలో పనిచేసే జర్నలిస్టులకు క్రమం తప్పకుండా జీతాలు ఎందుకివ్వవు?
అందుకే సీఎం రేవంత్‌రెడ్డి.. జర్నలిస్టుల జీతాల విషయంలో, సినీ కార్మికులకు చేసినట్లే.. ఒక వినూత్న కమ్ సాహసోపేత నిర్ణయం తీసుకుంటే ఆయన పుణ్యం ఊరకపోదు. దేశంలోని జర్నలిస్టులకే కాదు. దేశం లోని అన్ని రాష్ట్రాలకూ ఒక ఆదర్శంగా చరిత్రలో చిరస్ధాయిగా నిలిచిపోతారు. ఆలోచించండి!
అదెలాగంటే.. ఇప్పుడు కొత్త సినిమా రేట్లు పెంచాలంటే అందులో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమ నిధికి ఇవ్వాలన్న షరతు విధించినట్లే… మీడియా సంస్ధలకు సైతం.. ‘‘మీకు అన్ని రకాల ప్రభుత్వ ప్రకటలు ఇవ్వాలంటే, మీ సంస్ధలో పనిచేసే జర్నలిస్టులు, సిబ్బందికి ప్రతి నెల జీతాలివ్వాల’’ని స్పష్టం చేయాలన్నమాట. ఆ మేరకు జర్నలిస్టులకు జీతాలిచ్చిన ధృవీకరణ పత్రాలను, సమాచార శాఖకు సమర్పించాలన్న షరతు విధిస్తే.. ఈ ప్రయోగం విజయవంతమయి తీరుతుంది.
కాకపోతే దానికి కావలసిందల్లా.. దమ్ము-ధైర్యం కమ్ చిత్తశుద్ధి! అది రేవంత్‌కు మాత్రమే ఉందన్నది మొన్నటి సినీ కార్మికుల విషయంలో నిజమయింది.
* * *
ఇది తెలంగాణకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఏపీలోనూ ఇదే విషాదం. మరి అన్నీ అవే మూతులు- ముఖాలు కదా? సంస్కరణలతో దూకుడు మీదున్న సీనియర్ నాయకుడయిన.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా ఇదే పద్ధతి అనుసరిస్తే, జర్నలిస్టుల హృదయ విజేతలవుతారు.
* * *
అసలు ప్రెస్ అకాడెమీ చైర్మన్ పదవులు యూనియన్లకు ఎందుకివ్వాలి? అక్రెడిటేషన్ కమిటీల్లో జర్నలిస్టు సంఘాలెందుకు? ప్రెస్ అకాడెమీ చైర్మన్ పదవులు తీసుకోవడం.. పదవీకాలం ముగిసిన తర్వాత మళ్లీ జర్నలిస్టు ముసుగేసుకోవడం. ఇది నైతికమా? అనైతికమా? దానిని పాలకులు ప్రోత్సహించడం ఎంతవరకూ సమంజసమం? జర్నలిజంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వారెవరూ పాలకులకు కనిపించరా? వాటిలో ఆ అనుభవజ్ఞులను నియమించవచ్చు కదా?..అసలు జర్నలిస్టు సంఘాలు కార్మిక చట్టాలను అనుసరిస్తున్నాయా? ఆ మేరకు గుర్తింపు ఉందా? ఇవ న్నీ విక్రమార్కుడూ జవాబివ్వలేని భేతాళ ప్రశ్నలు.