– శబరిమలలో సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్
– వసతులు మెరుగుపరచాలని ఆలయ అధికారులకు వినతిపత్రం అందజేసిన బిసివై పార్టీ అధినేత
శబరిమల: కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన శబరిమల అయ్యప్ప క్షేత్రంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేసే లక్ష్యంతో భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ రెండు రోజుల పాటు శబరిమలలో పర్యటించారు.
రాజకీయాలకు అతీతంగా, ఒక సామాన్య భక్తుడిగా ఆయన ఈ యాత్రను చేపట్టారు. ఈనెల 17న, బుధవారం ఉదయం పుంగనూరు నుండి రోడ్డు మార్గాన బయలుదేరిన రామచంద్రయాదవ్, రాత్రికి శబరిమల సన్నిధానం చేరుకున్నారు. ఈ సందర్భంగా, పంబ నుండి పవిత్ర సన్నిధానం వరకు నడక మార్గంలో భక్తులతో కలిసి ప్రయాణించారు. మార్గమధ్యంలో భక్తులతో ముఖాముఖిగా సంభాషిస్తూ, వారికి అందుతున్న వసతులు, బస, పారిశుధ్యం, వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు.
బుధవారం ఉదయం, ఆయన స్వామి వారి అభిషేక సేవలో పాల్గొన్నారు. తన భక్తిని చాటుకుంటూ స్వామివారికి వెండి దీపపు స్తంభాలను సమర్పించారు. శబరిమలలో నిరంతరం భక్తులకు సేవ చేస్తున్న ఆలయ సిబ్బంది సేవలను గుర్తించి, వారికి వెయ్యి టీ-షర్టులను అందజేసి తన సేవాభావాన్ని చాటుకున్నారు.
పర్యటన అనంతరం, తాను క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో కూడిన ఒక సమగ్ర నివేదికను రూపొందించి, శబరిమల ఆలయ అధికారులకు వినతిపత్రం రూపంలో సమర్పించారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని, ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ, వైద్య సదుపాయాలను పెంచాలని, నడకదారిలో విశ్రాంతి ప్రదేశాలను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను కోరారు.
ఈ సందర్భంగా రామచంద్రయాదవ్ మాట్లాడుతూ, “భక్తుల సేవయే భగవంతుని సేవ. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని ఎంతో కఠోర నియమాలతో ఇక్కడికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం మనందరి బాధ్యత. ఇక్కడి సమస్యలను కేరళ ప్రభుత్వాం దృష్టికి తీసుకెళ్లి, శాశ్వత పరిష్కారం లభించే వరకు మా పార్టీ తరఫున కృషి చేస్తాం” అని తెలిపారు.